Updated : 09/02/2022 01:21 IST

ఆ తల్లుల కష్టం మరెవరికీ రాకూడదని...!

బిడ్డకు చిన్నగాయం అయితేనే అమ్మ మనసు తల్లడిల్లి పోతుంది... మరి ఆ బిడ్డకు తలసీమియా, సికెల్‌సెల్‌ అనీమియాలాంటి సమస్యలుంటే? మాటికీమాటికీ రక్తం మార్చాలి.. జీవితాంతం ఆస్పత్రుల చుట్టూ తిరగాలి. ఇక ఆ తల్లుల బాధ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా? ఇలాంటి ఇబ్బందుల్ని దగ్గరగా చూసిన డాక్టర్‌ సుమన్‌ ‘టీఎస్‌సీఎస్‌’ సొసైటీ వేదికగా 23 ఏళ్లుగా వైద్యసేవల్నందిస్తున్నారు. వసుంధరతో ఆ వివరాల్ని పంచుకున్నారిలా...


కోల్‌కతాలో ఎంబీబీఎస్‌ చదివి ముంబయిలో 1991లో చైల్డ్‌ హెల్త్‌లో డిప్లొమా చేశాను. పెళ్లి తర్వాత హైదరాబాద్‌ వచ్చాను. అప్పటి నుంచి ఇక్కడే పిల్లలకు సేవలు అందిస్తున్నాను. మొదట్లో బీబీఆర్‌ హాస్పిటల్‌లో, తర్వాత నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్‌(ఎన్‌ఐఎంహెచ్‌)లో పరిశోధన అధికారిగా సేవలు అందించాను. తర్వాత  ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ జెనిటిక్స్‌లో చేరాను. అప్పుడే తలసేమియా, సికిల్‌సెల్‌ సొసైటీ ఏర్పాటైంది. 2010 నుంచి సొసైటీ కార్యదర్శిగా, చీఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ ఆఫీసర్‌గా కొనసాగుతున్నా. దాతల తోడ్పాటుతో సొసైటీ రోగులకు పూర్తి ఉచితంగా సేవలు అందిస్తోంది.

నేను అప్పుడు ఉస్మానియా పరిధిలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జెనిటిక్స్‌లో వైద్యాధికారిని. సుమారు రెండున్నరేళ్లు అక్కడ చేశా. ఆ సమయంలో తలసీమియాతో బాధపడుతున్న పిల్లల తల్లిదండ్రులు మా దగ్గరకు వస్తుండేవారు. ఈ వ్యాధి ఉన్న పిల్లల్లో తరచూ రక్తహీనత ఎదురవుతుంది. దాంతో వాళ్లు తరచు అలసిపోతుంటారు. జీవితాంతం రక్త మార్పిడి చేస్తుండాలి. ఐరన్‌ మాత్రలు వాడాలి. ఇదంతా ఆ అమ్మానాన్నలకు ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే కాదు.. ఆర్థికంగా, మానసికంగా కూడా భారం. మొదటి సంతానంతో ఈ ఇబ్బందుల్ని పడుతున్న ఓ ఉద్యోగి తన రెండో సంతానం అయినా ఆరోగ్యంగా పుట్టాలని, అందుకు కావాల్సిన వైద్యపరీక్షల్ని సూచించమని అడిగాడు. కానీ అప్పట్లో ఇక్కడ ఆ అవకాశం ఉండేది కాదు. దాంతో వెల్లూర్‌లోని క్రిస్టియన్‌ మెడికల్‌ కళాశాలకి పంపించాం. ఈ క్రమంలో అతను పడిన ఇబ్బందుల్ని నాతో పంచుకున్నాడు. అలా మరెవ్వరూ ఇబ్బంది పడకూడదనే హైదరాబాద్‌లోనూ 1998లో తలసీమియా, సికిల్‌సెల్‌ అనీమియా సొసైటీ (టీఎస్‌సీఎస్‌) ఏర్పాటు చేశాం. ఈ సంస్థ ఆరాంఘర్‌ దగ్గర ఉంది. ఈ సమస్యలతో బాధపడే చిన్నారులు తమ వైద్య అవసరాలను తీర్చుకునేందుకు వీలుగా ఇక్కడ రక్త నిధి, రక్త మార్పిడి కేంద్రం, పరీక్ష కేంద్రం, పరిశోధన ల్యాబ్‌తో సహా అనేక సౌకర్యాలను ఏర్పాటు చేశాం. ఈ సేవలన్నీ ఉచితమే. సొసైటీ ఏర్పాటయినప్పుడు ఇందులో 20 మంది పిల్లలు పేర్లు నమోదు చేసుకుంటే.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో 3130 మంది సభ్యులున్నారు. ఒక్క తెలంగాణలోనే రెండువేలకు పైగా ఉన్నారు. నిమ్స్‌, సీడీఎఫ్‌డీ, ఫెర్నాండెజ్‌ ఆసుపత్రుల సహకారంతో బిడ్డ కడుపులో ఉండగానే ఈ వ్యాధిని నిర్థరించే సదుపాయాన్నీ అందుబాటులోకి తీసుకొచ్చాం.

గర్భిణులకు పరీక్షలు...

ఇది జన్యు సమస్యే అయినా నివారించగదగ్గదే. పుట్టబోయే పిల్లలు దీనిబారిన పడకుండా ఉండేందుకు గర్భిణులకు పరీక్షలు చేస్తున్నాం. ఇప్పటికే ఈ లోపం ఉన్న పిల్లల్లో మూలాన్ని తెలుసుకునేందుకు కుటుంబ పరీక్షలూ నిర్వహిస్తున్నాం. హైదరాబాద్‌లోని పేట్లబుర్జు ఆసుపత్రిలో ప్రయోగాత్మకంగా... గర్భిణులకు మొదటి త్రైమాసికంలో హెచ్‌బీఏ2 పరీక్ష చేశాం. ఇలా 966 మందిని పరీక్షించాం. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని రాజాపూర్‌, బాలాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఈ పరీక్షలు నిర్వహిస్తున్నాం. తల్లిదండ్రులిద్దరిలోనూ ఈ జన్యువులు ఉంటే పుట్టబోయే బిడ్డకూ వచ్చే అవకాశం ఎక్కువ. అందుకని యాంటినాటల్‌ స్క్రీనింగ్‌లు చేస్తున్నాం. ఇవన్నీ ఉచిత పరీక్షలు. ఇందుకయ్యే ఖర్చుని మేమే భరిస్తున్నాం. పరీక్షల అనంతరం ఫలితాల ఆధారంగా కౌన్సిలింగ్‌ ఇవ్వడం వల్ల 41 మందికి ఇటువంటి పిల్లలకు జన్మనివ్వకుండా చూశాం. తైవాన్‌ వంటి దేశాలే మాకు స్ఫూర్తి. ఎందుకంటే అక్కడ ఈ సమస్యని 25 శాతం నుంచి 0.01 శాతానికి తగ్గించారు. మనదేశాన్నీ తలసీమియా రహిత దేశంగా మార్చాలన్నదే నా కల. ఇందుకు మొదటి మూడునెలల్లోనే హెచ్‌బీఏ2 పరీక్ష తప్పనిసరిగా చేస్తే ఎక్కువ ప్రయోజనాలుంటాయి.

-మల్లేపల్లి రమేశ్‌రెడ్డి, హైదరాబాద్‌


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని