నాపై రెండు హత్యాయత్నాలు చేశారు!

చట్టాలు, హక్కులు... హెల్ప్‌లైన్లు వీటి గురించి చకచకా చెప్పేస్తూ అవసరమైతే సాయానికి నేనున్నానంటూ ముందుకొచ్చే  ఫణిశ్రీ ఏ పేరుమోసిన లాయరమ్మో అనుకుంటే పొరపాటు. సామర్లకోటలో టీకొట్టు నడిపే ఓ సామాన్యురాలు. ఎన్నో బాల్యవివాహాలు అడ్డుకుని.. వేలమంది బాలికలకు చట్టాలపై అవగాహన తెస్తున్న ఆమె అసలు ఆ బాధ్యతల్ని ఎందుకు తలకెత్తుకున్నారో తెలుసుకుందాం రండి..

Published : 14 Sep 2021 01:40 IST

చట్టాలు, హక్కులు... హెల్ప్‌లైన్లు వీటి గురించి చకచకా చెప్పేస్తూ అవసరమైతే సాయానికి నేనున్నానంటూ ముందుకొచ్చే  ఫణిశ్రీ ఏ పేరుమోసిన లాయరమ్మో అనుకుంటే పొరపాటు. సామర్లకోటలో టీకొట్టు నడిపే ఓ సామాన్యురాలు. ఎన్నో బాల్యవివాహాలు అడ్డుకుని.. వేలమంది బాలికలకు చట్టాలపై అవగాహన తెస్తున్న ఆమె అసలు ఆ బాధ్యతల్ని ఎందుకు తలకెత్తుకున్నారో తెలుసుకుందాం రండి..

నుభవాన్ని మించిన గురువులేరంటారు. ఈ మాటలు నాకు సరిగ్గా సరిపోతాయి. మాది మధ్యతరగతి కుటుంబం. సొంతూరు విజయవాడ. నాన్న టీవీఎస్‌ ట్రాన్స్‌పోర్టులో డ్రైవర్‌గా చేసేవారు. 47 ఏళ్ల క్రితం సామర్లకోట వచ్చి స్థిరపడ్డాం. నాకో తమ్ముడు ఉండేవాడు. 18 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్తి తగాదాలతో చిన్నప్పట్నుంచి నేను, తమ్ముడు.. బంధువుల వేధింపులు ఎన్నో ఎదుర్కొన్నాం. నా పెళ్లి కాకుండా అడ్డుకొనేవారు. ఈ సంఘటనలతో అమ్మ కూడా ఆత్మహత్య చేసుకొంది. ఆ బెంగతో నాన్నా మరణించారు. ఆస్తి కోసం నా మీద రెండు సార్లు హత్యాయత్నం జరిగింది. అర్ధరాత్రి పోలీసుస్టేషన్‌కు వెళ్తే కనీసం నా ఫిర్యాదు కూడా తీసుకోలేదు. ఎందరో లాయర్లను, పెద్ద మనుషులను ఆశ్రయించాను. న్యాయం జరగలేదు. అప్పుడే నన్ను నేను కాపాడుకోవడానికి లీగల్‌ విషయాల్లో పట్టు సాధించాలని నిర్ణయించుకున్నా. నేను బడికెళ్లి చదివింది అయిదో తరగతే.. మెట్రిక్యులేషన్‌, పీయూసీ ప్రైవేట్‌గా పాసయ్యాను.

వందల వీడియోలు చూశా... కుటుంబ సమస్యలు, ఆస్తి తగాదాలు, మహిళలు, బాలల హక్కులు, న్యాయశాస్త్రంలో ఉన్న అనేక అంశాల గురించి నిపుణుల సలహాలకు సంబంధించిన వందల వ్యాసాలు చదివాను, వీడియోలు చూశాను. పత్రికలు, పుస్తకాలు చదివేదాన్ని. అలా సెక్షన్లు, లీగల్‌ పాయింట్లపై అవగాహన పెంచుకున్నా. ఇవన్నీ మొదట నా కోసమే తెలుసుకున్నా... ఈ జ్ఞానంతో అందరికీ సాయం చేయాలనిపించింది. 2007 నుంచి ఒంటరి మహిళలు, న్యాయ సహాయ అవసరం ఉన్న నిరుపేదలకు ఉచితంగా సలహాలివ్వడం, భార్యాభర్తల వివాదాలను కౌన్సెలింగ్‌ ద్వారా పరిష్కరించడం, సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించడం చేసేదాన్ని. 2011లో సామర్లకోటలోని ఆల్‌ ఇండియా హ్యూమన్‌ రైట్స్‌ అసోసియేషన్‌ స్వచ్ఛంద సంస్థలో చేరాను. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి.. మానవ హక్కుల గురించి అవగాహన కల్పించేదాన్ని. 2014లో ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో.. టీనేజీ బాలికల సమస్యలపై దృష్టి పెట్టాను. ఆ పిల్లలు ఎదుర్కొనే శారీరక, మానసిక సమస్యలు, రుతుస్రావ పరిశుభ్రత, ప్రేమ-ఆకర్షణల మధ్య తేడా, సోషల్‌మీడియా దుష్ప్రభావాలు, లైంగిక వేధింపులపై 75 పాఠశాలల్లో.. సుమారు ఏడు వేల మందికి అవగాహన కల్పించా. ప్రభుత్వ పాఠశాలల్లో ఆరు నుంచి పదోతరగతి చదువుతున్న 75 మంది అనాథ బాలలకు ట్యూషన్లు చెప్పేదాన్ని. లాక్‌డౌన్‌ ముందు వరకూ సామర్లకోట పౌరసంఘం సహకారంతో నోటు పుస్తకాలు, పెన్నులు, బ్యాగులు, జామెట్రీ బాక్సులు అందించాను. 2018లో పెద్దాపురం సబ్‌డివిజన్‌ పరిధిలో పోలీసులు ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. అక్కడ కుటుంబ సమస్యలతో వచ్చే భార్యాభర్తలకు ప్రతి ఆదివారం కౌన్సెలింగ్‌ ఇచ్చేదాన్ని. ఇద్దర్నీ కూర్చోబెట్టి చెప్పవలసిన పద్ధతిలో నాలుగు మంచి మాటలు చెబితే ఎన్నో జీవితాలను చక్కదిద్దొచ్చు. అలా నా వంతు ప్రయత్నంతో రెండు వందల పైచిలుకు జంటలను దగ్గర చేశాను.

బాల్య వివాహాలకు అడ్డుకట్ట.. లాక్‌డౌన్‌ సమయంలో ఉపాధి కోల్పోయిన చాలా మంది ఆడపిల్లలను ఎన్నాళ్లు ఇంటి దగ్గర పెట్టుకుంటామని పెళ్లిళ్లు చేయడానికి సిద్ధమయ్యారు. మరోపక్క ప్రేమ వ్యవహారాలతో బాల్య వివాహాలూ పెరిగాయి. ఏడు పెళ్లిళ్లను చైల్డ్‌లైన్‌ సహకారంతో అడ్డుకొన్నా. కానీ గుట్టుచప్పుడు కాకుండా జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. దీంతో సామర్లకోటలోని 15 సచివాలయాల వారీగా ఆడపిల్లలకు నెల రోజులు అవగాహన తరగతులు నిర్వహించాను. చట్టపరంగా వారికున్న రక్షణలు తెలియజేశా. నాది ఒంటరి జీవితం. సమాజమే నా కుటుంబం. ఇక జీవనాధారం అంటారా... పెద్దాపురంలో చిన్న టీకొట్టు నడుపుతున్నా. పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ట్యూషన్లు చెప్పడం కోసం నాకున్న స్థలంలో త్వరలో రేకుల షెడ్‌ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను. పిల్లలకు ఏ సేవ చేసినా అది భవిష్యత్‌ సమాజాన్ని మెరుగ్గా మార్చడమేనన్నది నా నమ్మకం. దానికోసం ఎంత శ్రమైనా పడతాను. చివరి వరకూ కృషి చేస్తాను.

- అమ్ముల మోహిత్‌ నాగప్రసాద్‌, రాజమహేంద్రవరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్