Updated : 08/02/2022 04:36 IST

ఫుడ్‌ గార్డెన్‌తో.. లక్షలు పూయిస్తోంది

వీలున్న సమయాల్లో గంటల చొప్పున పనిచేసే అవకాశం.. శిక్షణ తర్వాతే పని చేసే వీలు. నైపుణ్యాలు సరిగా లేవనిపిస్తే వెళ్లి నేర్చుకుని మరీ నేర్పించడం.. కార్పొరేట్‌ సంస్థ తీరును తలపించడం లేదూ! కానీ ఇవన్నీ పాటిస్తోంది ఓ సామాన్య మహిళ. చదివిందీ ఇంటరే. అప్పటిదాకా భర్త చాటు భార్య అయినా ఆయనకు సమస్య వస్తే తోడుగా నిలవడానికి వ్యాపారాన్ని మొదలెట్టింది. తన ఆలోచనను మరికొందరితో పంచుకొని వాళ్లూ తనతో నడిచేలా చేసింది. నెలకు రూ.12 లక్షలకుపైగా సంపాదిస్తోంది. విజయనగరానికి చెందిన కన్యాకుమారి విజయ ప్రస్థానమిది!

నం చేసేదేదైనా.. నలుగురికీ ఉపయోగపడాలి’ .. మా ఆయన శ్రీనివాస్‌ ప్రసాద్‌ నాతో తరచూ చెప్పే మాట ఇది. ఆయన ఓ సూపర్‌ మార్కెట్‌ నిర్వహించేవారు. ఆయన ప్రభావంతోనే ఒకరికైనా ఉపాధి కల్పించాలనిపించేది. ఒకమ్మాయి సాయంతో వడియాలు, అప్పడాలు చేసి అమ్మేదాన్ని. తర్వాత ఇంకొంతమందిని చేర్చుకుంటూ వెళ్లా. మరోవైపు మావారు భాగస్వాముల నుంచి విడిపోవాల్సి వచ్చింది. ఒకరు చేసిన మోసంతో కుంగిపోయారు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. ఎల్లప్పుడూ నన్ను ప్రోత్సహిస్తూ, ధైర్యంగా ఉండే ఆయన్ని అలా చూడలేకపోయా. ఆర్థిక కష్టాలు ఎన్నో రోజులుండవనేది నా నమ్మకం. కాకపోతే కాస్త కష్టపడాలి. అదే చెప్పా. నేనూ తోడుగా ఉంటానన్నా.

నేను పుట్టి పెరిగిందంతా ఒడిశా. చదివిందేమో ఇంటర్‌. నాకు తెలిసిందల్లా వంటలే. రుచిగా, శుచిగా చేయడం మాత్రం తెలుసు. దాన్నే వ్యాపారంగా మలచుకోవాలనుకున్నా. ఎంతోమంది మహిళలకు కష్టపడే మనస్తత్వం ఉండీ, సరైన దారి తెలియక మిన్నకుండి పోయినవారే. వాళ్లకి అవకాశమిద్దామనుకున్నా. చుట్టుపక్కల వాళ్ల దగ్గరికెళ్లి కలిసి.. ఇలా ప్రారంభిస్తున్నానని చెప్పి ఆసక్తి ఉంటే తోడు రమ్మన్నా. ముందుకొచ్చిన వారితో ఇంటి పైభాగాన్ని ఖాళీ చేసి పిండి వంటలు ప్రారంభించా. నా దగ్గర పనిచేసేవారిలో అందరూ మహిళలే. అలా రూ.ఆరు వేల పెట్టుబడితో 2016లో ‘ఫుడ్‌ గార్డెన్‌’ ప్రారంభించాం. అరకేజీ సున్నుండలతో మొదలుపెట్టి పొడులు, పచ్చళ్లు, పిండి వంటలు, బేకరీ ఉత్పత్తులు ఇలా ఎన్నింటినో అందిస్తున్నాం. మొదట్లో చాలామంది మీరు చేయలేరు, డబ్బు వృథా అని నిరాశ పరిచేవారు. నాదెప్పుడూ సానుకూల దృక్పథమే. అవేమీ పట్టించుకోలేదు. తోటి మహిళలతో కలిసి ఇలా ప్రయత్నిస్తున్నానని తెలిసి విదేశాల్లో ఉండే మావారి స్నేహితుడూ పెట్టుబడి పెట్టారు. అది కొండంత ధైర్యాన్నిచ్చింది.

ఇంట్లో చేసినవి రుచిగా ఉంటాయి. కానీ వాటితో అందరినీ కొనేలా ఆకర్షించలేం కదా! ఇదే సమస్య మాకూ ఎదురైంది. కొన్నిసార్లు కొన్ని పదార్థాలు ఎన్నిసార్లు తయారు చేసినా విఫలమవుతుండేవి. అమ్మ, అమ్మమ్మ దగ్గరికెళ్లి నేర్చుకొని వచ్చేదాన్ని. బెంగళూరులోనూ కొన్నిరోజులు శిక్షణ తీసుకున్నా. మా దగ్గర ఎవరు చేరినా..వాళ్లకి శుభ్రత దగ్గర్నుంచి, చేసే విధానం వరకు ప్రతిదానిలో శిక్షణనిస్తా. ఇంకా.. ఓ పక్క ఇల్లు, ఆరోగ్యం బాలేని అత్తగారు, మరోవైపు వ్యాపారం. తీరిక ఉండేది కాదు. ఇదే సమస్య చాలామందిది. దీంతో త్వరగా మానేసేవారు. అప్పటిదాకా ఇచ్చిన శిక్షణ, పడ్డ శ్రమ అంతా వృథానే కదా! అందుకే నిర్ణీత గంటల విధానంలో కాకుండా తోచిన సమయాల్లో చేసే వీలు కల్పించా. ఇది చాలామందికి అనుకూలంగా ఉండటంతో పనులు ముగిశాక, వీలున్న వేళల్లో వచ్చి చేయడం మొదలుపెట్టారు. ఇన్నేళ్లలో ఇలాంటివెన్నో.

ఒక్కోదాన్నీ దాటుకుంటూ ముందుకెళ్లా. ఇప్పుడు మావద్ద సుమారు 40 మంది పని చేస్తున్నారు. యజమాని, పనివారు అన్న తేడాలుండవు. అందరం ఓ కుటుంబంలా కలిసి పనిచేస్తాం. ఏదైనా ఊరెళ్లినా దుకాణం బాధ్యతలు వాళ్లకే అప్పగిస్తా. నాణ్యత, ఆరోగ్యానికే ప్రాధాన్యం. అందుకే రసాయనాలు, రంగులు వాడం. సుమారు 300 రకాలు తయారు చేస్తున్నాం. వాటిల్లో ఏమేం ఉపయోగించామో వాటిని పేర్చిన చోట రాసుంచుతాం. అదీ మాపై నమ్మకానికి కారణమైంది. కొరియర్‌ ద్వారా ఇతర ప్రాంతాలకూ పంపుతున్నాం. విదేశాలకు వెళ్లే వాళ్లూ చేయించుకుని తీసుకెళుతుంటారు.

జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. ప్రతిదీ ఓ దశ. కష్టం ఎదురవగానే కుంగిపోకూడదు. కాస్త ఓపికతో ప్రయత్నిస్తే అది దాటుతుంది. నేనిదే నమ్ముతా. అందుకే మొదట్లో లాభాలు రాకపోయినా ఓపిగ్గా కొనసాగించా. ఏటా రూ.కోటికి పైగా వ్యాపారం చేస్తున్నానంటే అదే కారణం.

- కె.మునీందర్‌, విజయనగరం


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని