Updated : 06/05/2022 05:58 IST

మజ్జిగతో మచ్చలు మాయం...

వేసవి వేడికి చల్లని మజ్జిగ తాగితే దీంట్లోని పోషకాలు శరీరానికి శక్తిని అందించడంతోపాటు దాహాన్నీ తీరుస్తాయి. అదే కాదు... బ్లీచింగ్‌ ఏజెంట్‌, లాక్టిక్‌ యాసిడ్‌ ఉండే మజ్జిగతో చర్మాన్ని, శిరోజాలను కూడా ఆరోగ్యంగా మార్చుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

ఎర్రకందిపప్పు పొడి, శనగపిండి, ముల్తానీమట్టి రెండేసి చెంచాల చొప్పున తీసుకొని అందులో చెంచా నారింజ తొక్కలపొడి వేయాలి. ఇందులో నాలుగైదు చెంచాల మజ్జిగ, రెండు చెంచాల గులాబీనీటిని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి పావుగంట ఆరనిచ్చి చన్నీటితో శుభ్రం చేయాలి. ఎండవల్ల ఏర్పడిన మచ్చలు దూరమై ముఖం మునుపటి వర్చస్సుకు మారుతుంది. మజ్జిగలో ఉండే క్లీనింగ్‌ ఎంజైమ్స్‌ చర్మాన్ని క్లెన్సింగ్‌ చేసి మురికిని పోగొడతాయి. ఇందులోని ప్రొటీన్లు, విటమిన్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ లేపనం వేయొచ్చు.

వేసవిలో బయటికి వెళ్లి వచ్చిన తర్వాత చిటికెడు పసుపు, చందనం పొడిలో సరిపోయినంత మజ్జిగ వేసి ఆ మిశ్రమంతో ముఖాన్ని మృదువుగా మర్దనా చేసి, కడిగితే చర్మం తాజాగా మారుతుంది. ఇలా రోజూ చేసినా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మెత్తగా చేసిన చెంచా బొప్పాయి లేదా టమాటా గుజ్జుకు రెండు చెంచాల మజ్జిగ కలిపి ముఖానికి రాసుకుని శుభ్రం చేసినా మంచి ఫలితం కనిపిస్తుంది.

శిరోజాల సంరక్షణలో... కొన్ని గిరిజన ప్రాంతాల్లో మజ్జిగతో తలస్నానం చేసే సంప్రదాయం ఇప్పటికీ ఉంది. నాలుగు చెంచాల మజ్జిగలో గుడ్డు తెల్లసొన, రెండు చెంచాల చొప్పన ఆలివ్‌నూనె, మెత్తగా చేసిన అరటిపండు గుజ్జు, తేనె కలిపి మిక్సీలో వేయాలి. ఈ మిశ్రమాన్ని మాడు నుంచి జుట్టు చివర్ల వరకు పట్టించి షవర్‌క్యాప్‌తో మూయాలి. 20 నిమిషాల తర్వాత హెర్బల్‌ షాంపూతో తలస్నానం చేస్తే చాలు.
మజ్జిగకు చెంచా నిమ్మరసాన్ని కలిపి తలకు రాసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసినా.. మాడు శుభ్రపడుతుంది. చుండ్రు సమస్య అధికంగా ఉన్నవారు మజ్జిగకు వైట్‌ వెనిగర్‌, నిమ్మరసం కలిపి రాసినా ఫలితం ఉంటుంది. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, విటమిన్లు, కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్‌, జింక్‌, ఫాస్ఫరస్‌ వంటి ఖనిజలవణాలుండే మజ్జిగ మాడుపై చుండ్రు, పొడిబారే తత్వాల్ని దూరం చేస్తుంది. శిరోజాలను ఆరోగ్యంగా ఉండేలా పరిరక్షిస్తుంది. పోషకాలు అందించి ఒత్తుగా పెరగడానికీ దోహదపడుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని