ఆ మెసేజే.. ముందుకు నడిపింది!

డ్యాన్సర్‌గా.. నృత్యదర్శకుడు ఆట సందీప్‌ శ్రీమతిగా ఆమె సుపరిచితురాలు! కానీ తనలోని సేవాకోణం కొందరికే తెలుసు. అదేమంటే.. ‘చేసేది చిన్న సాయమే... దానికి ప్రచారమెందుకు’ అంటుంది జ్యోతిరాజ్‌..వసుంధర పలకరించగా... తన ప్రయాణాన్ని చెప్పుకొచ్చిందిలా...!

Published : 27 Mar 2022 01:07 IST

డ్యాన్సర్‌గా.. నృత్యదర్శకుడు ఆట సందీప్‌ శ్రీమతిగా ఆమె సుపరిచితురాలు! కానీ తనలోని సేవాకోణం కొందరికే తెలుసు. అదేమంటే.. ‘చేసేది చిన్న సాయమే... దానికి ప్రచారమెందుకు’ అంటుంది జ్యోతిరాజ్‌..
వసుంధర పలకరించగా... తన ప్రయాణాన్ని చెప్పుకొచ్చిందిలా...!

రంగల్‌ అమ్మాయిని. నాన్న విజేందర్‌.. వ్యాపారి, అమ్మ జయశ్రీ. నలుగురమ్మాయిల్లో నేనే చిన్న. సుధాచంద్రన్‌, భానుప్రియ, శోభన లాంటి వాళ్లని చూసి నేనూ డ్యాన్సర్‌ అవ్వాలనుకున్నా. అమ్మ ఒప్పుకోలేదు. టీవీ చూసే సాధన చేసేదాన్ని. ఇంటర్‌లో నేను వెస్ట్రన్‌ నేర్పితే బదులుగా నాకు శాస్త్రీయ నృత్యం నేర్పే ఒప్పందంతో ఓ సంస్థలో చేరా. అప్పుడే తమిళంలో గుర్తింపు తెచ్చుకున్న మనమ్మాయి ఆనందికి ఓ డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌ కోసం వెస్ట్రన్‌ డ్యాన్స్‌ నేర్పించా. తనతోపాటు ఆడిషన్స్‌కి వెళ్లా. స్టెప్స్‌ మర్చిపోతుందని కింది నుంచి చూపిస్తున్నా... అది చూసి నిర్వాహకులు నన్నూ ప్రయత్నించమన్నారు. అనుకోకుండా ఎంపికయ్యా. కాకపోతే హైదరాబాద్‌ వెళ్లాలి. అప్పటికి నాకు 16 ఏళ్లే. మా అమ్మేమో ఇంటర్‌ కాగానే అమ్మాయికి పెళ్లి చేసి పంపాలంటుంది. టీవీ షో అంటే తను ససేమిరా అంది. నేను తిండి మానేసి మరీ ఒప్పించి వెళ్లా. గెలవలేదు కానీ.. గుర్తింపు వచ్చింది. దీంతో సినిమా, సీరియల్‌ అవకాశాలొచ్చాయి. ఎప్పట్లాగే ఇంట్లో అనుమతివ్వ లేదు. ఈ క్రమంలోనే ఓ రియాలిటీ షోలో ఆట సందీప్‌ పరిచయమయ్యారు. స్నేహం ప్రేమగా మారింది. డ్యాన్సే నా లోకం. దాంతో సంబంధమున్న వ్యక్తినే చేసుకునే అవకాశం రావడంతో చాలా సంతోషం కలిగింది. ఇంట్లో వాళ్లూ అభ్యంతరం చెప్పలేదు. పెళ్లి, బాబుతో ఆరేళ్లు గడిచిపోయాయి.

లాక్‌డౌన్‌లో సరదాగా మావారితో కలిసి మళ్లీ డ్యాన్స్‌ మొదలుపెట్టా. వాటిని యూట్యూబ్‌ ఛానెల్‌లో, ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసే వాళ్లం. మిలియన్లలో వ్యూస్‌, ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఫాలోయర్లూ పెరిగారు. అప్పటిదాకా ఏదో లోటుతో ఉండే జీవితం సంపూర్ణమైందన్న ఆనందం. కానీ.. ఓ రోజు కామెంట్లలో ‘మీ కడుపు నిండుతోంది. కాబట్టి, ఆనందంగా ఉన్నారు. మాకు తినడానికే లేదు’ అని పెట్టారు ఎవరో. తిండి లేదంటూ డ్యాన్సర్లు వీడియోలు పంపుతుండేవారు. సందీప్‌ది మొదట్నుంచీ సాయం చేసే గుణం. తనలో నాకు నచ్చిందీ అదే. ఆ మెసేజ్‌లు మమ్మల్ని ఆలోచింపజేశాయి. మొదట్లో వాళ్ల అకౌంట్లకు తోచింది పంపే వాళ్లం. కానీ అడిగే వాళ్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. కొందరు ఆర్థిక బాధలతో ఆత్మహత్యకూ ప్రయత్నించారని తెలిసి చాలా బాధేసింది. మా దగ్గర ఉన్న దాంతో 200 మంది వరకూ సాయం చేయగలం అనుకున్నాం. అప్పటి నుంచి మా వీడియోల్లో డ్యాన్స్‌ తర్వాత సాయం చేయమని కోరే వాళ్లం. తెలిసిన వాళ్లనీ సంప్రదించాం. దేశ విదేశాల్లోని మా ఫాలోయర్లు డబ్బులు పంపే వారు. వాటితో బియ్యం, పప్పులు, కూరగాయలు పంచే వాళ్లం. దీన్ని చూసి... అనాథాశ్రమాలు, వికలాంగులు, మరికొందరూ సంప్రదించడం మొదలుపెట్టారు. రెండో లాక్‌డౌన్‌లో వెయ్యి మందికిపైగా నెలవారీ సరుకులు అందించాం. అవి తీసుకుంటున్నప్పుడు వాళ్ల కళ్లలో ఆనందాన్ని చెప్పలేను. అన్నీ మేమే కొనుక్కొచ్చి, వెళ్లి పంచే వాళ్లం. ఇంట్లో వాళ్లేమో మాకేమైనా అవుతుందేమోనని భయపడే వారు. అప్పట్లో నాకూ కొవిడ్‌ వచ్చింది. అయినా మా కార్యక్రమాల్ని ఆపలేదు.

లాక్‌డౌన్‌ ముగిశాక మేమూ పనిలో పడ్డాం. ఇప్పటికీ ఫోన్లు వస్తుంటాయి. కొందరు ‘మేమడిగిందెంత? ఆ మాత్రం ఇవ్వలేరా’ అని తిడతారు. కొన్నిసార్లు మోసపోయాం కూడా. కానీ మేమూ కష్టంపై బతుకుతున్న వాళ్లమే. అలాగని సేవను ఆపలేదు. వీలు చేసుకుని అనాథ, వృద్ధాశ్రమాలకు వెళుతుంటాం. ఆహారం, మందులతోపాటు ఆర్థిక సాయం కావాలన్నప్పుడు మేం కొంత ఇచ్చి, వేరే వాళ్లని అడిగీ ఇస్తుంటాం. మేం చేసేది చిన్నసాయమే, అందుకే దాన్ని గురించి ఎక్కడా పెద్దగా చెప్పం.

మా బాబుకి ఓ మంచి ఉదాహరణవ్వాలనుకుంటా. అమ్మానాన్న ఎంత కష్టపడితే వాడికి ఇవన్నీ దక్కుతున్నాయన్నది తెలిసేలా పెంచుతున్నాం. తిరిగి కెరియర్‌ ప్రారంభించా. తపన ఉంటే ఏదీ అడ్డు కాదన్నది నా అభిప్రాయం. కాకపోతే కొంచెం ధైర్యం, ఓపికతో ఉండాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్