విమేనియా... ఇది అమ్మాయిల బ్యాండ్‌!

మగవాళ్లు మాత్రమే, అబ్బాయిలూ- అమ్మాయిలూ ఉండే మ్యూజిక్‌ బ్యాండ్‌లూ చాలానే చూసుంటారు. కానీ అమ్మాయిలు మాత్రమే ఉండే బ్యాండ్‌ని చూడటం అరుదు. దీన్నో సవాలుగా స్వీకరించిన స్వాతి సింగ్‌... ‘విమేనియా’ పేరుతో కేవలం అమ్మాయిలతో ఓ మ్యూజిక్‌ బ్యాండ్‌ని ఆరేళ్లుగా నడుపుతోంది.

Published : 16 Mar 2022 00:42 IST

మగవాళ్లు మాత్రమే, అబ్బాయిలూ- అమ్మాయిలూ ఉండే మ్యూజిక్‌ బ్యాండ్‌లూ చాలానే చూసుంటారు. కానీ అమ్మాయిలు మాత్రమే ఉండే బ్యాండ్‌ని చూడటం అరుదు. దీన్నో సవాలుగా స్వీకరించిన స్వాతి సింగ్‌... ‘విమేనియా’ పేరుతో కేవలం అమ్మాయిలతో ఓ మ్యూజిక్‌ బ్యాండ్‌ని ఆరేళ్లుగా నడుపుతోంది.

స్వాతి సింగ్‌, శాకాంబరీ కొట్నాల, శ్రీవిద్య కొట్నాల, విజుల్‌ చౌదరి... దెహ్రాదూన్‌ కేంద్రంగా పనిచేసే విమేనియా మహిళా మ్యూజిక్‌ బ్యాండ్‌లో సభ్యులు. దీన్లో స్వాతి లీడ్‌ వోకలిస్ట్‌, గిటారిస్ట్‌గా, శాకాంబరి గిటారిస్ట్‌గా, శ్రీవిద్య డ్రమ్స్‌ ప్లేయర్‌గా, విజుల్‌ చౌదరి కీబోర్డ్‌ ప్లేయర్‌గా పనిచేస్తున్నారు. 2016 మార్చి 8న, ఈ బ్యాండ్‌ తొలి స్టేజ్‌ ప్రదర్శనకు అనూహ్య స్పందన వచ్చింది. దాంతో స్వాతితోపాటు సభ్యులందరికీ ఈ బ్యాండ్‌తో సంగీత ప్రపంచంలో మహిళల ఉనికి చాటగలమనే ధైర్యం వచ్చింది. అప్పట్నుంచీ ఎన్ని ఆటంకాలు ఎదురైనా నిర్విరామంగా బ్యాండ్‌ను కొనసాగిస్తున్నారు. మొదట్నుంచీ ఈ నలుగురూ బృందంలో ఉన్నారు. నిజానికి ఈ బ్యాండ్‌ స్థాపన స్వాతి జీవిత లక్ష్యం. అందుకు కారణం ఆమెకు సంగీతంపై ఉన్న మమకారమే. దీనికోసం చాలా త్యాగాలే చేసిందామె.

ప్రభుత్వ ఉద్యోగం వదిలి... స్వాతి సొంతూరు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌. తల్లి ప్రభుత్వ పాఠశాలలో సంగీతం టీచర్‌. దాంతో చిన్నప్పట్నుంచే స్వాతిపైన సంగీత ప్రభావం పడింది. తను చాలా చక్కగా పాటలు పాడుతుంది. గిటారు, సహా పలు వాయిద్యాలు నేర్చుకుంది. మరోవైపు బాగా చదువుకుని ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగమూ సంపాదించింది. ఏ పనిలో ఉన్నా ఆలోచనలు మాత్రం సంగీతం చుట్టూనే తిరుగుతుండేవి స్వాతికి.  ముఖ్యంగా స్టేజీమీద ప్రేక్షకుల సమక్షంలో సంగీత ప్రదర్శనలు ఇవ్వాలని కలలుగనేది. అందుకే టీచర్‌గా చేరిన కొద్ది నెలలకే తను ఉండాల్సింది స్కూల్లో కాదనుకుంది. ఇంట్లో వాళ్లు వ్యతిరేకించినా ఆ ఉద్యోగాన్ని వదిలేసింది. తర్వాత కార్పొరేట్‌ రంగంలో అడుగుపెట్టింది. కొన్నాళ్లకు బదిలీమీద ఉత్తరాఖండ్‌లోని దెహ్రాదూన్‌ వెళ్లింది. 2007లో అక్కడే మ్యూజిక్‌ స్కూల్‌ పెట్టింది కూడా. విమేనియా బ్యాండ్‌లోని సభ్యులందరూ స్వాతి శిష్యులే. శ్రీవిద్యని సంగీతం స్కూల్లో చేర్చాక స్వాతి ప్రోత్సాహంతో ఆమె తల్లి శాకాంబరీ కూడా గిటార్‌ నేర్చుకుంది. ‘ఇతర మ్యూజిక్‌ బ్యాండ్‌లలో అమ్మాయిలు ఉన్నా వారిలో ఎక్కువగా గాయకులే ఉంటారు. మహిళలూ వాయిద్యాలు వాయించగలరని నిరూపించడానికి అమ్మాయిలు మాత్రమే ఉండే బ్యాండ్‌ పెట్టాలనుకున్నా’ అంటుంది స్వాతి. ఈ బ్యాండ్‌ కోసం కార్పొరేట్‌ ఉద్యోగమూ వదిలేసింది.

ఈ బ్యాండ్‌ మొదట్లో సినిమా పాటల కవర్స్‌తో మొదలుపెట్టినా, తర్వాత స్థానిక గర్వాల్‌ జానపదాలూ తమదైన శైలిలో పాడుతున్నారు. వరకట్నం, లైంగిక వేధింపులు, మహిళా సాధికారత వంటి సామాజిక అంశాలపైనా గళం వినిపిస్తోంది విమేనియా. ఉత్తరాఖండ్‌ దాటి రాజస్థాన్‌, పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలోనూ ప్రదర్శనలు ఇస్తోంది. పెద్ద స్థాయిలో షో చేయాల్సి వచ్చినపుడు మరికొందరు మహిళా వాద్యకారుల్ని తాత్కాలికంగా చేర్చుకుంటారు. ‘ఈ ఆరేళ్ల ప్రయాణం ఏమంత సులభంగా సాగలేదు. క్లాసికల్‌, సూఫీ ఫ్యూజన్స్‌ చేస్తూ మాకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాం. మహిళలు ఎదుర్కొనే వివక్షల్నీ రుచి చూశాం’ అంటారు స్వాతి. కొద్దికాలంగా వీడియో ఆల్బమ్‌లను యూట్యూబ్‌లో పెడుతూ అక్కడా ప్రభంజనాన్ని సృష్టిస్తోంది విమేనియా. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఈ బ్యాండ్‌ని ‘బేటీ బచావో బేటీ పఢావో’ కార్యక్రమానికి ప్రచారకర్తగా నియమించడం విశేషం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్