Published : 09/09/2021 01:35 IST

చదువుతో వెలుగు చూపి.. పొదుపుతో వెన్ను తడుతోంది

చదివింది ఎనిమిదో తరగతే! కానీ తోటి మహిళల్లో అక్షరజ్ఞానం నింపాలనుకుంది. ఆదిశగా వాళ్లని నడిపించడమే కాదు.. వాళ్ల జీవితాల్లో సారా చీకట్లనూ పారదోలింది. పొదుపు మంత్రం నేర్పించడంతోపాటు మహిళా బ్యాంకునే ఏర్పాటు చేసింది. రుణాలిస్తూ మహిళలు వ్యాపార మార్గంలో నడిచేలా ప్రోత్సహిస్తోంది. ఆమే నెల్లూరు జిల్లా లేగుంటపాడు మహిళా బ్యాంకు ఛైర్‌పర్సన్‌ జాన్‌ బీబీ...


ఎన్‌. వెంకటశేషమ్మ.. లేగుంటపాడులో ఓ టిఫిన్‌ హోటల్‌ నడుపుతోంది. 1992లో ప్రారంభమైన తొలి పొదుపు సంఘం అధ్యక్షురాలు. సభ్యులకు రుణాలిప్పించడంతోపాటు వాటిని సక్రమంగా ఉపయోగించుకునేలానూ చూస్తోంది.


డి.రమాదేవి.. పొదుపు సంఘ సభ్యురాలు. రుణం తీసుకొని కుట్టుమిషను కొంది. ఆ సంపాదనతో కుటుంబానికి ఆసరాగా నిలిచింది. పిల్లల్ని చదివించింది. కొడుకు ఎంబీఏ చదివి, అమెరికాలో కొలువు సాధించాడు. గ్రామీణాభివృద్ధి సంస్థ అభినందించి పొదుపు సంఘాల ఏర్పాటు బాధ్యతనిచ్చింది. తర్వాత డీఆర్‌డీఏలో మోటివేటర్‌గా, యానిమేటర్‌గా, మహిళా బ్యాంకు ఫీల్డ్‌ ఆఫీసర్‌గానూ సేవలందించింది. ప్రభుత్వం నుంచి అవార్డులనూ అందుకొంది.

లేగుంటపాడులో ఇలాంటి ఉదాహరణలు బోలెడు. ఈ మార్పునకు కారణం.. జాన్‌ బీబీ. ఈమెది సంప్రదాయ ముస్లిం కుటుంబం. ఎనిమిదో తరగతి తర్వాత చదువు మాన్పించి, 13 ఏళ్ల వయసులో ఖాదర్‌ మొహీయుద్దీన్‌కిచ్చి పెళ్లి చేశారు. ఆయనో కూలీ. చుట్టూ నిరక్షరాస్యులైన ఆడవాళ్లని చూసి, వాళ్లకి చదువు చెప్పాలనుకుంది. కొంతమందితో కలిసి రోజూ రాత్రి రెండు గంటలు చదువు చెప్పేది. అప్పుడే సారాయి కారణంగా ఆడవాళ్లు పడుతున్న బాధలు తెలుసుకుంది. అప్పట్లోనే ఆ ఊళ్లో ఏడాదికి రూ.10 లక్షల సారా వ్యాపారం జరిగేది. దానిపై ఉద్యమించేలా మహిళలను చైతన్యపరిచింది. భార్యలను హింసించే వారిని అందరూ ఏకమై నిలదీసేవారు. జిల్లా ఎస్పీ సాయమూ తీసుకుంది. వాళ్ల కష్టం ఫలించి నెలల వ్యవధిలోనే సారా దుకాణాలన్నీ మూతబడ్డాయి. దాంతో ఇళ్లలో నాలుగు రూపాయలు కనిపించేవి.

మదుపు బాట...

1992లో అప్పటి డీఆర్‌డీఏ ఏపీవో విజయభారతి ఓసారి అక్కడి వారికి పొదుపుపై అవగాహన కల్పించారు. జాన్‌బీబీ నేతృత్వంలో మహిళలంతా పొదుపు ప్రారంభించారు. సంఘంగా ఏర్పడి రోజుకో రూపాయి చొప్పున కోవూరు ఆంధ్రా బ్యాంకులో దాచుకున్నారు. ఆపై చిన్న రుణాలు తీసుకొని కుట్టుపనులు, వ్యాపారాలు ప్రారంభించారు.

తమ పొదుపు నిధులతో తామే ఓ బ్యాంకును నిర్వహించుకుంటే అన్న ఆలోచన వచ్చింది. అక్షర, సారా ఉద్యమాల్లో తోడ్పాటు అందించిన స్థానికుడు ప్రసాద్‌ ఆధ్వర్యంలో 1998 అక్టోబరు 30న మహిళా బ్యాంకు ప్రారంభమైంది. బ్యాంకు ఛైర్‌పర్సన్‌గా జాన్‌బీబీనే ఎన్నుకున్నారు. మధ్యలో రెండుసార్లు మినహా ఇప్పటికీ ఆ పదవిలో ఆమే కొనసాగుతున్నారు. సీఈవో, మేనేజర్‌, క్యాషియర్‌, అకౌంటెంట్‌, ఆఫీసర్స్‌ దీనిలో పనిచేస్తున్నారు. జాన్‌బీబీ మొదట్లో రూ.500 వేతనంగా తీసుకునేది. ఇప్పుడది రూ.4 వేలు. బ్యాంకులో మొత్తం 3 వేల ఎస్‌బీ అకౌంట్లున్నాయి. ఏడాదికి రూ.2 కోట్లు రుణాలను మహిళలకు ఇస్తున్నారు. తీసుకున్న వారు 24 వాయిదాల్లో చెల్లించాలి. వీళ్ల వసూళ్ల శాతం 90. ఈ విధంగా ఆ బ్యాంకు గ్రామ ప్రజల ఆర్థిక స్థితిగతుల్ని మార్చేసింది. క్రమంగా సేవలను జిల్లావ్యాప్తం చేసింది. దీంతో సంఘాలు 450కీ, సభ్యుల సంఖ్య 300 నుంచి 4,500లకూ పెరిగింది.

‘ఈ ఊరే నా కుటుంబం. మావారు 25 ఏళ్ల క్రితం అనారోగ్యం పాలయ్యారు. పొలం, నగలు అమ్మి వైద్యం చేయించినా ప్రాణాలు దక్కలేదు. పిల్లలూ లేరు. ఇక నా జీవితాన్ని సాటి మహిళల ఉన్నతికే కేటాయించాలనుకున్నా. బ్యాంకు ద్వారా ఆడవాళ్లకి రుణాలిచ్చి, వాటి ఆధారంగా వాళ్లు జీవనోపాధి పొందుతూ, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. లేగుంటపాడు మహిళా బ్యాంకు స్ఫూర్తితో జిల్లాలో మరో 8 మహిళా బ్యాంకులు ఏర్పాటయ్యాయి. ఇవన్నీ చాలా సంతోషాన్ని ఇస్తుంటాయి. 13 మండలాల్లో మహిళా రైతు ఉత్పత్తిదారుల సొసైటీలు ఏర్పాటు చేశాం. కోవూరు సహా చుట్టుపక్కల మండలాల్లో ఉద్యానశాఖ సహకారంతో రైతులకు ట్రాక్టర్లు, ట్రాన్స్‌పోర్టు వాహనాలు మొదలైనవి రాయితీలతో అందేలా చేశా. మహిళలు ఎవరి పైనా ఆధార పడకుండా స్వయం సమృద్ధి సాధించాలన్నది నా ధ్యేయం. దాని కోసం ఓపికున్నంత వరకూ పనిచేస్తా’ అంటోంది జాన్‌ బీబీ.

- ఓసూరు మురళీకృష్ణ, నెల్లూరు


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని