అవగాహనే.. ఆమె ఆయుధం
close
Published : 09/12/2021 01:33 IST

అవగాహనే.. ఆమె ఆయుధం

ప్రేమ పేరుతో నమ్మి మోసపోయిందో అమ్మాయి. ఇంకొకామె.. స్నేహితుల ప్రోత్సాహంతో మత్తుకు బానిసైంది. కట్టుకుంటాడని నమ్మి సర్వస్వం అర్పిస్తే దాన్ని బయటపెడతానంటూ బ్లాక్‌మెయిల్‌.. ఇలాంటి ఎందరికో సాయమందిస్తున్నారు మాధవీ గణపతి. పిల్లల్లో ఆత్మవిశ్వాసం, నైతికత నింపాలనుకుని కౌన్సెలర్‌ అయ్యారీమె. యువతులకు జరుగుతున్న అన్యాయాలను చూసి వారికి వీటిపై అవగాహన కల్పిస్తున్నారు. వసుంధర పలకరించగా తన సేవా ప్రయాణాన్ని పంచుకున్నారిలా..

మాది వైజాగ్‌. మావారు గణపతిరావు ఓ సంస్థలో లాజిస్టిక్స్‌ మేనేజర్‌. ఎంబీఏతోపాటు కార్మికచట్టాలు, కౌన్సెలింగ్‌, మానసిక ఆరోగ్యం తదితర అంశాల్లో కోర్సులూ చేశా. ఉద్యోగం కంటే సమాజానికి ఉపయోగపడే పని చేయాలనుకున్నా. అందుకే కౌన్సెలర్‌గా మారా. పిల్లలకు జీవన నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలపై అవగాహన కల్పించేదాన్ని. విజయవాడ వాసవ్య మహిళా మండలి వారు మహిళల కోసం చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలుసుకుని దానిలో చేరా. ఆరునెలల తర్వాతి నుంచి విశాఖలో ఆ సంస్థ తరఫున కార్యక్రమాలు నిర్వహించే స్థాయికొచ్చా. అవగాహనా రాహిత్యంతో ఆడవాళ్లు ఎయిడ్స్‌ బారిన పడుతున్నారని తెలిసి 2003లో హోం అండ్‌ కమ్యూనిటీ బేస్డ్‌ కేర్‌ అండ్‌ సపోర్ట్‌ ప్రోగ్రాం చేపట్టాం. దీని ద్వారా చుట్టుపక్కల ప్రాంతాల్లో పరీక్షలు, జాగ్రత్తలు, మందులపై అవగాహన కల్పించేవాళ్లం. క్లింటన్‌ ఫౌండేషన్‌ మాకు సాయంగా మందులు సమకూర్చింది. మురికి వాడల్లో అమ్మాయిలకు సెక్సువల్‌ రీప్రొడక్టివ్‌ హెల్త్‌ ప్రోగ్రాం ద్వారా నెలసరి, ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాం. చదువుకోకుండా పనుల్లోకి వెళుతున్న పిల్లల్ని గుర్తించి పాఠశాలలకు వెళ్లేలా చేశాం. వారికి అవసరమైన పుస్తకాలు, యూనిఫామ్‌లు మొదలైనవీ అందించాం.

జెండర్‌ ఛాంపియన్లు

మహిళలపై వేధింపులు, అఘాయిత్యాలను చూశాక వీటిపై దృష్టిపెట్టాలనుకున్నాం. 2018లో నగరంలోని 12 కళాశాలల్లో 900 మందిని ‘జెండర్‌ ఛాంపియన్లు’గా తయారుచేశాం. అమ్మాయిలు మోసపోయే విధానాలు, వాటికి బలైనవారి కథలతోపాటు అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలన్న అంశాలపై ఇంటర్‌, డిగ్రీ యువతులకు శిక్షణనిచ్చాం. వీరు వారివారి కళాశాలల్లోని మిగిలిన వారిని చైతన్య పరుస్తారన్నది మా ఆలోచన. కార్యక్రమ నిర్వహణ, విద్యార్థినుల ఎంపిక, అవగాహన కల్పించాల్సిన అంశాలు మొదలైనవాటిపై యు.ఎస్‌.రాయబార కార్యాలయం సాయపడింది. వీటితోపాటు ప్రలోభాలకు గురై మోసపోయిన అమ్మాయిలు, మద్యానికీ, మత్తుకు బానిసైన వారు, బ్లాక్‌మెయిలింగ్‌కు గురవుతున్న యువతులకు న్యాయసాయం అందించేలానూ కృషి చేస్తున్నా. సుమారు 1500 మంది బాధిత యువతులను వీటి నుంచి బయటపడేయ గలిగా.

దిశ కౌన్సెలర్‌గా..

గత ఏడాది నుంచి దిశా మహిళా పోలిస్‌స్టేషన్లో స్వచ్ఛందంగా కౌన్సెలింగ్‌ సేవలందిస్తున్నా. మోసపోయి పోలీస్‌ స్టేషన్‌కి వచ్చిన యువతులకు ధైర్యం చెప్పి సాయమందిస్తాం. ‘ఛేంజ్‌.ఆర్గ్‌ ఇండియా’ నాకు ఛేంజ్‌ మేకర్‌ గుర్తింపునిచ్చింది. 23 ఏళ్లుగా సేవాకార్యక్రమాలు చేస్తున్నా. రోజూ 8-10 గంటలు వీటికే కేటాయిస్తున్నా అంటే నా భర్త ఆర్థికంగా, మానసికంగా దన్నుగా నిలవడం వల్లే. వాసవ్య మహిళామండలి అధ్యక్షురాలు డాక్టర్‌ కీర్తి బొల్లినేని కీలక బాధ్యతలు అప్పగించి ప్రోత్సహించారు. చాలామంది తమపై జరిగే వేధింపులు, అరాచకాలు, లైంగికదాడులపై నోరెత్తరు. పరువు పోతుందనో, పెళ్లి కాదనో, సమాజం చిన్నచూపు చూస్తుందనో మిన్నకుండిపోతారు. వాళ్ల ఆ భయమే మృగాళ్లకు శ్రీరామరక్షగా మారుతోంది. హింస జరిగితే మౌనంగా ఉండొద్దు. ఆడవాళ్లకి నేను చెప్పే మాట ఇదే! వాళ్లకి ఏ ఇబ్బందీ కలగకుండా సాయమందించే మార్గాలూ ఉన్నాయి. వాటిని అందుకుంటే ఇంకెంతో మందిని వీటి నుంచి కాపాడొచ్చు.

- బి.ఎస్‌.రామకృష్ణ, విశాఖపట్నం


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని