Updated : 11/02/2022 05:19 IST

వారి కళ్లలో మెరుపే నాకు స్ఫూర్తి

ఆమె పెద్దచదువులు చదువుకుంది. కానీ కుటుంబ బాధ్యతలు చేతులు కట్టేశాయి.  బాబుని బడికి పంపాక ఉన్న తీరిక సమయంలో చేసిన రిటర్న్‌ గిప్టుల ఆలోచన ఆమెని వ్యాపారంలో ముందుకు నడిపించింది. లక్షల్లో టర్నోవర్‌ సాధిస్తూ ... నలుగురికి ఉపాధినిచ్చేలా చేసింది. విదేశాలకూ జ్యూట్‌ ఉత్పత్తులని అందిస్తూ శెభాష్‌ అనిపించుకుంటున్న ఆమే కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన వసుంధర...  

మా సొంతూరు ప్రొద్దుటూరు. మావారు శ్రవణ్‌ కుమార్‌ సివిల్‌ ఇంజినీర్‌. నేను ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, ఎంబీఏ చేశాను. మాకో బాబు. ఇప్పుడు నాలుగో తరగతి. వాడిని బడికి పంపాక కాస్త తీరిక దొరికేది. అంత చదువుకొని ఖాళీగా ఉండటం నచ్చేది కాదు. ఏదైనా పార్ట్‌టైం ఉద్యోగం చేద్దామనుకున్నా. అప్పుడే ఒక బ్యాంకు వాళ్లు జ్యూట్ బ్యాగ్‌ల తయారీపై శిక్షణ ఇస్తున్నారంటే వెళ్లాను. మరో ముప్పై మంది కూడా ఈ శిక్షణ కోసం వచ్చారు. అదయ్యాక నాకో ఆలోచన వచ్చింది. నేను వ్యాపారం వైపు ఎందుకు వెళ్లకూడదని? శిక్షణ తీసుకున్న వాళ్లలో కొందరైనా నాతో ఉండకపోతారా అనిపించింది. వాళ్లందరితో ఓ గెటు టూ గెదర్‌ ఏర్పాటు చేసి, నా ఆలోచన పంచుకున్నా. ఓ నలుగురు మాత్రం నాతో కలిసి పనిచేస్తాం అన్నారు.  అంతలో బంధువుల ఇంట్లో పెళ్లి. నేనో మూడు జ్యూట్‌ బ్యాగు నమూనాలు చేసి రిటర్న్‌ గిఫ్ట్‌లుగా ఇవ్వడానికి బాగుంటాయని చూపించా. వాళ్లకూ నచ్చాయి. అలా 250 బ్యాగులకి తొలి ఆర్డర్‌ వచ్చింది. ఆ బ్యాగుపై ఉన్న మా నంబర్‌ చూసి ఓ నగల దూకాణం వాళ్లు రూ.2 లక్షల ఆర్డర్‌ ఇచ్చారు. అలా నా వ్యాపార ప్రయాణం మొదలైంది.

నైపుణ్యాలు పెంచుకుని...పెళ్లిలో బంధువులకు గుర్తుండిపోయే అందమైన కానుకలు ఇవ్వాలనుకుంటారు చాలామంది. వాళ్లకు నచ్చేలా ఎప్పటికప్పుడు సృజనాత్మకంగా రిటర్న్‌ గిఫ్ట్‌లు తయారు చేసి అందిస్తున్నా. నైపుణ్యాలు పెంచుకునేందుకు నేషనల్‌ జ్యూట్‌ బోర్డు నిపుణుల దగ్గర శిక్షణ కూడా తీసుకున్నా. ఏలూరు, కోల్‌కతా, గుమ్మడిపూడి, ముంబయి, హైదరాబాద్‌ నుంచి ముడి సరుకు కొనుగోలు చేసి.. 500 పైగా రకాల్ని తయారు చేస్తున్నాం. నాణ్యత బాగుండటంతో తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాలకూ, కెనడా, సింగపూర్‌, ఆస్ట్రేలియా, అమెరికా, వెనిజులా వంటి దేశాలకూ మా ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాం. ప్రస్తుతం విశాఖపట్నం, విజయవాడ, కాకినాడల నుంచి ఎక్కువగా ఆర్డర్లు వస్తున్నాయి. మొదట్లో దీన్నో సీజనల్‌ వ్యాపారంగానే భావించాను. అందుకే శుభకార్యాలు లేకపోతే ఖాళీగా ఉండాల్సి వస్తుందేమో అనుకున్నా. కానీ విశ్వవిద్యాలయాల సెమినార్లకు ల్యాప్‌టాప్‌ బ్యాగులు కావాలంటూ అడిగేవారు. తర్వాత ఆసుపత్రులకు, స్కూళ్లకు అవసరమైన ఫోల్డర్లు, లంచ్‌ బ్యాగులు, ఆడవాళ్ల హ్యాండ్‌ బ్యాగులు కూడా చేయడం మొదలుపెట్టాం. ఎక్కడ ఎగ్జిబిషన్లు జరిగినా మా ఉత్పత్తుల్ని ఉంచేదాన్ని. దాంతో అమ్మకాలూ పెరిగాయి. అలా రెండేళ్లకే కర్నూలులో ఉన్న యూనిట్‌ను నంద్యాలకు మార్చి అక్కడే విస్తరించాం. ఏటా రూ.40-50 లక్షలపైగా టర్నోవర్‌ చేస్తున్నాం.

సవాళ్లూ ఎక్కువే...మొదట్లో బ్యాంకు రుణం దొరక్క ఇబ్బందులు పడ్డా... కాస్త నిలదొక్కుకున్నాక వాళ్లే పిలిచి ఇవ్వడంతో వ్యాపార విస్తరణ తేలిక అయ్యింది. ముడిసరుకు కొనుగోలు కోసం నేను కోల్‌కతా వంటిచోట్లకు వెళ్లినప్పుడు ఇంట్లో అమ్మా, నాన్న... తమ్ముడి కుటుంబం సాయంగా ఉంటూ బాబుని చూసుకుంటున్నారు. దాంతో వ్యాపారం మీద దృష్టి పెట్టగలుగుతున్నా. ప్రస్తుతం ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 మందికి ఉపాధి కల్పిస్తున్నాం. పసుపు, కుంకుమ పొట్లాలని సృజనాత్మకంగా తయారుచేసే పనికి ఒప్పుకొన్నాం. దీనిద్వారా మరో వందమంది ఆడవాళ్లకు ఇంటినుంచే ఉపాధి కల్పించే ప్రయత్నాల్లో ఉన్నా.


ప్రతిభ ఉండి కాస్త ఆర్థిక వెసులుబాటు ఉన్న వారు ఇంటికే పరిమితమయ్యే కన్నా...  ఏదో ఒక వ్యాపార ప్రయత్నం చేస్తే నలుగురికీ ఉపాధి చూపించిన వాళ్లు అవుతారు. నేను తోటి మహిళల నుంచి అదే కోరుకుంటున్నా. నేను జీతం ఇచ్చిన ప్రతిసారి అవి అందుకుంటున్నప్పుడు ఆడవాళ్ల కళ్లలో కనిపించిన మెరుపే నాకు స్ఫూర్తి. మొదట్లో సవాళ్లు ఎదురైనా ఇప్పుడు వాటిని అధిగమించే ధైర్యం వచ్చింది.


-యడ్లపాటి బసవ సురేంద్ర, కర్నూలు


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని