అమ్మాయిలూ.. అండగా మేమున్నాం!

సంపాదించే వ్యక్తి దూరమైతే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? ఆప్తుడిని కోల్పోయిన బాధ ఒకవైపు.. భవిష్యత్‌ ఏమిటన్న భయం మరోవైపు. ఈ సమయాన్నే ఆసరాగా తీసుకుని వంచించే వారూ ఉంటారు. ఇటువంటి వారికి మేమున్నాం అని ఆదరువు కల్పిస్తోంది

Published : 05 Apr 2022 01:18 IST

సంపాదించే వ్యక్తి దూరమైతే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? ఆప్తుడిని కోల్పోయిన బాధ ఒకవైపు.. భవిష్యత్‌ ఏమిటన్న భయం మరోవైపు. ఈ సమయాన్నే ఆసరాగా తీసుకుని వంచించే వారూ ఉంటారు. ఇటువంటి వారికి మేమున్నాం అని ఆదరువు కల్పిస్తోంది మధుర దాస్‌గుప్తా సిన్హా. ‘ఆస్పైర్‌ ఫర్‌ హర్‌’ సంస్థ సాయంతో వారి జీవితాల్లో కొత్త ఆశలు పూయిస్తోందిలా..

‘దేవుడు నాకు అన్యాయం చేశాడు.. ఇక ఈ జీవితాన్ని కొనసాగించలేను’ రష్మి లంబా వాట్సాప్‌ కాంటాక్ట్స్‌లోని ఒకరి స్టేటస్‌ ఇది. వెంటనే రష్మి ఆమెకు ఫోన్‌ చేసి మాట్లాడారు. భర్త చనిపోయి, మూడేళ్ల కూతురిని ఎలా పోషించాలో పాలుపోక ఆమె ఈ నిర్ణయానికి వచ్చింది. ఆమెను కౌన్సెలర్‌ దగ్గరికి తీసుకెళ్లింది రష్మి. ఇప్పుడామె ఉద్యోగ సాధనలో భాగంగా ఇంటర్వ్యూలకు సిద్ధమవుతోంది.

పెళ్లయిన ఆరేళ్లకు కూతురు పుట్టింది. ఆ పాప మొదటి పుట్టినరోజుకి ఇంకా నెల రోజులుందనగా ఆమె భర్త చనిపోయాడు. బంధువులు ఆదరించకపోగా వీధిపాలు చేశారు. ఆమెకు భవిష్యత్‌ ఏంటో అర్థం కాలేదు. అలాంటి ఆమె ఇప్పుడు చదువు కొనసాగించేలా చేసింది రీమాసేన్‌. ఇప్పుడు ఆ మహిళ తన కెరియర్‌లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది.

వీరికి ప్రోత్సాహాన్నిచ్చి దన్నుగా నిలిచిన రష్మి, రీమాలిద్దరూ ‘ఆస్పైర్‌ ఫర్‌ హర్‌’ సంస్థ సభ్యులే. ‘నాట్‌ ఎలోన్‌’ పేరిట సాగిస్తున్న కార్యక్రమానికి ఒకరు మెంటర్‌ కాగా, మరొకరు లీడ్‌. ప్రస్తుతం దీనిలో 60 దేశాల నుంచి 43 వేలమందికిపైగా సభ్యులున్నారు. 100 మందికిపైగా పేరొందిన మెంటర్లు దీని కోసం పనిచేస్తున్నారు. మధుర దాస్‌గుప్తా సిన్హా ఈ సంస్థను స్థాపించారు. ఇది మహిళల కోసం మహిళలే నడిపిస్తున్న సంస్థ. మధుర దాస్‌గుప్తాకి బ్యాంకింగ్‌ రంగంలో 25 ఏళ్ల అనుభవం ఉంది. స్టాండర్డ్‌ చార్టర్డ్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంకు వంటి ప్రముఖ బ్యాంకుల్లో నాయకత్వ హోదాలో పనిచేసింది. మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలని ఈమె బలంగా నమ్ముతుంది. ఇది తన తల్లిదండ్రుల నుంచే నేర్చుకున్నానంటుంది మధుర. అందుకే మొదట్నుంచీ కెరియర్‌పై దృష్టిపెట్టింది. మగవాళ్లతో పోటీపడి తనను తాను నిరూపించుకోవాలనుకునేది. ఆ తత్వమే తనను ఎన్నో సంస్థల్లో నాయకత్వ హోదాలో నిలబెట్టింది. ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, తర్వాత జంషెడ్‌పూర్‌ నుంచి ఫైనాన్స్‌ అండ్‌ మార్కెటింగ్‌లో ఎంబీఏ పూర్తిచేసి బ్యాంకింగ్‌ రంగంలోకి ప్రవేశించింది మధుర. ఎంతోమంది అమ్మాయిలు పెళ్లి తర్వాత ఉద్యోగాలకు స్వస్తిచెప్పడం గమనించింది. వారి కోసం ఏదైనా చేస్తే బాగుండనుకుంది. అప్పటికి ఆమెకు 50 ఏళ్లు. ‘ఈ వయసులో చేయగలనా?’ అనుకుంది. భర్త, కూతురు ప్రోత్సహించడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ఏడాదిపాటు అధ్యయనం చేసింది. గత ఏడాది మహిళా దినోత్సవం రోజున ‘ఆస్పైర్‌ ఫర్‌ హర్‌’ను ప్రారంభించింది. అమ్మాయిలకు కెరియర్‌ పరమైన సాయం అందించడం ఈ సంస్థ లక్ష్యం. ఉద్యోగం కోరుకునే వారికి, జాబ్‌ చేస్తూ ఉన్నత స్థాయికి వెళ్లాలనుకొనేవారికీ, కెరియర్‌ను పునఃప్రారంభించాలనుకొనే వారికి అవసరమైన సాయాన్ని అందించడం మొదలుపెట్టింది.

గత ఏడాది కరోనా కారణంగా సంపాదించే వాళ్లని కోల్పోయి వీధిన పడ్డ ఎంతోమందిని చూసింది. వీళ్లలో ఇంటి ఆర్థిక వ్యవహారాలు తెలియనివారు కొందరైతే, అయినవాళ్ల చేతిలో మోసపోయినవారు ఇంకొందరు. వీరికి న్యాయపరమైన సాయంతోపాటు కెరియర్‌కు అవసరమైన శిక్షణనిచ్చి స్త్రీలు తమ కాళ్లమీద నిలబడేలా చూస్తోంది. ఈ సేవలన్నీ ఉచితంగానే అందిస్తోంది. ఈమె మహిళలకు అందిస్తోన్న చేయూత నచ్చి అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు నవ్యా నవేలి నందా ఈమెతో చేతులు కలిపింది. ‘ఆంత్రప్రెనారీ’ పేరిట ఓ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. దీని ద్వారా వ్యాపార ఆలోచనలున్న మహిళలకు అవసరమైన వనరులు, దిశానిర్దేశం, నెట్‌వర్క్‌ అవకాశాలను అందిస్తారు.

‘అమ్మాయిల కళ్లలో నాకు వాళ్ల కలలు కనిపిస్తుంటాయి. వాళ్లకి కాస్త చేయూతనిస్తే చాలు భవిష్యత్‌లో ఎంతోమందిని ముందుండి నడిపిస్తారని నమ్ముతా. కొవిడ్‌ తర్వాత పరిణామాలు చూశాక ‘నాట్‌ ఎలోన్‌’ను చేర్చాం. లక్షలమంది అమ్మాయిలు తమ కెరియర్లలో అభివృద్ధి చెందుతుంటే చూడాలన్నది నా కల’ అంటోంది మధుర దాస్‌ గుప్తా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్