మెంతులతో ముఖం మెరుపు...

ఏ,సీ,కే విటమిన్లు, పొటాషియం, కాపర్‌, జింక్‌ వంటి ఖనిజ లవణాలున్న మెంతులు ముఖాన్ని మెరుపులీనేలా చేస్తాయి. ఆరోగ్యానికే కాదు, అందాన్ని పరిరక్షించడంలోనూ ఇవి ముందుంటాయి అంటున్నారు నిపుణులు. రెండు చెంచాల మెంతులను శుభ్రం చేసి రాత్రంతా గ్లాసు నీటిలో నాననివ్వాలి. ఆ తర్వాత మిక్సీలో పేస్టులా చేసి వడకట్టగా వచ్చిన నీటిని ఓ గిన్నెలో తీసుకోవాలి. ఇందులో చెంచా మొక్కజొన్నపొడి వేసి

Updated : 14 Jun 2022 04:53 IST

ఏ,సీ,కే విటమిన్లు, పొటాషియం, కాపర్‌, జింక్‌ వంటి ఖనిజ లవణాలున్న మెంతులు ముఖాన్ని మెరుపులీనేలా చేస్తాయి. ఆరోగ్యానికే కాదు, అందాన్ని పరిరక్షించడంలోనూ ఇవి ముందుంటాయి అంటున్నారు నిపుణులు.

రెండు చెంచాల మెంతులను శుభ్రం చేసి రాత్రంతా గ్లాసు నీటిలో నాననివ్వాలి. ఆ తర్వాత మిక్సీలో పేస్టులా చేసి వడకట్టగా వచ్చిన నీటిని ఓ గిన్నెలో తీసుకోవాలి. ఇందులో చెంచా మొక్కజొన్నపొడి వేసి ఉండల్లేకుండా బాగా కలిపి పొయ్యిపై ఉంచి దగ్గరపడే వరకు ఉడికించాలి. చల్లార్చిన ఈ మిశ్రమంలో చెంచా చొప్పున కలబంద గుజ్జు, బాదం నూనె, విటమిన్‌ ఈ నూనె వేసి కలపాలి. దీన్ని పొడి సీసాలో నింపి ఫ్రిజ్‌లో భద్రపరుచుకుంటే వారంరోజులు నిల్వ ఉంటుంది. రాత్రి నిద్రపోయే ముందు ఈ క్రీంను ముఖానికి అప్లై చేసి ఆరనిచ్చి, తెల్లవారిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకుంటే మచ్చలు, మొటిమలు దూరం అవుతాయి. ఇది యాంటీ ఏజింగ్‌ ఏజెంట్‌గా పనిచేసి ముఖంపై ముడతలను పోగొడుతుంది.  

జిడ్డు దూరం.. మెంతులను కడిగి ఆరబెట్టి, మిక్సీలో పొడిగా చేసి మృదువైన వస్త్రంతో జల్లించాలి. చెంచా మెంతిపొడికి సరిపడా పాలు కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరనిచ్చి కడిగితే చర్మం మృదువుగా మారుతుంది. క్లెన్సర్‌గా పని చేసి చర్మంలోని మురికిని ఇది బయటకు పంపుతుంది. అలాగే మెంతులను నానబెట్టిన నీటిలో ముంచిన దూది ఉండతో ముఖాన్ని మృదువుగా రుద్దినా చాలు. చర్మరంధ్రాల్లోని జిడ్డు దూరమై, మొటిమలు రాకుండా చేస్తుంది.

టోనర్‌గా.. రాత్రంతా అరకప్పు నీటిలో రెండు చెంచాల మెంతులను నానబెట్టాలి. ఉదయాన్నే నీటిని వడకట్టి స్ప్రే సీసాలో నింపి భద్రపరుచుకోవాలి. ముఖానికి మాయిశ్చరైజర్‌ రాశాక ఈ నీటిని స్ప్రే చేసుకుంటే టోనర్‌గా పనిచేసి, మెరుపునందిస్తుంది. అలాగే నానబెట్టిన మెంతులను పేస్ట్‌లా చేసి స్క్రబ్బింగ్‌గా వినియోగించినా చాలు. ముఖంపై మృత కణాలు తొలగుతాయి. చర్మరంధ్రాల్లో నిల్వ ఉండే నూనె బయటకు పోతుంది. దీంతో మొటిమలు, మచ్చల సమస్యకు దూరంగా ఉండొచ్చు.

పొడారకుండా.. ఆరేడుగంటలు నీటిలో నానబెట్టిన రెండు చెంచాల మెంతులను పేస్ట్‌లా చేసి రెండు చెంచాల పెరుగు, చెంచా తేనె కలిపిన మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి పావుగంట ఆరనిచ్చి కడిగితే చాలు. ఇది చర్మానికి మాయిశ్చరైజర్‌లా పనిచేసి పొడారకుండా సంరక్షిస్తుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ముఖచర్మాన్ని నిత్యం ఆరోగ్యంగా ఉంచుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్