గెలుపు కథ... జనమిత్ర!

పాతికేళ్ల నాటి మాట! రాత్రిబడుల్లో చేరి అక్షరాలు దిద్దాలని తపనపడ్డ ఆ ఆడవాళ్లంతా అనుకోకుండా పొదుపుబాట పట్టారు.. నెలకి పదిరూపాయల చొప్పున వాళ్లు చేసిన పొదుపు ఇవాళ ఏ వాణిజ్య బ్యాంకుకీ తీసిపోని గొప్ప విజయాన్ని అందించింది...  ఎంతో మంది అధికారులు, రాజకీయ నాయకులకు అభివృద్ధి పాఠాలు నేర్పుతున్న విశాఖపట్నానికి చెందిన జనమిత్ర మహిళల గెలుపు గురించి మనమూ తెలుసుకుందాం..

Published : 21 Aug 2021 02:55 IST

పాతికేళ్ల నాటి మాట! రాత్రిబడుల్లో చేరి అక్షరాలు దిద్దాలని తపనపడ్డ ఆ ఆడవాళ్లంతా అనుకోకుండా పొదుపుబాట పట్టారు.. నెలకి పదిరూపాయల చొప్పున వాళ్లు చేసిన పొదుపు ఇవాళ ఏ వాణిజ్య బ్యాంకుకీ తీసిపోని గొప్ప విజయాన్ని అందించింది...  ఎంతో మంది అధికారులు, రాజకీయ నాయకులకు అభివృద్ధి పాఠాలు నేర్పుతున్న విశాఖపట్నానికి చెందిన జనమిత్ర మహిళల గెలుపు గురించి మనమూ తెలుసుకుందాం..

ఇళ్లు... పొలం తప్ప మరో ప్రపంచం తెలియదు వాళ్లకు. వంద రూపాయల అప్పు కోసం కూడా వడ్డీ వ్యాపారస్తుల్ని ఆశ్రయించేవారు. తిరిగి ఆ రుణం చెల్లించలేక ఇంట్లో దాక్కునే పరిస్థితి. అలాంటి గడ్డు రోజుల్లో వాళ్లకు నాలుగు అక్షరం ముక్కలు నేర్పి, పొదుపు గురించి చెప్పారు జనమిత్ర సంస్థను ప్రారంభించిన కర్రి సీతారాం. ‘1990ల నాటిమాట. రాత్రి బడులకు హాజరయ్యే మా అందరికీ సీతారామ్‌ ప్రతినెలా రూ. 10 పొదుపు చేస్తే కలిగే ప్రయోజనాలు చెప్పారు. పొదుపు చేసిన డబ్బుని రూపాయి వడ్డీకే రుణాలుగా తీసుకునే వాళ్లం. దాంతో స్వయం ఉపాధి పొందడంతోపాటు పిల్లలను చదివించుకొని ఇప్పుడిలా తలెత్తుకొని జీవిస్తున్నాం’ అంటున్నారు ఈ సంస్థకి ఛైర్మన్‌గా సేవలు అందించిన మునగపాక వాసి మళ్ల జయలక్ష్మి. అచ్యుతాపురం మండలంలో తిమ్మరాజుపేటకు చెందిన కర్రి సీతారాం 1978లో నెహ్రూ యువజన సంఘాన్ని స్థాపించారు. పురుషాధిపత్యం, స్త్రీలు ప్రతి దానికీ వారిపై ఆధారపడటం వంటి పరిస్థితులు ఆయన్ను ఆలోచింపజేశాయి. 10 మంది మహిళలతో ఒక పొదుపు సంఘాన్ని ఏర్పాటు చేస్తే... అది విజయవంతం అయ్యింది. అదే జనమిత్ర సహకార పొదుపు సంఘంగా మారి నేడు అచ్యుతాపురం, రాంబిల్లి, మునగపాక, గొలుగొండ, కశింకోట, మాకవరపాలెం మండలాలకు విస్తరించింది. 150 గ్రామాల్లో 150 మంది సంఘం ప్రతినిధులతో, 150 ప్రజాసేవా కేంద్రాల ద్వారా జనమిత్ర కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పొదుపు సంఘం సభ్యులే బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లుగా మారారు. అది ఉద్యమంలా మారి ఇవాళ రూ. 15 కోట్ల లావాదేవీలు చేస్తోంది. మహిళలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడమే కాక వారిని వివిధ రంగాల్లో రాణించేలా చేయాలనుకుంది జనమిత్ర. ఇందుకోసం నాయకత్వ లక్షణాలపై శిక్షణ అందించి తీర్చిదిద్దింది. ఇక్కడ శిక్షణ తీసుకొన్న ఆడారి మంజు, దాసరి గౌరీలక్ష్మి వంటివారు మునగపాక మండలంలో ఎంపీపీలుగా పనిచేశారు. ఇంకా ఎంతో మంది సర్పంచులు, వార్డు సభ్యులు కూడా ఈ సంఘంలో సభ్యులే. మరోపక్క మహిళలంతా కుట్టుమిషన్‌, అడ్డాకుల తయారీ వంటి శిక్షణనూ అందిపుచ్చుకొన్నారు.  


ఒక్క పెదపాడు గ్రామంలోనే ఈ సంఘం ఆధారంగా 400 కుటుంబాలు అభివృద్ధి చెందాయి. ఆర్థిక అవసరాల కోసం ఎవరి మీద ఆధారపడకుండా భరోసా లభించింది. వేధింపులకు గురైన మహిళలు, ఒంటరి స్త్రీలకు సంస్థ ఎన్నో విధాలుగా అండగా ఉంటోంది.

- గిలకంశెట్టి పెదలక్ష్మి, ఛైర్మన్‌


ప్రస్తుతం జనమిత్ర వాణిజ్య బ్యాంకుల మాదిరిగానే సేవలు అందిస్తోంది. లావాదేవీలన్నీ డిజిటల్‌ పద్ధతిలోనే సాగుతాయి. నిర్ణీత తేదీల్లో గ్రామాలలో మహిళలు సమావేశమై పొదుపు సొమ్ముని సంస్థ ప్రతినిధికి జమ చేస్తారు. అప్పు కూడా అక్కడే తీసుకునే ఏర్పాట్లూ ఉన్నాయి. గ్రామాలలో పొదుపు నిర్వహణ కేంద్రం రూ. 20 వేల వరకు అక్కడికక్కడే అందిస్తారు. ఆపై మించిన రుణాలను బ్యాంకు ఖాతా ద్వారా నేరుగా జమచేస్తారు. పొదుపును బట్టి ఏ హామీలు లేకుండా ఒక్కొక్క సభ్యురాలికీ రూ. 1000 నుంచి రూ. లక్ష వరకు రుణంగా సమకూర్చుతారు. జనమిత్రలో 60ఏళ్లు దాటిన సభ్యులకు వారి పొదుపు, అనుభవాన్ని బట్టి సంస్థ వ్యవస్థాపకులు సీతారాం పేరున చేయూత పథకాన్ని అమలు చేస్తూ పింఛన్‌ అందిస్తున్నారు. ఈ సంస్థ వార్షిక టర్నోవర్‌ రూ. 15 కోట్లు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వంటివారే ఈ సంస్థ సాధించిన విజయాలకు అబ్బురపడ్డారు. ఎంతోమంది విదేశీయులు సైతం జనమిత్రను సందర్శించి పొదుపు ఉద్యమంపై ఆసక్తిని చూపుతున్నారు.

- శివలెంక సూర్యచంద్ర, అచ్యుతాపురం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్