Updated : 25/12/2021 04:27 IST

దుర్గవ్వ నోట.. బీమ్లా నాయక్‌ పాట

ఆమె పాడితే పల్లెదనం కళ్లముందు సందడి చేస్తుంది. శ్రమజీవుల అలుపుతీర్చే ఆ పాటకు ప్రేరణ ఆమె జీవితమే. ‘సిరిసిల్లా సిన్నది...’ అంటూ సోషల్‌ మీడియాలో లక్షలమంది అభిమానులని సంపాదించుకుంది. తాజాగా బీమ్లానాయక్‌ సినిమాలో తన పాటతో ఉర్రూతలూగిస్తోంది... ఆమే కుమ్మరి దుర్గవ్వ. చదువు లేకపోయినా ఆశువుగా పాటలు కట్టేసే దుర్గవ్వ తన ప్రయాణాన్ని వసుంధరతో పంచుకుందిలా...

నా పుట్టినిల్లు మహారాష్ట్ర దగ్గరున్న చిన్నగ్రామం. పెళ్లయ్యాక మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి దగ్గరున్న రొయ్యలపల్లి వచ్చాను. మాది వ్యవసాయ కుటుంబం. నేను చదువుకోలేదు. ఇద్దరు పిల్లలు. వాళ్ల చిన్నతనంలోనే నా భర్త రాజయ్య దూరమయ్యాడు. పసిపిల్లలని ఎలా పోషించుకోవాలో అర్థం కాలేదు. బంధువుల ఆదరణ అంతంతమాత్రమే. కూలికి వెళ్తూ పిల్లల్ని చదివించుకుంటూ పెంచుకొచ్చాను. బాబుని చదివించలేక మా పుట్టింటికి పంపేశాను. పాప నా దగ్గరే ఉండేది. నా జీవితంలా తన జీవితం కాకూడదని తనని చదివించాలనుకున్నా. అందుకోసం పక్క ఊర్లకు కూడా కూలికిపోయేదాన్ని. తను కూడా నా కష్టాన్ని అర్థం చేసుకుని బుద్ధిగా చదువుకునేది. తనకిప్పుడు పెళ్లిచేశాను. బాబు నాతోనే ఉంటున్నాడు. చిన్నప్పటి నుంచి పొలం పనులకు వెళ్లేదాన్ని. ఆ సమయంలో అలసట తెలియకుండా పాటలు పాడ్డం నా అలవాటు. పెద్దవాళ్లు పాడే పాటలనే అనుకరించి పాడుతుండేదాన్ని. పెళ్లయ్యాక ఇంకా ఎక్కువగా పాడేదాన్ని. బతుకమ్మ సంబరాలప్పుడు, ఇతర పండుగల సమయంలో ఇక పాటల సందడే నాకు. క్రమంగా అప్పటికప్పుడు పాటని అల్లుకుని పాడేయడం వచ్చేసింది.


తొలి రోజే అరవై లక్షలు

రిసరాలు, బాల్యం, కుటుంబ నేపథ్యం, సామాజిక పరిస్థితులు, ఊరి వాతావరణం... వీటిని ప్రతిబింబించేలా కొత్త బాణీలు కట్టి అప్పుటికప్పుడు పాటని అల్లుకోవడం దుర్గవ్వ ప్రత్యేకత. ఆమె గొంతు నుంచి జాలువారే జానపదాలు పల్లె సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. తన విభిన్నమైన గొంతుకతో ‘బీమ్లా నాయక్‌లో’ సినిమాలో రామజోగయ్య శాస్త్రి రచించిన ‘సెబుతున్నా నీ మంచి సెడ్డా’ పాటని సాహితి చాగంటితో కలిసి పాడింది తను. విడుదలైన రోజే 60 లక్షలకి పైగా వీక్షణలు అందుకుందీ పాట.


నా చుట్టు ఉన్న పరిస్థితులే నా పాటకు ముడిసరుకు. అది నాకు దేవుడిచ్చిన విద్యే అనుకోవాలి. పోయినేడాది కరోనా లాక్‌డౌన్‌లో నా కూతురు శైలజ ‘అమ్మా నీ పాట వినసొంపుగా ఉంటుంది. పాడు రికార్డు చేస్తా’ అంటే భయపడ్డాను. కారణం భర్తపోయినామెకు ఈ పాటలెందుకు అంటారనే. కానీ నా కూతురు ఒప్పించింది. అలా నేను పాడిన ‘ఉంగురమే రంగైన రాములాల’, ‘సిరిసిల్లా సిన్నది’ అనే జానపద గీతాలు వెలుగులోకి వచ్చాయి. వాటిని సుమారు 20 లక్షలమంది చూశారని పిల్లలు చెప్పారు. ఈ పాటలు విని, నచ్చి సంగీత దర్శకుడు తమన్‌ పిలిపించారు. కానీ మాకు హైదరాబాద్‌లాంటి మహా నగరం గురించి ఏమీ తెలియదు. భయపడుతూనే మా ఊరు నుంచి హైదరాబాద్‌ వెళ్లా. సినిమా ప్రపంచం నాకేమీ తెలియదు. ఒక పాట ఇచ్చి ఎలా పాడాలో వాళ్లే చెప్పారు. మొదట్లో భయపడ్డా. కానీ ఇంత దూరం వచ్చి భయపడితే ఏం లాభం అనిపించింది. అలా ‘సెబుతున్నా నీ మంచి సెడ్డా.. అంతోటి పంతాలు పోవాకు బిడ్డా’ పాట పాడాను. వాళ్లు చెప్పినట్టే  పాడాను. పవన్‌కళ్యాణ్‌ సినిమాలో పాట పాడటం అంటే అదృష్టమే కదా. నా పాట విడుదలైన రోజు మా ఇంట్లోవాళ్లతో పాటు, పెద్దవాళ్లంతా ఫోన్‌చేసి ‘బాగా పాడావు..’ అంటుంటే చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పటికీ మరువలేక పోతున్నా.

- సాయిని పున్నం, కోటిపల్లి, మంచిర్యాల


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని