యూరప్‌ అందాల్ని చూపిస్తోన్న ముద్దపప్పు ఆవకాయ్‌!

వృత్తితో పాటు ప్రవృత్తికీ ప్రాధాన్యం ఇస్తోంది ఈతరం. అందుకు సామాజిక మాధ్యమాల్నే వేదికగా చేసుకుని అడుగులేస్తోంది. అలా విదేశీ వింతల్ని చూపిస్తూ, తెలుగుదనాన్ని పంచుతోన్న యూట్యూబర్స్‌లో సుంకర దీప్యాశరణ్య ఒకరు. ‘యూరప్‌లో ముద్దపప్పు ఆవకాయ్‌’ అంటూ.. ఆస్ట్రియా నుంచి లక్షల మంది వీక్షకులను అలరిస్తోన్న ఆమె... వసుంధరతో ముచ్చటించారు.

Updated : 30 Oct 2021 08:03 IST

వృత్తితో పాటు ప్రవృత్తికీ ప్రాధాన్యం ఇస్తోంది ఈతరం. అందుకు సామాజిక మాధ్యమాల్నే వేదికగా చేసుకుని అడుగులేస్తోంది. అలా విదేశీ వింతల్ని చూపిస్తూ, తెలుగుదనాన్ని పంచుతోన్న యూట్యూబర్స్‌లో సుంకర దీప్యాశరణ్య ఒకరు. ‘యూరప్‌లో ముద్దపప్పు ఆవకాయ్‌’ అంటూ.. ఆస్ట్రియా నుంచి లక్షల మంది వీక్షకులను అలరిస్తోన్న ఆమె... వసుంధరతో ముచ్చటించారు.

లోచనల్లోనే ఉంటే... ఫలితం ఎప్పటికీ కనిపించదు. ఒక్క అడుగు వేసినా చాలు... మరో అడుగు వేయడానికి దారి కనిపిస్తుంది. కొత్త ప్రపంచం పరిచయమవుతుంది. నాకూ ఇదే జరిగింది. ‘యూరప్‌లో ముద్దపప్పు ఆవకాయ్‌’తో మరో కొత్త జీవితాన్నే సృష్టించుకోగలిగాను. అదెలా అంటే... మాది విజయవాడ. నాన్న బ్యాంకు ఉద్యోగి. అమ్మ గృహిణి. ఇల్లు, మా ఊరే నా ప్రపంచం. ఎంబీఏ కోసం మొదటిసారి ఊరు దాటి... చెన్నై వెళ్లా. అక్కడికి ఒక్కదాన్నే ట్రెయిన్‌లో వెళ్లొచ్చేదాన్ని. ఆ ప్రయాణం సరదాగా ఉండేది. అప్పటి నుంచి ఏ కొత్త ప్రదేశానికి వెళ్లాలన్నా, అందులోనూ సోలో ట్రావెలింగ్‌ అంటే... ముందుండే దాన్ని. ఆస్ట్రియాలో బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో ఎంఎస్‌ చేశా. డిజిటల్‌ మార్కెటింగ్‌ ఎనలిస్ట్‌గా చేరా. అక్కడే సైంటిస్ట్‌గా పనిచేస్తోన్న రాజుతో పరిచయం, పెళ్లి వెంట వెంటనే జరిగిపోయాయి. అక్కడే స్థిరపడాలనుకున్నాం.

స్నేహితుల సలహాతో.... అక్కడ వారాంతాల్లో టూర్లూ, ట్రెక్కింగ్‌, హైకింగ్‌ చేసేదాన్ని. అవన్నీ ఇండియాలోని స్నేహితులకు చెబుతుంటే.. వీడియోలు తీసి యూట్యూబ్‌లో పెట్టమనే వారు. నేనాసక్తి చూపలేదు. ఈలోగా కరోనాతో పరిస్థితులు మారిపోయాయి. వర్క్‌ఫ్రమ్‌ హోంతో ఇంటికే పరిమితమయ్యాం. మేమెలా ఉన్నామో అని ఇండియాలో మా వాళ్లంతా కంగారు పడేవారు. వారికోసం వీడియోలు తీయాలనుకున్నా. అత్తింటి వారు, బంధువులు ఏమనుకుంటారో అనుకున్నా. మా వారే ధైర్యం చెప్పారు. ఇప్పుడు వాళ్లే నాకు సలహాలు ఇస్తున్నారు. ఏదైనా భిన్నంగా చేయాలన్నది నా ఆలోచన. యూరప్‌లో చదువు, ఉద్యోగ అవకాశాలు, పర్యటక ప్రదేశాలు... ఇలా ఎన్నో నా జాబితాలో చేర్చుకున్నా. మొదటి తొమ్మిది నెలలూ పెద్దగా వ్యూస్‌ లేవు. ‘రవి తెలుగు ట్రావెలర్‌’తో కలిసి ఓ ఇంటరాక్షన్‌ వీడియో చేశా. తర్వాత... నా ఛానెల్‌కి సబ్‌స్క్రైబర్స్‌ వెల్లువ మొదలైంది. ఓ సంవత్సరం ఆదాయమేమీ లేదు. ఇప్పుడు వస్తోన్న మొత్తాన్నీ వీడియోలకే ఖర్చుపెడుతున్నాం. ‘యూరప్‌లో ముద్దపప్పు ఆవకాయ్‌!’ అనెందుకు పెట్టావని అడుగుతుంటారు. తెలుగు నేపథ్యాన్ని ప్రతిబింబించడం కోసం ఆ పేరెంచుకున్నా.  

ఆస్ట్రియా అందాల్ని చూపిస్తూ... చాలామందికి విదేశీ పర్యటనలు అనగానే... స్విట్జర్లాండ్‌, జర్మనీ వంటివే గుర్తొస్తాయి. అలాంటి వాతావరణమే ఆస్ట్రియాలోనూ ఉంటుంది. ఎత్తైన కొండలు, పెద్ద ఎత్తున కురిసే మంచుతో... అద్భుతంగా కనిపిస్తాయి. అందుకే ఈ అందాలను చూపించడంతోనే వీడియోలు మొదలు పెట్టా. తర్వాత ప్రాగ్‌, వియన్నా, స్విట్జర్లాండ్‌, జర్మనీ, పోర్చుగల్‌... ఇలా దాదాపు పది దేశాలు తిరిగా. ఎంత దూరమైనా కారులోనే వెళ్తా. అలా అయితే దారిలో ఎన్నో గ్రామాలు, అద్భుత ప్రదేశాలు చూడొచ్చు. నా వీడియోల్లో ప్రాగ్‌లో విదేశీ అమ్మాయిలు చీరలు కట్టుకున్నది, ఆస్ట్రియాలో ట్రాన్స్‌జెండర్‌ల ఈవెంట్‌, క్యాంపింగ్‌ సిరీస్‌కు మంచి స్పందన వచ్చింది. 2020 జులైలో ప్రారంభిస్తే ఇప్పటికి నా ఛానల్‌కు 40 లక్షలకు పైగా వ్యూసొచ్చాయి. ఆస్ట్రియాలో శుక్రవారం ఒక్కపూటే కార్యాలయాలు పనిచేస్తాయి. ఆ రోజు మధ్యాహ్నం నుంచి సోమవారం ఉదయం వరకూ మా ప్రయాణాలకు టైమ్‌ సరిపోతుంది. కొన్ని ట్రిప్‌లయితే ఆరునెలల ముందే ప్లాన్‌ చేసుకుంటా. ఒంటరిగా పర్యటనలు చేసేటప్పుడు ఇబ్బందులూ ఎదురవుతాయి. పోర్చుగల్‌కి వెళ్లినప్పుడు తెలియక శివార్లలో ఓ హాస్టల్‌ బుక్‌ చేసుకున్నా. అక్కడ వారంతా నన్ను కామెంట్‌ చేస్తూ, గమనిస్తూ ఉంటే ఇబ్బందిగా అనిపించి... అప్పటికప్పుడు మరో రూమ్‌ వెతుక్కున్నా. ఇలా అనుభవాల నుంచి పాఠాలెన్నో నేర్చుకున్నా. వీడియోలు తీయడం, ఎడిటింగ్‌ వంటివన్నీ ఐఫోన్‌ 11లోనే చేస్తున్నా. ప్రపంచం మొత్తం చుట్టేయాలనేది నా కోరిక. అమ్మాయిలూ... ఏ ఉద్యోగం/ వృత్తిలో ఉన్నా అభిరుచులను వదులుకోనక్కర్లేదు. ప్రణాళిక, శ్రమ, సృజనాత్మకతలతో మన కలల్ని, కళల్ని పండించుకోవచ్చు. అందుకు నేనే ఉదాహరణ.

ఎక్కడకెళ్లినా గుర్తుపడుతున్నారు... ఈ మధ్య ఇండియాకు వచ్చా. ఇక్కడ నన్ను గుర్తుపడతారనుకోలేదు. ఓ చీరల షాపులోకి వెళ్తే పెద్దాయన ఒకరు ‘మీరు యూరప్‌లో ముద్దపప్పు ఆవకాయ్‌ కదా’ అన్నారు. మాస్క్‌ పెట్టుకున్నా గుర్తుపట్టడంతో షాక్‌ అయ్యా. నా వీడియోలను అన్ని వయసుల వారూ చూస్తున్నారని అర్థమైంది. ‘మేం ఎక్కడికీ వెళ్లలేమమ్మా. చక్కటి తెలుగులో మా అందరికీ యూరోప్‌ అంతా చూపిస్తున్నావు’ అని ప్రశంసించారు.

ఒంటరిగా వెళ్తున్నారా?

సోలోగా పర్యటనలకు వెళ్లే అమ్మాయిలు.... ముందుగానే ఆ ప్రాంతం గురించి పూర్తిగా తెలుసుకుని వెళ్తే మంచిది.

* బసను ఎంపిక చేసుకునే హాస్టల్స్‌, హొటల్స్‌ రేటింగ్‌, అవి ఉన్న ప్రదేశం ఎలా ఉందో కూడా చూసుకోండి. వీలైనంత వరకూ జనసమ్మర్థం ఉన్న ప్రాంతాల్లోనే వాటిని ఎంచుకోండి.

మీరు ఎక్కడికి వెళ్లినా... అక్కడ టూరిస్ట్‌లా కనిపించకుండా ఉండటానికి ప్రయత్నించండి.

* ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్తే... అక్కడికి పగటి పూట మాత్రమే చేరుకునేలా చూసుకోండి. మీ ప్రణాళికకు సంబంధించి ఒక ఫ్రెండ్‌కి, కనీసం ఇంట్లోవాళ్లకి అయినా విషయం చెప్పండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్