పిల్లల్లేకుండా వెళ్లిరండలా...

పిల్లలు పుట్టాక మనలోకమంతా వాళ్లే అవుతారు. శ్రీవారితో గడిపే సమయమే తగ్గుతుంది. సరదాగా ఏదైనా మాట్లాడదామనుకుంటామా... ‘అమ్మా...’ అంటూ ప్రతిచిన్నదానికీ పిలుపు వస్తూనే ఉంటుంది.

Published : 22 Mar 2024 01:37 IST

పిల్లలు పుట్టాక మనలోకమంతా వాళ్లే అవుతారు. శ్రీవారితో గడిపే సమయమే తగ్గుతుంది. సరదాగా ఏదైనా మాట్లాడదామనుకుంటామా... ‘అమ్మా...’ అంటూ ప్రతిచిన్నదానికీ పిలుపు వస్తూనే ఉంటుంది. దీంతో తెలియకుండానే ఇద్దరి మధ్యా కాస్త దూరం పెరుగుతుంది. అది కొనసాగొద్దంటే ‘చైల్డ్‌ ఫ్రీ వెకేషన్‌’ కావాల్సిందే అంటున్నారు నిపుణులు.

  • ఏనుగుల్లో ఒక విచిత్రమైన అలవాటు ఉంటుంది. తల్లి ఏనుగు బిడ్డ ఆలనాపాలనా చూసుకుంటూ అలసిపోతే... దాని బాధ్యతను చుట్టూ ఉన్న వేరేవి తీసుకుంటాయట. ఆ తల్లి ఏనుగు తగినంత విశ్రాంతి తీసుకునేలా చేస్తాయట. దీన్నే ‘అలో మదరింగ్‌’ అంటారు. మన సంగతేంటి? అలసిపోయా అనిపించినప్పుడో, సరదాగా భాగస్వామితో ఊసులు చెప్పాలి అనిపించినప్పుడో మనకీ ఆ అవకాశం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా! అలాంటప్పుడు భాగస్వామితో అలా చిన్న పర్యటనకు వెళ్లి రండి. ఇప్పుడదో ట్రెండ్‌ కూడా!
  • ‘పిల్లల్లేకుండా అలా వెళ్లి రావడం బాగుంటుందా?’ చాలామంది చేసే ఆలోచనే అది. అమ్మానాన్నలు అవ్వడానికి ముందు మీరు దంపతులు. గతంలో ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకోవడం, అలా బయటికి వెళ్లి రావడం లాంటివి ఎన్ని చేసుంటారు? మరి ఆ తర్వాతో! తెలియకుండానే ఇవి అసంతృప్తిలా గూడు కట్టుకుంటాయి. అది మీ బంధానికే ప్రమాదం కూడా!
  • విహారం అంటే వారాలపాటు చేయాల్సిన పనిలేదు. రెండు రోజులైనా చాలు. ‘పిల్లల్నీ తీసుకెళితే వాళ్లూ ఆనందిస్తారుగా’ అంటారా? వాళ్లకి తిండి, అన్నీ అమర్చడం వంటివన్నీ శ్రమేగా? ఇక మీకు విశ్రాంతి ఏది? అందుకే ఈ విరామ సమయంలో అలాంటివేమీ లేకుండా హాయిగా సేదతీరండి. ఈక్రమంలో పిల్లలను అశ్రద్ధ చేస్తున్నామని మీరూ అనుకోవద్దు, ఎవరైనా అన్నా వినిపించుకోవద్దు. దూరం ప్రేమను పెంచుతుంది అన్న మాట విన్నారుగా? అది పిల్లలకీ వర్తిస్తుంది. మిమ్మల్ని ఎంతగా మిస్‌ అయ్యారో కథలుగా చెబుతారు. కావాలంటే ప్రయత్నించండి... అదీ ఓ కొత్త అనుభూతే!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్