ముందుగది ఆకర్షణీయంగా..

సేద తీరాలన్నా, పనిలో ఏ కాస్త తీరిక దొరికినా వార్తాపత్రికలు చదువుతూ లేదా టీవీ చూస్తూ హాల్లో కూర్చుంటాం. అతిథులొచ్చినా కబుర్లు చెప్పుకునేదీ ఇక్కడే. అలాంటి ముందుగదిని ఆకర్షణీయంగా ఉంచుకోవాలిగా మరి!

Published : 28 Feb 2022 01:09 IST

సేద తీరాలన్నా, పనిలో ఏ కాస్త తీరిక దొరికినా వార్తాపత్రికలు చదువుతూ లేదా టీవీ చూస్తూ హాల్లో కూర్చుంటాం. అతిథులొచ్చినా కబుర్లు చెప్పుకునేదీ ఇక్కడే. అలాంటి ముందుగదిని ఆకర్షణీయంగా ఉంచుకోవాలిగా మరి!

గోడల వర్ణాలకు సోఫాలు, కర్టెన్లు, తివాచీ రంగులు దగ్గరగా ఉండేలా ఎంచుకుంటే అందం ఇనుమడిస్తుంది. ముందుగది సౌందర్యంలో సోఫాల పాత్రా పెద్దదే. కొనేటప్పుడే మన అభిరుచికి తగ్గట్టుగా ఎంచుకుంటాం. కానీ కొద్దికాలానికే మనసు మార్పు కోరుకుంటుంది. అలాగని మాటిమాటికీ మార్చలేం. అలాంటప్పుడు దిండ్లతో (కుషన్‌ పిల్లో) మార్పు తేవచ్చు. వీటిని వివిధ ఆకృతులవి ఎంచుకుంటే సరి. కొత్తదనం ఇట్టే వచ్చేస్తుంది.

టీపాయ్‌ ఉన్నదే ప్రత్యేకించి టీకప్పులు పెట్టేందుకు. అలాగని ఎంగిలి కప్పులను అలాగే ఉంచితే మాత్రం వెగటుగా తోస్తుంది. పత్రికల దగ్గర్నుంచీ హ్యాండ్‌బ్యాగుల వరకూ ప్రతిదాన్నీ దానిపైకి చేర్చేయకండి. అందవిహీనంగా, గజిబిజిగా కనిపిస్తుంది. చదువుతున్న పుస్తకం సహా తాత్కాలికంగా ఉంచినా.. వెంటనే తీసేయడం ఉత్తమం. కుదిరితే సహజమైన లేదా కృత్రిమ పూలగుచ్ఛాలతో అలంకరిస్తే చూడ్డానికి బాగుంటుంది.

కర్టెన్లు ఆహ్లాదకరమైన రంగులూ డిజైన్లలో ఉంటే సరిపోదు. తలుపులూ కిటికీలకు కచ్చితంగా సరిపోయేలా ఎంచుకోవాలి. వాటిల్లో కొలతలు తేడా ఉన్నా చూడటానికి బాగోదు. కాబట్టి, ముందుగానే కొలుచుకొని, ఆ ప్రకారం కొనుక్కోవడమో, కుట్టించుకోవడమో చేయాలి.

మేధస్సుకి సంకేతం పుస్తకం. విలువైన పుస్తకాలను ముందుగది అరల్లో అందంగా అమర్చుకుంటే మీ అభిరుచి ప్రతిఫలిస్తుంది, తీరిక వేళల్లో సులువుగా తీసుకుని చదువుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్