ముంబయికి ఫెర్రీని తెచ్చింది!

మహారాష్ట్రలోని మాండ్వా నుంచి ముంబయికి రోడ్డు మార్గంలో వెళ్తే 100 కి.మీ.ల  దూరం. మూడు గంటల ప్రయాణం. ఆ దూరాన్ని 19 కి.మీ.కు తగ్గించి, గంటలోపే చేరుకునేలా చేసింది దేవికా సైగల్‌. అరేబియా సముద్రంపై  ఫెర్రీ సేవలతో ఈ మార్పు సాధ్యమైంది. మహారాష్ట్రలో  ఫెర్రీ సర్వీసులను అందించి ఈ రంగంలో అడుగు పెట్టిన తొలి మహిళగా నిలిచిందీమె.

Updated : 18 Jul 2022 09:14 IST

మహారాష్ట్రలోని మాండ్వా నుంచి ముంబయికి రోడ్డు మార్గంలో వెళ్తే 100 కి.మీ.ల  దూరం. మూడు గంటల ప్రయాణం. ఆ దూరాన్ని 19 కి.మీ.కు తగ్గించి, గంటలోపే చేరుకునేలా చేసింది దేవికా సైగల్‌. అరేబియా సముద్రంపై  ఫెర్రీ సేవలతో ఈ మార్పు సాధ్యమైంది. మహారాష్ట్రలో  ఫెర్రీ సర్వీసులను అందించి ఈ రంగంలో అడుగు పెట్టిన తొలి మహిళగా నిలిచిందీమె.

మాండ్వా పోర్ట్‌లో ఒకప్పుడు చిన్న దుకాణమూ ఉండేదికాదు. ఆ ప్రాంతాన్ని అభివృద్ధిచేయడానికి 2016లో ప్రైవేటు సంస్థలను సంప్రదించింది ప్రభుత్వం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంది దేవికా సైగల్‌. ఫెర్రీ సేవలను ముంబయికీ తేవాలనుకుందీమె. ఇంగ్లండ్‌లో ఇంటర్నేషనల్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ చేసింది దేవిక. షిప్పింగ్‌ అండ్‌ ట్రేడింగ్‌ సంస్థను నిర్వహించే తండ్రితో తన ఆలోచన పంచుకుంది. ఆయన ప్రోత్సాహంతో ముందడుగు వేసింది.

అభివృద్ధి దిశగా... అలియాబాగ్‌కు ప్రయాణించేవారు మాత్రమే ఎక్కువగా మాండ్వా జెట్టీని వినియోగిస్తారు. పాత షిప్పింగ్‌ కంటైనర్స్‌ ఉంచడానికీ ఈ ప్రాంతాన్ని వాడేవారు. ‘మొదటిసారిగా ఇక్కడ ఏటీఎం సౌకర్యాన్ని ఏర్పాటు చేశాం. ఆ తర్వాత పబ్లిక్‌ టాయిలెట్స్‌, చిన్నచిన్న దుకాణాలు వచ్చేలా చూశాం. 20కి పైగా కంటైనర్లను దుకాణాల్లా మార్చి ఈ ప్రాంతానికి ‘బీచ్‌ బాక్స్‌’ అని పేరు పెట్టాం. యాంఫీథియేటర్‌ సిద్ధం చేసి సంగీత కార్యక్రమాలు, నాటకాలు, సినిమాలూ.. ఇంకా ఫ్లీ మార్కెట్లు, డ్యాన్స్‌, ఫిట్‌నెస్‌ శిక్షణ వంటివన్నీ ఏర్పాటుచేశాం. దాంతో ఈ పోర్టుకు పర్యాటకుల రాక మొదలైంది. మొదట్లో వారాంతాల్లో రెండువేల మంది వరకు వచ్చేవారిక్కడికి. ఈ సంఖ్య ఏడాదిలోనే 60 వేలను దాటింది. ఈ ప్రయత్నమంతా ఫెర్రీ సర్వీసు ప్రారంభించడానికే. కానీ అది మొదట అనుకున్నట్లు జరగలేదు’ అని చెప్పుకొచ్చింది దేవిక.

500మందికి.. 2020 ప్రారంభంలో ఫెర్రీ సేవలు మొదలుపెట్టాలనుకున్న దేవిక ప్రయత్నానికి లాక్‌డౌన్‌తో ఆటంకం ఏర్పడింది. చివరకు ముంబయి పోర్ట్‌ ట్రస్ట్‌ భాగస్వామ్యంతో అదే ఏడాది ఆగస్టులో 500 మంది ప్రయాణించగలిగేలా ‘ఎంటుఎం ఫెర్రీస్‌’ సేవలను దేవిక ప్రారంభించింది. ఈ ఫెర్రీలో 120 కార్లు, 60 బైకుల్ని తరలించే సౌకర్యం ఉంది. ‘ఉదయం ఏడింటి నుంచి ఈ సేవలు మొదలవుతాయి. దీంతో ఈ పక్కనుంచి ముంబయికి ఉద్యోగరీత్యా వెళ్లేవారంతా మా సేవలను వినియోగించుకోగలుగుతున్నారు. రూ.400 నుంచి రూ.1,500 వరకు టిక్కెట్‌ ఉంటుంది. వాహనాలకు అదనంగా చెల్లించాలి. మొదటి రోజు మా ఫెర్రీలో 100 మంది ప్రయాణించారు. 2021లో 5.5లక్షల మందితోపాటు లక్ష కార్లు, 30వేల బైకులు వెళ్లాయి. ఈ ఏడాది ఆ సంఖ్య రెట్టింపు కానుంది. ఫెర్రీకి  రూ.75 కోట్లు పెట్టుబడి పెట్టాం. కొవిడ్‌ కారణంగా దాదాపు ఏడాదిపాటు నష్టాలు వచ్చాయి. అయినా ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. ఈ ఏడాది మే నెలలోనే 65వేలమంది ప్రయాణించారు. త్వరలో మరికొన్ని ఫెర్రీలను వేరే పోర్టులలో ప్రారంభిస్తాం’ అని చెబుతోంది దేవిక.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్