Updated : 20/12/2021 03:21 IST

మగవాళ్లకే కష్టమయ్యేది!

ఇప్పుడంటే అమ్మాయిలు ఇంజినీరింగ్‌ చదవడం మామూలు... కానీ 30 ఏళ్ల క్రితమే అందులో అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారామె. ఎన్నో సవాళ్లతో కూడిన ఉద్యోగాన్నే ఎంచుకున్నారు. ‘చేస్తే పెద్ద ఉద్యోగమే చేయాల’న్న లక్ష్యమే ఆమెను ముందుకు నడిపింది.... అత్యున్నత స్థాయికి చేర్చింది. ఇదంతా ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ భద్రతా సంచాలకురాలు, ప్రభుత్వ ప్రధాన విద్యుత్‌ తనిఖీ అధికారి జి.విజయలక్ష్మి గురించి. దేశంలో ఈ పదవిని నిర్వహిస్తున్న ఏకైక మహిళగా గుర్తింపు పొందిన ఆమె వసుంధరతో ముచ్చటించారు.

లక్ష్యం ఉన్నతంగా ఉండాలంటారు. నా నమ్మకం కూడా అదే. మా శాఖలో ఇంతకన్నా పెద్ద పోస్టేం లేదు. నేను అత్యున్నత స్థాయికి చేరాలన్నది మా నాన్న జీవీ రమణయ్య కల. ఆయన ఈ శాఖలోనే పర్యవేక్షక ఇంజినీర్‌గా 95లో రిటైర్‌ అయ్యారు. ఆయనిచ్చిన స్ఫూర్తితోనే ఈ రంగంలోకి వచ్చా. మాది నెల్లూరు. శ్రీశైలం ప్రాజెక్టు ఉన్నత పాఠశాలలో ఇంటర్‌ వరకు చదివా. 1982లో అనంతపురం జేఎన్‌టీయూలో బీటెక్‌ చదివా. 1989లో ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ పరీక్షలు రాసి జూనియర్‌ ఇంజినీర్‌గా శాఖలోకి ప్రవేశించా. తొలి పోస్టింగ్‌ హైదరాబాద్‌. మెదక్‌, నిజామాబాద్‌, కృష్ణా, గుంటూరు, విశాఖల్లో పనిచేశా. నాన్న 2019 వరకు నాతోనే ఉన్నారు. చివరి నిమిషం వరకూ అన్ని విషయాల్లోనూ సలహాలిస్తూ నన్ను నడిపించారు.

పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, సినిమాహాళ్లు, ఆసుపత్రులు, బహుళ అంతస్తుల భవనాల్లో విద్యుత్‌ పరంగా భద్రతా చర్యలు, ప్రమాణాలు ఎలా ఉన్నాయో తనిఖీ చేసి కనెక్షన్ల మంజూరుకు క్లియరెన్సులు ఇవ్వడం మా పని. విద్యుత్తు ప్రమాదాల్లో ఎవరైనా చనిపోతే దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదికలు అందజేయాలి. ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు పాల్గొనే వేదికలు, సభా ప్రాంగణాల్లోనూ విద్యుత్‌ భద్రతా చర్యలను పరిశీలించి నివేదిక ఇవ్వాలి. పరిశ్రమలకు ఆటంకాల్లేని విద్యుత్‌ సరఫరాకు, వాటిల్లో విద్యుత్తు ప్రమాదాలు సంభవించకుండా ఏం చేయాలో సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్‌ అథారిటీ నిబంధనల ప్రకారం మార్గదర్శనం చేయాలి. నాణ్యమైన సామగ్రి, పటిష్ట ఏర్పాట్ల ద్వారానే ప్రమాదాలను అరికట్టగలం. రాజీ పడితే మనుషుల ప్రాణాలే పోతాయి. అందుకే రాజీ లేకుండా పని చేసుకుపోవాలి. 30 ఏళ్ల విధి నిర్వహణలో ఎన్నో పరిశ్రమలు, కంపెనీలు, ఆసుపత్రుల్లో లోపాలు గుర్తించి ప్రభుత్వానికి, విద్యుత్‌శాఖ అధికారులకు నివేదికలు పంపాను. ఈ క్రమంలో ఆ పరిశ్రమలు, రాజకీయ నేతల నుంచి ఒత్తిళ్లు ఎదురయ్యేవి. ఎందుకంటే ప్రమాణాలు కలిగిన మెటీరియల్‌కి చాలా ఖర్చవుతుంది. దాంతో కొందరు నాసిరకం వాడతారు. మేం తనిఖీలు చేసి మందలిస్తే వెంటనే లాబీయింగ్‌ చేస్తారు. విద్యుత్తు పరమైన కారణాల వల్లనే చనిపోయారని నివేదిక ఇస్తే మృతులకు సంబంధిత సంస్థ ఎక్కువ నష్టపరిహారం చెల్లించాలి. అందుకే తనిఖీల సమయంలోనే ఒత్తిళ్లు పెరుగుతుంటాయి. అయినా లక్ష్యపెట్టను. ఈ ఉద్యోగం ముళ్ల కిరీటం. ప్రముఖులు, బడా పారిశ్రామివేత్తల నుంచి ఒత్తిళ్లు ఉంటాయి. విధుల్లో నిక్కచ్చిగా వ్యవహరించినప్పుడు అవి అధిగమించటం కష్టం కాదు.

మా వారు సునీల్‌ కుమార్‌ సివిల్‌ కాంట్రాక్టర్‌. మాకిద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి వైద్య విద్య చదువుతోంది. చిన్నమ్మాయి బీటెక్‌ ఫస్టియర్‌. మా శాఖలో అర్ధరాత్రి అపరాత్రి లేకుండా క్షేత్రస్థాయిలో పనిచేయాలి. అది చేయలేక చాలా మంది మగవాళ్లే ఈ ఉద్యోగానికి రిజైన్‌ చేసే వారు. కానీ నాకెపుడూ అది కష్టంగా అనిపించలేదు. నాన్న కల నెరవేర్చాలన్న పట్టుదల, పని పట్ల ప్రేమ, కుటుంబ మద్దతుతో ఏ ఇబ్బందులనైనా అధిగమించగలిగా. అందుకే జేఈగా మొదలైన నా ప్రస్థానం.. ఇక్కడి వరకు సాగింది.


విజయ రహస్యం: ఎంచుకున్న రంగంలో ఎదగాలంటే నిత్య విద్యార్థిగా ఉండాలి. అదే నాకిష్టం కూడా. ఎప్పటికప్పుడు పరిస్థితులని అధ్యయనం చేస్తూ, నైపుణ్యాలనూ పెంపొందించుకోవాలి. సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌లో సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్‌ చట్టాలు ఏం చెబుతున్నాయి? కాలానుగుణంగా ఆ చట్టాల్లో వస్తున్న మార్పులను, ఈ రంగంలో వస్తున్న ఆవిష్కరణలు, అధునాతన సాంకేతికతలను అధ్యయనం చేస్తూ పట్టు పెంచుకునేదాన్ని. ఒత్తిడిని దూరం చేసుకోవడంలో కర్ణాటక సంగీతం, అన్నమాచార్య కీర్తనలు నాకు ఎంతగానో తోడ్పడుతూంటాయి.గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని