Published : 17/01/2022 00:30 IST

కాదన్నవాళ్లే ప్రశంసించారు!

అందరూ సాఫ్ట్‌వేర్‌ అంటూ పరుగులు పెడుతోంటే.. ఆమె మాత్రం దాన్ని వదులుకుంది. లక్షల రూపాయల వేతనం, ఉన్నతావకాశాలు, భవిష్యత్‌ భరోసా.. ఇవేమీ ఆమెకు తృప్తినివ్వలేదు. దీంతో అభిరుచివైపు అడుగులు వేసి, పేస్ట్రీ చెఫ్‌ అయ్యింది. ఆమె ఈ నిర్ణయం ఎంతోమంది మహిళలకూ ఉపాధినీ చూపుతోంది. విజయవాడకు చెందిన ఉషా పోలు.. తన ప్రయాణాన్ని వసుంధరతో పంచుకున్నారిలా!

చిన్నప్పటి నుంచీ కేకులంటే ఆసక్తి. తయారీ తెలియకపోయినా వాటి అలంకరణ పరికరాలను కొనుక్కొని దాచుకునేదాన్ని. మాది విజయవాడ. 2010లో ఎంసీఏ పూర్తవగానే మంచి వేతనంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగమొచ్చింది. దీంతో హైదరాబాద్‌కొచ్చాం. మావారు ఆదికేశవ లెక్చరర్‌. మా బాబు పుట్టినప్పుడు తన మొదటి నెలకి స్వయంగా ఫాండెంట్‌ కేకు చేయాలని నా కోరిక. అందరూ అదేమిటన్నట్టు చూశారు. చివరికి వీడియోలు చూసి చేశా. కానీ సంతృప్తి లేదు. దీంతో నేర్చుకోవాలని నిర్ణయించుకున్నా. మన దగ్గర నేర్పేవాళ్లే కనిపించలేదు. పరిశోధిస్తే వేరే నగరాల్లో ప్రముఖ చెఫ్‌లు నేర్పుతారని తెలిసింది. బెంగళూరు, ముంబయి ఇలా ఎక్కడ నేర్పుతున్నా వెళ్లిపోయేదాన్ని. లక్షలు వెచ్చించా. ఓ పక్క ఆఫీసు, వారాంతాల్లో నేర్చుకోవడం. బాగా ఇష్టమున్న పని కదా! అలసట అనిపించలేదు. అలా కేకులు, చాక్లెట్‌, కుకీస్‌.. బోలెడు నేర్చుకున్నా. తర్వాత ఆర్డర్లపై చేయడం మొదలెట్టా. నా పనివేళలు మధ్యాహ్నం. రాత్రి ఇంటికొచ్చాక ఆర్డర్‌ పూర్తిచేసి, ఉదయాన్నే డెలివరీ ఇచ్చేదాన్ని. ఎక్కువగా ఆఫీసువాళ్లే తీసుకునేవారు. ఎలా ఉండాలో చెప్పేవారు కాదు. ‘నీ మీద నమ్మకం ఉంది. తోచిన విధంగా చెయ్యి. కాకపోతే భిన్నంగా ఉండా’లనేవారు. దీంతో బాగా ఆలోచించేదాన్ని. ఒకసారి చేసినదాన్ని మళ్లీ కావాలని కోరితే తప్ప చేసేదాన్ని కాదు. అలా మంచి పేరొచ్చింది. ఓరోజు భర్తతో విడిపోయిన ఒకామె తనకూ నేర్పిస్తే ఉపాధిగా మార్చుకుంటానంది. దీంతో ఇంట్లోనే నేర్పించా. తర్వాత అలా అడిగే వారి సంఖ్య పెరిగింది.

ఓవైపు ఉద్యోగం చేస్తూనే మా వంటగదిలోనే నేర్పేదాన్ని. కొన్నిసార్లు నేర్పించడం, చేసివ్వడం కుదరక ఆర్డర్లను నా దగ్గర నేర్చుకున్నవాళ్లకే ఇచ్చేదాన్ని. ఇలా నాలుగేళ్లపాటు చేశా. తర్వాత రెండూ సమన్వయం కుదర్లేదు. దీంతో ఉద్యోగానికి స్వస్తి పలికి విజయవాడకి తిరిగొచ్చేశాం. పేస్ట్రీలు, చాక్లెట్‌లు.. ఇలా ఏవైనా చేయగలను. ఇంత మందికి నేర్పాను. అయినా చెఫ్‌ కాలేదన్న వెలితి. అందుకే సర్టిఫికెట్‌ తెచ్చుకోవాలనుకున్నా. స్థానిక హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల వాళ్లని కలిశాను. ఏవేవో సాకులు చెప్పేవారు. తర్వాత పాతికేళ్లలోపు వారినే తీసుకుంటామన్నారు. అప్పటికే నాకు 30 దాటాయి. వయసుదేముంది? ఆసక్తి ముఖ్యం కదా అన్నాన్నేను. దానికి వాళ్లు ప్యాంట్‌, షర్ట్‌ యూనిఫాం వేసుకోలేరు మీరన్నారు. నేను కొద్దిగా లావు మరి! ఇక కొనసాగించదలచుకోలేదు. మళ్లీ వేరే నగరం వెళ్లి సర్టిఫికేషన్‌ చేశా. తిరిగి ఇంటి నుంచి ఆర్డర్లు తీసుకుని చేయడం మొదలుపెట్టా. ఇక్కడా నేర్పించమని అడుగుతుండటంతో మళ్లీ బోధన మొదలుపెట్టా. ప్రత్యేకంగా ఇన్‌స్టిట్యూట్‌ ఉంటే బాగుంటుందనిపించింది. 2021లో ‘చాకోస్‌ ఎక్స్‌ప్రెస్‌ అకాడమీ’ ప్రారంభించా. తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా సంస్థ ఇదే మొదటిది. ప్రాథమిక నుంచి ఆధునిక రకాలన్నీ నేర్పిస్తాం. చూడటమే కాదు.. స్వయంగా చేసి నేర్చుకునేలా చూస్తాం. ఇప్పటివరకూ 3 వేలమందికిపైగా శిక్షణనిచ్చా. గత ఏప్రిల్‌లో సిటీ అండ్‌ గిల్‌ లండన్‌ సర్టిఫికేషన్‌ కూడా వచ్చింది. ఇది వచ్చినవారికి ప్రపంచంలో ఎక్కడైనా ఆదరణ ఉంటుంది. శుభ్రత, ఆహార భద్రత మొదలైన అంశాలను పరిశీలించి ఇస్తారు దీన్ని. తాజాగా వంటలనీ నేర్పించమంటున్నవారి కోసం ఆ తరగతుల్నీ మొదలుపెట్టాం. ఇందుకు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేకంగా చెఫ్‌ని రప్పించాం. కొవిడ్‌ ప్రభావం కొంత పడింది. దానికి తగ్గట్టుగా తరగతుల్లో మార్పులు చేశాం. స్కూలు పిల్లల నుంచి డాక్టర్ల వరకు వివిధ రంగాలవాళ్లు నా దగ్గర నేర్చుకున్నారు. వివిధ నగరాలే కాదు.. విదేశాల నుంచీ వచ్చారు. వారిలో ఎంతోమంది వ్యాపారాలను ప్రారంభించి మంచి ఆర్జనలు పొందుతున్నారు. ఇదంతా చూసినప్పుడు చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. గతంలో నేను సరిపడను అన్న సంస్థ వాళ్లే ఇప్పుడు తమ దగ్గర బేకింగ్‌ తరగతుల కోసం వచ్చే వాళ్లకి నన్ను సిఫారసు చేస్తున్నారు. ఇది నా విజయమే కదా!

-చిరుతాని శ్రీనివాస్‌, అమరావతి


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని