Published : 10/01/2022 01:44 IST

వేల కోట్ల అప్పులకు వారసురాలైంది

మాజీ సీఎం కూతురు, ప్రముఖ వ్యాపారవేత్త భార్య.. అదృష్టవంతురాలు అనేస్తాం కదా! ఇంకో కోణంలో చూద్దాం. జీవితంలో స్థిరపడని పిల్లలు. భర్త ఆత్మహత్య! దారి తెన్నూ లేని వ్యాపారాలు, వేల కోట్ల అప్పు.. ఇప్పుడేం అనిపిస్తోంది? భయంతో ఒళ్లు గగుర్పొడుస్తోంది కదూ! ఈ రెండు కోణాలు ఒకరివే. కేఫ్‌ కాఫీ డే సీఈఓ మాళవిక హెగ్దే.. అనుకోని కష్టాలు ఎదురైనా.. తను నిలబడి, సంస్థనూ ముందుకు నడుపుతున్నారు.

మాళవిక పుట్టి పెరిగిందంతా బెంగళూరే. ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌. నాన్న ఎస్‌ఎం కృష్ణ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి. అమ్మ ప్రేరణ కృష్ణ సామాజిక వేత్త. 1991లో కాఫీ వ్యాపారవేత్త వీజీ సిద్ధార్థతో వివాహమైంది. వీళ్లిద్దరూ కలిసి కేఫ్‌ కాఫీ డేకు శ్రీకారం చుట్టారు. నిజానికి ఆలోచన సిద్ధార్థదే. మొదట దీన్ని మాళవికతో పంచుకున్నప్పుడు ఆమె ఒప్పుకోలేదట. రూ.5కి ఎక్కడైనా దొరికే కాఫీని రూ.25 పెట్టి తాగడానికి తమ పార్లర్‌కే ఎందుకు వస్తారన్నది ఆమె ఉద్దేశం. అందుకే ససేమిరా అందట. దీంతో సిద్ధార్థ మళ్లీ ఆలోచనలో పడ్డారు. ఈసారి ఆయన ‘కాఫీకి ఉచిత ఇంటర్నెట్‌నూ అందిస్తే?’ అన్నారట. ఆలోచన ఈసారి ఈమెకీ నచ్చింది. ఇద్దరూ కలిసి ప్లాన్‌ చేశారు. అలా 1996లో మొదటి కేఫ్‌ కాఫీ డే (సీసీడీ) అవుట్‌లెట్‌ బెంగళూరులో ప్రారంభమైంది. తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించి భారతీయ ఆతిథ్య రంగంలో ప్రముఖ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. తెర మీద సిద్ధార్థే కనిపించినా.. తెరవెనుక మాళవిక ప్రోత్సాహమూ ఎక్కువే. సీసీడీ రోజువారీ కార్యకలాపాలన్నీ ఈవిడే చూసుకునేవారు.

2019 జులై.. సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్కసారిగా షాక్‌! కాఫీ కింగ్‌గా పేరుగాంచిన ఆయన మరణానికి కారణం.. అప్పు. అదీ రూ. ఏడువేల కోట్లు. సంస్థ దివాలా తీసేసింది అనుకున్నారంతా. దాదాపు 24 వేలమంది కార్మికులు తమ భవిష్యత్‌ ఏంటనే ఆందోళనలో పడ్డారు. ఒకానొక దశలో ఉద్యోగులు జీతాల కోసం ధర్నాలూ చేశారు. ఆ సమయంలో బాధనంతా పక్కనపెట్టి మళ్లీ తెరమీదకొచ్చారు మాళవిక. తన పిల్లలతోపాటు ఉద్యోగుల బాధ్యతనూ స్వీకరించారు. ‘సిద్ధార్థతో నా అనుబంధం 32 ఏళ్లు. సంస్థే ఆయన లోకం. ఉద్యోగులే కుటుంబ సభ్యులు. ఆయన నిర్మించిన సామ్రాజ్యాన్ని ముందుకు నడిపే బాధ్యతను తీసుకుంటా’నంటూ వాళ్లని సమాధానపరిచారు. ఆ అప్పులను తీర్చడం తన బాధ్యతన్నారు. అలా 2020 డిసెంబరులో సంస్థ సీఈఓ పగ్గాలు తీసుకున్నారు. ఇక్కడా ఎన్నో ఎదురుదెబ్బలు. కొవిడ్‌, చెల్లని చెక్కుల వివాదాలు. అన్నింటినీ ఒక్కొక్కటిగా దాటుతూ వచ్చారు. పెట్టుబడిని తగ్గించుకోవడానికి ఎన్నో వెండింగ్‌ మెషిన్‌లను వెనక్కి రప్పించారు. సంస్థ నిరర్థక ఆస్తులనీ అమ్మేశారు. ఏడాది కాలంలో సగం అంటే.. రూ. మూడువేల కోట్లకుపైగా అప్పుల్ని తీర్చేశారు. ఇంకొన్నేళ్లలోనే తిరిగి సంస్థకు పూర్వ వైభవం వస్తుందన్న ఆశ ఆమెలోనేకాదు.. సంస్థ ఉద్యోగుల్లోనూ కనిపిస్తోంది. టాటా వంటి సంస్థలూ పెట్టుబడికి ఆమెతో చర్చలు జరుపుతున్నాయి.

గతంలో మాళవిక సంస్థకు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సభ్యురాలు. రూపాయి జీతం తీసుకోలేదు. సంస్థలో ఆమెకున్న వాటా కూడా నాలుగు శాతమే. అయినా సీసీడీని ముందుకు నడపడం తన బాధ్యతగా భావించారు. కాఫీ ఎస్టేట్‌లో భర్తతో కలిసి మొక్కలు నాటేవారు. ఏ అవుట్‌లెటైనా ఇద్దరూ ప్రారంభించేవారు. సాధారణ ప్రేమికుల్లా కూర్చొని వినియోగదారులను గమనించేవారు. ఇలా ఒక్కో ఇటుక పేర్చుకుంటూ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. పైగా భర్తకు సంస్థపై ఎనలేని ప్రేమ.. ఇవన్నీ ఆమెను మధ్యలో వదిలేయనివ్వలేదు. ‘ఏడాదిలో ఎన్నో సవాళ్లు. నా భర్త వారసత్వాన్ని కొనసాగించాలన్న తపనే ముందుకు నడుపుతోంది. తను వదిలిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. అప్పులు చెల్లించడంతోపాటు వ్యాపారాన్నీ అభివృద్ధి పథంలో సాగించాలి. తద్వారా ఉద్యోగులకూ భద్రత కలిగించాలి. ఇదే నా ధ్యేయం’ అని ఓ సందర్భంలో చెప్పారు. భర్తపై ప్రేమ, ఆయన కలల సామ్రాజ్యం కూలిపోకూడదనే తాపత్రయంతో దాన్ని నిలబెట్టడానికి ఆమె చూపిస్తోన్న ధైర్యం, తెగువలకు ప్రశంసలు దక్కుతున్నాయి. చిన్న చిన్న వాటికే బెంబేలెత్తిపోయే ఎంతోమందికి ఆమె జీవితం స్ఫూర్తిమంతమే కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని