విరాట్‌, సారా, జాహ్నవి...ఆమె ఖాతాదారులే!

ఓ ప్రముఖ కంపెనీలో ఫైనాన్షియల్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తోన్న తషీన్‌కు లక్షల్లో జీతం వస్తున్నా... మనసు అక్కడ ఉండేది కాదు. దేశవిదేశాలకు చెందిన వంటకాలకు తనదైన మార్పులుచేసి కొత్తరుచి తెప్పించి వాటిని పరిచయం చేయాలనుకునేది. అందుకు తల్లిదండ్రులు మొదట అంగీకరించలేదు.

Published : 28 Apr 2022 07:24 IST


తషీన్‌

ఓ ప్రముఖ కంపెనీలో ఫైనాన్షియల్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తోన్న తషీన్‌కు లక్షల్లో జీతం వస్తున్నా... మనసు అక్కడ ఉండేది కాదు. దేశవిదేశాలకు చెందిన వంటకాలకు తనదైన మార్పులుచేసి కొత్తరుచి తెప్పించి వాటిని పరిచయం చేయాలనుకునేది. అందుకు తల్లిదండ్రులు మొదట అంగీకరించలేదు. కానీ ఆమె పట్టు వదలకపోవడంతో... చివరికోరోజు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అంతే, ఎగిరి గెంతేసింది. ఏడాది తిరిగేసరికి క్రికెటర్లూ, సినీతారలూ, వ్యాపారులెందరినో తన ఖాతాదారుల్ని చేసుకుంది. ఫోర్బ్స్‌ 30 అండర్‌-30 ఆంత్రప్రెన్యూర్స్‌ జాబితాలో చోటు దక్కించుకుంది 27 ఏళ్ల తషీన్‌ రహీంతూ

త షీన్‌ తండ్రిది ఎగుమతుల వ్యాపారం, తల్లి బొటిక్‌ నిర్వహిస్తోంది. వారిద్దరినీ చూస్తున్నప్పుడల్లా తనూ సొంతంగా ఏదైనా చేయాలని చిన్నప్పటి నుంచి అనుకునేదీమె. అమెరికాలో డిగ్రీ చేసి,  ముంబయిలోని ఓ ప్రైవేటు సంస్థలో ఫైనాన్షియల్‌ కన్సల్టెంట్‌గా పనిచేసింది. సొంత వ్యాపారం చేస్తానని అన్నప్పుడల్లా అమ్మానాన్న వద్దనేవారు. ‘ఒకసారి నెల రోజులు రోజూ నాన్నతో నా కల గురించి  ప్రస్తావిస్తూనే ఉండేదాన్ని. చివరికి ఓ రోజు వేకువ జామున మూడు గంటలకు నాన్న నా గదిలోకి వస్తే, ఆశ్చర్యమేసింది. ‘ఉద్యోగం మానేసి, నీకిష్టమైన రంగంలో అడుగుపెట్టు. దీంట్లో సంతోషంగా లేవు’ అన్నారు. ఎగిరి గంతేశా. వెంటనే ప్రణాళిక మొదలుపెట్టా. అలా ఏడాదిన్నర క్రితం ‘టేస్ట్‌ రీట్రీట్‌’ ప్రారంభించా. సోషల్‌మీడియా నా ప్రచారానికి వేదికగా మారింది. మన సంప్రదాయ వంటకాలతోపాటు విదేశీ రుచులపై నాకు అవగాహన ఉంది. ఆ రంగంలో ఆసక్తితో ప్రతి చిన్న విషయాన్నీ తెలుసుకునేదాన్ని. అదే నాకిప్పుడు ఉపయోగపడింది. ముందుగా మంచి బృందాన్ని తయారు చేసుకొన్నా. ముంబయిలో పేరున్న పాకశాస్త్ర నిపుణులు, హోంబేకర్స్‌ను ఎంచుకున్నా. మొదట్లో సవాల్‌గా అనిపించినా తక్కువ సమయంలోనే అవగాహన పెంచుకున్నా. ఇంతకీ మా వ్యాపారం ఏంటంటే... పుట్టిన రోజు వంటి ప్రత్యేకమైన రోజుల నుంచి పండగల వరకు వినియోగదారుడి ఆసక్తి, అభిరుచి మేరకు రకరకాల కేకులు, స్వీట్లు తయారు చేయించి వారికీ, వారు కోరిన వారికీ కానుకలుగా ఇళ్లకు పంపుతాం. ఆ కానుకలను సహజమైన పూలు, సందర్భానికి సంబంధించిన చిత్రాలు వేసిన బాక్సుల్లో ఉంచి మరీ అందిస్తున్నాం. కానుకలను మ్యూజిక్‌ వచ్చేలా, కేకులు లేదా చిన్నారుల మనసు దోచేలా పూల మధ్యలో ఉంచే డిజైన్ల ర్యాపర్స్‌, కుకీస్‌తో సర్ది పంపిస్తాం. కార్పొరేట్‌ సంస్థల తరఫున అందించే గిఫ్ట్‌ప్యాక్స్‌ తయారీలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. కొద్ది కాలంలోనే వెల్‌స్పన్‌, టోరెంట్‌ ఫార్మా వంటి ప్రముఖ సంస్థలు మా వినియోగదారులయ్యాయి. అంతేనా విరాట్‌కోహ్లి - అనుష్కశర్మ, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యా, సారా అలీఖాన్‌, జాహ్నవి- ఖుషీ కపూర్‌ వంటి ప్రముఖులూ మా ఖాతాదారులు కావడం సంతోషంగా అనిపిస్తుంది. మా నెట్‌వర్క్‌లో 200మందికిపైగా పనిచేస్తున్నారు. కొద్ది కాలంలోనే వేల మందికి అందించగలిగాం. కానుకల అలంకరణ స్థానిక కళాకారులతోనే చేయిస్తున్నా’ అంటోంది తను. రూ.50 లక్షలు పెట్టుబడితో ప్రారంభించిన ఈ స్టార్టప్‌ ఏడాదిలోనే రూ.7.5 కోట్ల వ్యాపారమైంది.  

విదేశాలకు.... తషీన్‌ అంతటితో సరిపుచ్చుకోలేదు. దుబాయ్‌, లండన్‌ వంటి దేశాల్లో సిట్‌-డౌన్‌ డిన్నర్స్‌, థీమ్‌ పార్టీలను నిర్వహించే స్థాయికి చేరుకుంది. ఎటువంటి కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలో, అక్కడికొచ్చే అతిథుల అభిరుచులకు తగినట్లు ఏర్పాట్లు ఎలా చేయాలనేదాంట్లో తనది అందె వేసిన చేయి. లండన్‌లో దక్షిణాంధ్ర స్వీట్లు, దుబాయిలో ఉత్తర భారతీయ రుచులను అందిస్తూ అక్కడి ఎన్నారైల మనసులనూ దోచుకుంటోందీమె. మనసు చెప్పింది వింటే విజయం మన దగ్గరకే వస్తుంది అనే తషీన్‌ మరిన్ని దేశాల్లో కార్యక్రమాల నిర్వహణకు, స్థానిక రుచులను అందించడానికీ కృషి చేస్తోంది.
 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్