సోషల్‌ సాయం..మార్పే ధ్యేయం

జీవితమన్నాక నలుగురికీ సాయపడాలిగా! ఈ సూత్రాన్నే నమ్మారీ అమ్మాయిలు. అందుకే సోషల్‌ మీడియాను కాలక్షేపానికో, తమ సృజనాత్మకతను ప్రదర్శించడానికో కాక.. అందరికీ సాయపడే వేదికగా మలచుకున్నారు. లక్షల మంది అభిమానులతోపాటు  ఫోర్బ్స్‌నీ మెప్పించారు. ఆ సంస్థ తాజాగా మన దేశంలో 100 మంది డిజిటల్‌ స్టార్లను ఎంపిక చేయగా

Updated : 31 Jul 2022 07:47 IST

జీవితమన్నాక నలుగురికీ సాయపడాలిగా! ఈ సూత్రాన్నే నమ్మారీ అమ్మాయిలు. అందుకే సోషల్‌ మీడియాను కాలక్షేపానికో, తమ సృజనాత్మకతను ప్రదర్శించడానికో కాక.. అందరికీ సాయపడే వేదికగా మలచుకున్నారు. లక్షల మంది అభిమానులతోపాటు  ఫోర్బ్స్‌నీ మెప్పించారు. ఆ సంస్థ తాజాగా మన దేశంలో 100 మంది డిజిటల్‌ స్టార్లను ఎంపిక చేయగా ‘మార్పును తీసుకొస్తున్న’ విభాగంలో అగ్రగాములు వీళ్లు..


ఆ మహిళల కోసం: తాన్యా

హ తెలియని వయసులో అమ్మానాన్న విడిపోయారు. అమ్మే చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచింది. ‘నాన్న’ ఎలా ఉంటారో కూడా తెలియదు తాన్యాకి. ఆయన లాయర్‌ అని తెలిసి తనూ అదే అవ్వాలనుకుంది. తను న్యాయవాది అయ్యాక కానీ అర్థం కాలేదామెకు.. విడాకులయ్యాక భరణం తీసుకోవచ్చన్న కనీస అవగాహన లేని తన తల్లి లాంటి మహిళలు ఎందరో ఉన్నారని. అలాంటి వాళ్లకు సాయపడాలని 2020లో ఇన్‌స్టాగ్రామ్‌లో ‘యువర్‌ ఇన్‌స్టా లాయర్‌’ను ప్రారంభించింది. ‘గర్భం దాల్చాక కెరియర్‌ నుంచి గ్యాప్‌ తీసుకున్నా. ఇంట్లో ఏమీ తోచలేదు. అప్పుడే ఇన్‌స్టాలోకి వచ్చా. దీనికి కారణం అమ్మే అని చెబుతా. చిన్నప్పటి నుంచీ నన్ను పెంచడానికి ఎంత కష్టపడిందో చూశా. విడిపోయాక నాన్న నుంచి రూపాయి కూడా తీసుకోలేదు. అలా తీసుకోవచ్చన్న విషయమే తనకు తెలియదు. ఇలాంటి ఎన్నో హక్కులు మహిళలకు ఉన్నా అవగాహన లేకపోవడంతో చాలామంది వాటిని సాధించుకోలేకపోతున్నారు. వీటన్నింటి గురించీ అర్థమయ్యేలా చెప్పాలనుకున్నా. సెక్షన్లు, క్లాజులు బోలెడుంటాయి. వాటిని అర్థం చేసుకోవడం కష్టం. అందుకే చట్టాలను సామాన్యులకు అర్థమయ్యే భాషలో హాస్యం, కథలు జోడిస్తూ చెబుతుంటా. పాప పుట్టాక ఆరోగ్యపరంగా ఇబ్బందిపడ్డా. దీంతో లా, మహిళా సాధికారత, పిల్లల హక్కులతోపాటు మానసిక ఆరోగ్యంపైనా అవగాహన కల్పిస్తున్నా’ అని చెప్పే తాన్యా అప్పాచు ఈ క్రమంలో చాలా విమర్శల్నీ ఎదుర్కొంది. చెప్పేది వాస్తవమైనప్పుడు భయపడాల్సిన పనేముందంటుందీ బెంగళూరు అమ్మాయి. తన ఇన్‌స్టా ఖాతాను 1.7 లక్షలమంది అనుసరిస్తున్నారు.


తన జీవితమే చిత్రంగా: లక్ష్మి

15 ఏళ్ల వయసులో యాసిడ్‌ దాడికి గురైంది లక్ష్మీ అగర్వాల్‌. ఈమెది దిల్లీ. తన కంటే రెట్టింపు వయసున్న వ్యక్తి ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. చదువుకీ, గాయనిగా ఎదగాలన్న తన కలకీ ఎక్కడ ఇబ్బంది అవుతుందోనని ఇంట్లో చెప్పలేదు. ప్రేమను తిరస్కరిస్తోందన్న కసితో ఆమెపై యాసిడ్‌ చల్లాడు. ముఖమంతా కాలిపోయింది. తన ముఖం తాను చూసుకోవడానికీ కొన్ని రోజులు భయపడింది. శారీరకంగానే కాదు మానసికంగానూ దెబ్బతింది. చుట్టుపక్కల వాళ్లు తనదే తప్పన్నారు. కానీ ఆమె మాత్రం ఇంట్లో దాక్కోవాలనుకోలేదు. పోరాడి దోషులను జైలుకెళ్లేలా చేసింది. దేశంలో యాసిడ్‌ దాడులపై కొత్త చట్టాలు తీసుకొచ్చేలా పోరాడింది. ఎంతోమంది బాధితురాళ్లలో ధైర్యం నింపడమే కాక వాళ్ల సాధికారతకూ కృషి చేస్తోంది. ‘అతను యాసిడ్‌ పోసింది నా ముఖంపైనే కానీ కలలపై కాదు. అందుకే వాటిని అందుకోవడానికి నిరంతరం పోరాడుతున్నా. ఈ ప్రయాణంలో నాన్న అనుక్షణం నాకు తోడుగా ఉన్నారు. ఆ అవకాశం లేనివారికి నేను అండగా నిలుస్తున్నా’ అంటోన్న 32 ఏళ్ల లక్ష్మి... అందానికి నిర్వచనాన్ని మారుస్తూ ఎన్నో సంస్థలకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. 100 మందికిపైగా యాసిడ్‌ బాధితులకు చికిత్స, న్యాయపరమైన సాయమందించింది. తన కృషికి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలనీ అందుకుంది. తన జీవిత కథ స్ఫూర్తిగా తీసిన ‘చపాక్‌’లో దీపికా పదుకోణ్‌ నటించడమే కాక సహ నిర్మాతగానూ వ్యవహరించింది. లక్ష్మి టెడెక్స్‌ స్పీకర్‌ కూడా. ఈమె ఇన్‌స్టా ఖాతాను 5.7 లక్షలమంది అనుసరిస్తున్నారు.


పర్యావరణ హిత ప్రపంచానికి: పంక్తి

ర్యావరణ కాలుష్యం పెద్ద పెద్ద పరిశ్రమల వంటి వాటివల్లే అనుకుంటుంటాం. కానీ అందులో మనకీ భాగస్వామ్యం ఉందంటుంది పంక్తి పాండే. తనది అహ్మదాబాద్‌. ఇస్రో ఉద్యోగి అయిన తను కాస్మొటిక్స్‌ దగ్గర్నుంచి, వస్త్రాలు శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించే డిటర్జెంట్లు, క్లీనర్లు వంటివీ ఇంట్లోనే తయారు చేసుకుంటుంది. ‘జీరో వేస్ట్‌’ విధానాన్ని అనుసరిస్తూ ఫాలోయర్లను ఆకర్షిస్తోంది. ‘మధ్యతరగతి అమ్మాయిని. చిన్నతనం నుంచే దేన్నైనా పునర్వినియోగించడం అలవాటుగా మారింది. దేన్నీ వృథా చేయడానికి ఇష్టపడను. గర్భిణిగా ఉన్నప్పుడు చేతిలో బోలెడు సమయం ఉంది. ఏ వస్తువు కొన్నా ప్లాస్టిక్‌ కవర్లలోనే ఇచ్చేవారు. కూరగాయలు కోసినప్పుడు తొక్కలు మిగిలి పోయేవి. వీటన్నింటినీ బయట పడేయడం ద్వారా కాలుష్యానికి కారణమవుతున్నా కదా అనిపించింది. అప్పట్నుంచే జీరో వేస్ట్‌పై దృష్టిపెట్టా. వస్త్రంతో చేసిన చేతి సంచులు, సరకులకు డబ్బాలు వెంట తీసుకెళ్లడం, పాత వస్త్రాలను ఇతర రూపాల్లోకి మార్చడం, సహజ రంగులేసిన దుస్తులను ఎంచుకోవడం, శుభ్రం చేసే ద్రావకాలను ఇంట్లోనే తయారు చేసుకోవడం, వంటింటి వృథాను ఎరువుగా మార్చడం వంటి ఎన్నో ప్రయోగాలు చేశా. వాటిని నా ఇన్‌స్టా ఖాతా ‘జీరో వేస్ట్‌ అడ్డా’లో పంచుకుంటూ వచ్చా. చాలామందికి నచ్చడమే కాదు ప్రయత్నిస్తున్నారు కూడా’ అంటోందీ 34 ఏళ్ల అమ్మాయి. పాత వస్త్రాలను ఆధునిక ధోరణిలో మార్చడం, చర్మ సమస్యలకు తను సూచించే సహజ పరిష్కారాలకీ అభిమానులెక్కువ. బహిష్టు సమయంలో పర్యావరణహిత పద్ధతులను ప్రోత్సహిస్తున్న తను టెడెక్స్‌ స్పీకర్‌ కూడా. ఈమెను ఇన్‌స్టాలో 2.6 లక్షల మంది అనుసరిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్