Published : 31/01/2022 01:11 IST

400 మంది గృహిణులు...అదిరిపోయే మసాలాలు

అమెరికాలో ఎంబీఏ పూర్తైంది. వెంటనే ఆరంకెల వేతనంతో కొలువు చేతికందింది. వేరొకరైతే ఎగిరి గంతేసేవారే. అనామిక లక్ష్యం అదికాదు. తానే ఇతరులకి ఉపాధి ఇవ్వాలనుకుంది. అమ్మ చేసే మసాలాలతోనే ‘నారియో’ అంకుర సంస్థను ప్రారంభించింది.  ఏడాదిలోనే కోట్ల టర్నోవర్‌ సాధించిన ఈ అమ్మాయి వరంగల్‌లోనే చదివింది. తన విజయాన్ని, ప్రయాణాన్ని ‘వసుంధర’తో పంచుకుందిలా..

నామిక వరంగల్‌ జాతీయ సాంకేతిక విశ్వవిద్యాలయం (ఎన్‌ఐటీ)లో 2017లో బీటెక్‌ బయోటెక్నాలజీ పూర్తి చేసింది. తర్వాత చికాగో యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ఎంబీఏ చదివింది. బెంగళూరులోని ఓ బహుళజాతి కంపెనీ ఉన్నత స్థాయి ఉద్యోగమిస్తామంటూ ఆహ్వానం పలికింది. ఆకర్షణీయమైన వేతనం. అయినా సంతృప్తి చెందలేదు అనామికా పాండే. నలుగురికి ఉపాధి కల్పించేలా ఏదైనా అంకుర సంస్థ ప్రారంభించాలనుకుంది. ఈ సమయంలోనే ఓసారి ఊరొచ్చింది. ఆమె సొంతూరు ఉత్తర్‌ప్రదేశ్‌లోని వాస్తుఖండ్‌. భోజనం చేస్తున్నప్పుడు అమ్మ ఇంట్లో చేసే మసాలా గుర్తొచ్చింది. ‘లఖనవీ మసాలా’గా పిలిచే ఆ పదార్థం చాలా రుచికరంగా ఉంటుంది. మటన్‌, చికెన్‌లాంటి మాంసాహారాలతోపాటు నూడుల్స్‌లోనూ కలిపి వాడుకోవచ్చు. 28 ఏళ్లుగా అమ్మ చేస్తున్న ఈ మసాలాని పెద్దఎత్తున తయారు చేసి మార్కెట్లో అమ్మొచ్చుగా అని అడిగింది. ‘మనలాంటి సంప్రదాయ కుటుంబం వాళ్లు మసాలాలు అమ్మితే మీ నాన్న, తాతయ్య గురించి నలుగురూ నాలుగు విధాలుగా అనుకోరూ’ అంటూ నిష్ఠూరమాడారామె. ఆ సమాధానం అనామికకి రుచించలేదు. సంప్రదాయం, మొహమాటం కారణంగా తన తల్లిలాంటి గృహిణుల్లో రకరకాల నైపుణ్యాలు, ప్రతిభ ఉన్నా బయటకు రావడం లేదు.. వాటిని పక్కనపెట్టి, దీన్నే తన స్టార్టప్‌కి ముడిసరకుగా మార్చాలనుకుంది అనామిక. అలా అమ్మ మసాలా నుంచి పుట్టిందే ‘నారియో’.

అంతా మహిళలే..
గతేడాదే నారియో మొదలైంది. ఇందులో పని చేసేవారంతా మహిళలే ఉండాలనే నియమం పెట్టుకుంది అనామిక. చాలామంది గృహిణులు పిల్లలు పుట్టాక ఉద్యోగం మానేస్తారు. తర్వాత మళ్లీ ఉద్యోగం చేయాలన్నా అవకాశాలు దొరకవు. నారియోలో అలాంటి వారికే అవకాశం ఇస్తున్నారు. కరోనా విజృంభించాక ఇంటి మసాలాకు, సేంద్రియ ఆహార పదార్థాలకు గిరాకీ పెరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎనిమిది రకాల ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. సేంద్రియ గోధుమ పిండి, పప్పులు, రుచికరమైన మసాలాలు, పానీయాలు తయారు చేస్తున్నారు. ఇందులో కొన్ని పూర్తి సేంద్రియమైతే, ఇంకొన్ని సహజ పదార్థాలతో రూపొందించినవి. కొద్దిరోజుల్లోనే నారియో ఉత్పత్తులకు గిరాకీ పెరగడంతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ, ఉత్తరాఖండ్‌లోని కాశీపూర్‌తోపాటు దక్షిణాది రాష్ట్రాల కోసం చెన్నైలో యూనిట్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోనూ ఈ బ్రాండ్‌కి ఆదరణ లభిస్తోంది. మొత్తమ్మీద దేశవ్యాప్తంగా పది నగరాల్లో నారియోను ప్రజలు ఆదరిస్తున్నారు.


నాన్నతో మాట్లాడలేదు..

‘ఇరవై మూడేళ్ల వయసులో ఈ అంకుర సంస్థ ప్రారంభించాను. మొదట్లో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ముఖ్యంగా నాన్న అఖిలేశ్‌ పాండేకి నా ఆలోచన నచ్చలేదు. అంత పెద్ద చదువులు చదివి మసాలాలు అమ్ముకోవడం ఏంటన్నారు. కొంచెం బాధగా అనిపించినా వెనక్కి తగ్గలేదు. దాంతో నాన్న కొన్నాళ్లపాటు నాతో మాట్లాడలేదు. ఇప్పుడు మళ్లీ మాటలు కలిశాయనుకోండి! ప్రస్తుతం మా సంస్థలో దేశవ్యాప్తంగా 400 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఏడాదిలోనే వ్యాపారం నాలుగు కోట్ల టర్నోవరుకి చేరింది. మా లక్ష్యం పెద్దది. చేరతామనే నమ్మకం ఉంది. ఇది మా సంస్థలోని ప్రతి ఇల్లాలి విజయం. ప్రతి మహిళలో ఏదోరకమైన ప్రతిభ ఉంటుంది. నిరూపించుకునే అవకాశం వస్తే అద్భుతాలు సృష్టిస్తారు. ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతారు.’

గుండు పాండురంగశర్మ, ఈనాడు, వరంగల్‌


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని