Updated : 26/01/2022 04:59 IST

కడుపులో బిడ్డతో యుద్ధభూమిలో విధులు...

ఒక చేతిలో రైఫిల్‌... మరో చేతిలో పసిబిడ్డ... కడుపులో మరోబిడ్డ! ఆ పరిస్థితుల్లోనూ యుద్ధభూమిలోంచి ఏమాత్రం వెనుకడుగు వేయాలనుకోలేదామె. బిడ్డలను కాపాడుకుంటూనే తల్లిలాంటి దేశం కోసం కార్గిల్‌ యుద్ధక్షేత్రంలో ధైర్యంగా     నిలబడింది కెప్టెన్‌ యషికాహత్వాల్‌త్యాగి. ఈ రోజుకీ సైన్యంలో చేరాలనుకునే   వారికి స్థైర్యాన్ని నూరిపోస్తున్న ఆమె అనుభవాలివి..

భూమికి వేల అడుగుల ఎత్తులో ఉన్న యుద్ధభూమిలో, గడ్డకట్టేచలిలో.. ఊపిరాడేదికాదు. కడుపులో ఉన్న బిడ్డకు ఏమన్నా అవుతుందేమోనన్న దిగులు. మరోపక్క అక్కడే బేస్‌మెంట్‌లో ఇవేమీ తెలియకుండా ఆడుకుంటూ...‘అమ్మా.. నాన్న ఎక్కడ?’ అనే పెద్దబాబు కన్నా. ‘యుద్ధంలో గెలవగానే నాన్న వచ్చేస్తారన్న’ సమాధానంతో నేను. ఎంత ధైర్యంగా ఉన్నా ఆ యుద్ధంలో అసువులు బాసిన సైనికుల అంత్యక్రియలకు హాజరైనప్పుడు ఆ ధైర్యం చెదిరిపోయేది. నేను స్త్రీనన్న ఒకే ఒక్క కారణం చూపించి అక్కడి నుంచి తప్పుకోవచ్చు. కానీ నాన్నకి నేనిచ్చిన మాట సంగతి గుర్తుకు రాగానే నాలోని భయాలన్నీ ఎక్కడికక్కడ పరారయ్యేవి. నాకు ఏడేళ్లప్పుడు ఇదే యుద్ధభూమిలో నాన్నని పోగొట్టుకున్నా. యుద్ధంలో చనిపోయిన ఆయన్ని తోటి సైనికులు ఒక పెట్టెలో పెట్టి తీసుకురావడమే ఆయనతో నాకున్న జ్ఞాపకం. ఆ వయసులో తెలిసీతెలియక నేనూ యుద్ధరంగంలో అడుగుపెడతా అన్నా. కానీ నాకు అప్పటికి తెలియదు...

ఆర్మీలో స్త్రీలకు అవకాశం లేదని. అలా సైనిక జీవితంపట్ల విపరీతమైన ప్రేమను పెంచుకున్నా. ఎప్పటికైనా సైనిక దుస్తులని ధరించాలన్నది నా కల. నాన్న చనిపోయేనాటికి అమ్మకు 33 ఏళ్లు. మేం ముగ్గురం ఆడపిల్లలమే. మమ్మల్ని పోషించడం కోసం అప్పుడు చదువుకొని టీచర్‌ అయ్యింది. అప్పట్లో మాకు రోజు గడవడం కష్టంగా ఉండేది. బట్టలు, పుస్తకాలు మేం కలిసి పంచుకునేవాళ్లం. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ డిగ్రీలు పూర్తిచేశాం. అమ్మ ఎప్పుడూ మేం ఒకరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండాలని కోరుకునేది. నేను ఆర్మీ అధికారి కెప్టెన్‌ సంజీవ్‌త్యాగిని ప్రేమించి పెళ్లిచేసుకున్నా. ఆయన ప్రోత్సాహంతోనే 1994లో భారతప్రభుత్వం మహిళలని షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌లోకి తీసుకుంటోందని తెలిసి పరీక్షలు రాసి ఆర్మీలో చేరాను. నా మొదటి విధులు... లేహ్‌లో. అంతవరకూ ఆడవాళ్లెవరూ అక్కడ విధులు నిర్వహించలేదు. ఆ ప్రాంతం ఎత్తులో ఉండటంతో మొదట్లో ఆక్సిజన్‌ అందక చాలా ఇబ్బంది పడేదాన్ని. లాజిస్టిక్స్‌ ఆఫీసర్‌గా కీలక బాధ్యతలు తీసుకున్నా. సైనికులకు  గుండుసూది మొదలుకుని మిస్సైల్స్‌ వరకూ అందివ్వాల్సిన బాధ్యత నాదే. అందులోనూ మహిళని కావడంతో మొదట్లో నా పనితీరుని అందరూ నిశితంగా గమనించేవారు.

అప్పటికే పెద్దబ్బాయి కన్న పుట్టాడు. నేను చేసే ఉద్యోగంలో భావోద్వేగాలకి చోటు ఉండదని తెలుసు. ఒక్క నిమిషం ఏమరపాటుగా ఉన్నా... జరగాల్సిన నష్టం జరిగిపోతుంది మరి. బాబుని ఇంట్లో వదిలి ఉద్యోగానికి వెళ్లేటప్పుడు ఎంతో ఘర్షణని ఎదుర్కొనేదాన్ని. ఉద్యోగం వల్ల వాడికి దూరం కాకూడదని పొద్దున్నే లేచేదాన్ని. వాడికి పాలు పట్టించి, స్నానం చేయించి కాసేపు ఆడుకుని అప్పుడు డ్యూటీలోకి వెళ్లేదాన్ని. 1999లో కెప్టెన్‌ హోదాలో కార్గిల్‌కి బదిలీ అయ్యా. అప్పడు మా రెండో బాబు కడుపున పడ్డాడు. మరోవైపు కార్గిల్‌లో యుద్ధం మొదలయ్యింది. ప్రెగ్నెన్సీ కారణంగా యుద్ధానికి దూరం కావాలనుకోలేదు. కాకపోతే 24 గంటలూ పనిచేయాల్సి వచ్చేది. దాంతో పెద్దాడిని కూడా ఆఫీసుకి వెంట తెచ్చుకుని కింద బేస్‌లో ఉంచి నేను పైన విధులు నిర్వహించేదాన్ని. ఒక్కోసారి నా కడుపులో బిడ్డను చూడగలుగుతానా అనిపించేది. ఆ పరిస్థితిలో ధైర్యంగా పనిచేస్తున్న నన్ను చూసి కెప్టెన్‌ విక్రమ్‌ భాత్రా వంటివారు ‘స్ఫూర్తినిస్తున్నావ్‌’ అన్న మాటలు ఇప్పటికీ నాకు మరిచిపోలేని జ్ఞాపకాలు. యుద్ధం ముగిసింది. విజయగర్వం మిగిలింది. నా భర్త త్యాగిని మా రెండోబాబు పుట్టాకే చూశాను. ఆపరేషన్‌ విజయ్‌ స్టార్‌తో సహా కార్గిల్‌ స్టార్‌ పతకాన్ని అందుకోవడం మరిచిపోలేని అనుభూతులు. ఒక స్త్రీ కెరీర్‌, కుటుంబం రెండూ సమర్థంగా నిర్వహించగలదని చెప్పడానికి నేనే ఉదాహరణ. ఆర్మీలో అడుగుపెట్టాలనుకునే స్త్రీలకు వర్క్‌షాపులు నిర్వహించి వారిని ప్రోత్సహిస్తున్నా. మావారు ఇంకా ఆర్మీలోనే విధులు నిర్వహిస్తున్నారు. ఆ రోజు పసివాడుగా ఉన్న కన్నా ఇప్పుడు వ్యాపారవేత్తగా ఎదిగితే అప్పుడు కడుపులో ఉన్న ధృవ్‌ న్యాయవాదిగా మారాడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని