ఏడవండి.. ఫర్వాలేదు!

అమ్మాయిలు సున్నితం బాబోయ్‌.. కదిలిస్తే ఏడ్చేస్తారు. సౌమ్యంగా చెప్పినా, వెటకారంగా అన్నా.. త్వరగా స్పందించే గుణం ఎక్కువగా ఆడవాళ్లలోనే ఉంటుందన్నది వాస్తవం.

Published : 23 Feb 2023 00:05 IST

అమ్మాయిలు సున్నితం బాబోయ్‌.. కదిలిస్తే ఏడ్చేస్తారు. సౌమ్యంగా చెప్పినా, వెటకారంగా అన్నా.. త్వరగా స్పందించే గుణం ఎక్కువగా ఆడవాళ్లలోనే ఉంటుందన్నది వాస్తవం. అధ్యయనాలూ ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ఎవరైనా ఏమైనా అనుకుంటారు, బలహీనతగా లెక్కేస్తారని బాధని నొక్కిపెట్టేవారే అధికం. అదే వద్దంటున్నారు నిపుణులు!

* భరించలేని బాధే కాదు.. హార్మోనుల్లో మార్పులు, పెరిగిపోతున్న ఒత్తిడి, నిర్లక్ష్యం అవుతున్నానన్న భావన ఏది కలిగినా మనసు చివుక్కుమంటుంది. అది తట్టుకోలేక పోయినప్పుడే కళ్లు చెమ్మగిల్లుతాయి. కానీ దాన్ని అణచిపెడితే మానసిక ఒత్తిడే! కాబట్టి, బాధ కలిగిందా ఏడ్చేయండి.

* మన మీద మనకు ప్రేమ ఉండాలంటారు కదా! జాలి కూడా అవసరమేనట! కన్నీరు కార్చడం మన మీద మనం చూపే జాలే. పైగా మనసులోని బాధను బయటకు పంపే మార్గం కూడా. అదనంగా పేరుకున్న ఒత్తిడీ దూరమవుతుంది.

* తనివితీరా ఏడ్చాక మనసంతా తేలిక పడినట్టు అనిపించడం గమనించారా? ఆ సమయంలో మెదడు ఆక్సిటోసిన్‌, ఎండార్ఫిన్లు వంటి మనసు తేలికపడే హార్మోన్లను విడుదల చేయడమే కారణం. బాధ గూడు కట్టుకొని పోయినప్పుడు ఆలోచనా తీరుపైనా ప్రభావం పడుతుంది. ఒకసారి మనసు తేలికపడితే సానుకూల ఆలోచనలకూ ఆస్కారం ఉంటుంది.

* ఏడుపు కూడా ఒకరకమైన భావోద్వేగమే! ఇంకా ఎదగాలి, మానసికంగా బలహీనురాలు.. ఇలా ఎన్ని అన్నా పట్టించుకోవద్దు. దుఃఖం కట్టలు తెంచుకుందా తనివితీరా ఏడ్చేయండి. నెగెటివిటీ అంతా బయటకు వెళ్లిపోతుంది. అయితే.. ఇది అన్నింటినీ మనసులో దాచి పెట్టుకునే వారి కోసమే! ఊ అంటే కుళాయి తిప్పే వాళ్లకు మాత్రం ఈ సూత్రం వర్తించదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్