Updated : 09/01/2022 06:42 IST

ఓటీటీ¨ రారాణులు వీరు!

అన్ని రంగాల్లోలానే వినోదంలోనూ పురుషాధిక్యతే ఉంటుంది. అయితే ఈ భావనల్ని పటాపంచలు చేస్తూ ఓటీటీ ప్రపంచాన్ని ఏలుతున్నారు కొందరు మహిళలు. సాధారణ కుటుంబాల నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన వీరి స్ఫూర్తి గాథల్ని చదవండి...

కంటెంట్‌ క్వీన్‌గా... నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా వైస్‌ప్రెసిడెంట్‌గానే కాదు ఇంటర్నేషన్‌ ఒరిజినల్స్‌ హెడ్‌గా మోనికా షేర్గిల్‌ చేయని ప్రయోగాలు లేవు. మేరట్‌లో పుట్టి పెరిగిన మోనిక... దిల్లీలో మాస్‌కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ చేశారు. పర్యావరణ పాత్రికేయురాలిగా జీవితాన్ని మొదలుపెట్టారు. బిహార్‌లోని ధన్‌బాద్‌లో గనుల అక్రమ తవ్వకాలపై, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లలోని పరిశ్రమల కాలుష్యంపై కథనాలు చిత్రీకరించారు. గ్రీన్‌ ఆస్కార్‌ పురస్కారం అందుకున్న ‘లివింగ్‌ ఆన్‌ ది ఎడ్జ్‌’ కథనాన్ని తనే చిత్రీకరించారు. జీ, సోనీ వంటి సంస్థల్లో కీలక బాధ్యతలు తీసుకున్నా.. నెట్‌ఫ్లిక్స్‌ మాత్రం ఆమెని ఫార్చ్యూన్‌, ఫోర్బ్స్‌ ఇండియాల శక్తిమంతమైన మహిళల జాబితాలో చేర్చింది. ఒక్క 2020లోనే 3000 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి 40 డాక్యుమెంటరీలు, వెబ్‌సిరీస్‌లు నిర్మించారావిడ. ‘మహిళలకు చేయగలమన్న నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉంటే వాళ్లు ఏ స్థాయికైనా చేరుకోగలరు. మా అమ్మానాన్నల నమ్మకమే నన్నీ స్థాయిలో ఉంచింది’ అంటారు మోనికా షేర్గిల్‌.


మీర్జాపూర్‌, పాతాళ్‌లోక్‌... వంటి వెబ్‌సిరీస్‌లకు వచ్చిన ఆదరణ తెలిసిందే. ఈ కథలు తెరకెక్కడానికి కారణం అమెజాన్‌ ప్రైమ్‌లో హెడ్‌ ఆఫ్‌ ఇండియా ఒరిజనల్స్‌ అపర్ణాపురోహిత్‌. దిల్లీ జామియా మిలియా విశ్వవిద్యాలయంలో మాస్‌కమ్యూనికేషన్స్‌ చదివిన అపర్ణ... తన కలలని నిజం చేసుకోవడానికి ముంబయిలో అడుగుపెట్టారు. అపర్ణకి కథలు చెప్పడం అంటే ఇష్టం. సోనీలో వచ్చిన ఉద్యోగాన్ని వదిలి మరీ కథలు రాయడం మొదలుపెట్టారు. 2008లో దేశాన్ని పట్టికుదిపేసిన ఆర్థిక మాంద్యం ఆమె కలలకి బ్రేక్‌ వేసింది. ఆ సమయంలో చిన్న చిన్న ఆర్టిస్ట్‌లకు గొంతు అరువివ్వడాలు, పెద్ద రచయితలకు సహాయక ఉద్యోగాలు వంటివీ చేశారు. ‘చివరికి నేషనల్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగం వచ్చింది. అక్కడకు దేశవ్యాప్తంగా ఎంతో మంది రచయితలు కొత్త కథలతో వచ్చేవారు. మనసు ఆనందంతో నిండిపోయేది. ఆ తర్వాతే 2016లో అమెజాన్‌లో అడుగుపెట్టాను. నేను విన్న కొత్త కథలకి ప్రాణం పోయడానికి అమెజాన్‌ మంచి వేదిక అయ్యింది’ అనే అపర్ణ కలలంటూ ఉంటే వాటిని నిజం చేసుకునే అవకాశాలెన్నో అంటారు.


ప్రధాని కార్యక్రమంతో... ఆమధ్య బేర్‌గ్రిల్స్‌తో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్‌ అడవుల్లో పర్యటించిన డాక్యుమెంటరీ గుర్తుందా? డిస్కవరీకి అమాంతం ప్రేక్షకులని పెంచిన ఈ కార్యక్రమం వెనుక కీలక వ్యక్తి మేఘాటాటా. డిస్కవరీ కమ్యూనికేషన్స్‌ ఇండియాకి అధిపతిగా మేఘనా ఆ సంస్థ ఛానెళ్లు, ఓటీటీనీ కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. ‘మా నాన్న సైనిక అధికారి. దాంతో కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు నేను చూడని ప్రాంతం లేదు. ప్రతి చోటా ఒక కొత్త బడి, కొత్త స్నేహితులు, కొత్త సంస్కృతి. ఇవన్నీ నన్ను ఎప్పటికపుడ[ు మార్పుని ఆహ్వానించేలా చేశాయి. స్టార్‌, హెచ్‌బీవోల్లో చేసిన అనుభవం... డిస్కవరీలో ప్రయోగాలకు కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ప్రధాని మోదీ కార్యక్రమం విజయవంతం కావడం స్థానికత ఉండే కార్యక్రమాలపై దృష్టిపెట్టడానికి కారణమయ్యింది’ అంటుంది తను. భారతీయ సంస్కృతిపై ప్రత్యేక డాక్యుమెంటరీలు నిర్మిస్తున్న మేఘా బైకర్‌ కూడా.


రిలయెన్స్‌ మీడియాని నడిపించి... ‘మా ఆలోచనలకు రెక్కలివ్వగల శక్తి ఆమెకు మాత్రమే ఉంది’... రిలయెన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ ఈ మాటలన్నది జ్యోతిదేశ్‌పాండే గురించి. రిలయెన్స్‌ ఆధ్వర్యంలోని జియో స్టూడియో, జియోసావన్‌, రిలయెన్స్‌ మూవీస్‌ బాధ్యతలని అవలీలగా నిర్వహించిన జ్యోతి ప్రస్తుతం వయాకామ్‌18కి సీఈవో. అంతకుముందు ఈరోస్‌ సంస్థకు అంతర్జాతీయ అధిపతిగా వ్యవహరించిన జ్యోతి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. చిన్నప్పుడు న్యుమోనియా, పోలియో బారిన పడినా ఆత్మవిశ్వాసాన్ని చెదిరిపోనివ్వలేదు. పిల్లలకు ట్యూషన్లు చెబుతూ ఎంబీయే చేశారు. ఈరోస్‌ తర్వాత ఆమె చేపట్టిన అతిపెద్ద బాధ్యత... రిలయెన్స్‌దే. కొత్త కథలతో ఎన్నో ప్రయోగాలు చేసిన ఆమె ఫోర్బ్స్‌ శక్తివంతమైన మహిళల జాబితాలోనూ ఉన్నారు.Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని