ఇదీ వ్యాపారమేనా అన్నారు!

సాధించడానికి వైకల్యాన్ని అడ్డుగా భావించలేదామె. పట్టుదలతో  పరిశ్రమను స్థాపించి.. ఎందరో మహిళలకు, రైతులకు ఉపాధిని కల్పించారు. బర్గర్లు, స్ప్రింగ్‌రోల్స్‌ తయారీ, పుట్టగొడుగుల వ్యాపారంలో రూ.40కోట్ల టర్నోవర్‌ స్థాయికి చేరుకున్నారు వీరమనేని హేమ. ఒక సాధారణ మహిళ అసాధారణ విజయగాథ ఇది...

Updated : 21 Jul 2022 15:24 IST

సాధించడానికి వైకల్యాన్ని అడ్డుగా భావించలేదామె. పట్టుదలతో  పరిశ్రమను స్థాపించి.. ఎందరో మహిళలకు, రైతులకు ఉపాధిని కల్పించారు. బర్గర్లు, స్ప్రింగ్‌రోల్స్‌ తయారీ, పుట్టగొడుగుల వ్యాపారంలో రూ.40కోట్ల టర్నోవర్‌ స్థాయికి చేరుకున్నారు వీరమనేని హేమ. ఒక సాధారణ మహిళ అసాధారణ విజయగాథ ఇది...

పోలియో వల్ల.. నా రెండు కాళ్లూ పని చేయవు. అయినా దాన్నో లోపంగా నేనెప్పుడూ భావించలేదు. గట్టిగా అనుకోవాలే కానీ ఏదైనా సాధించొచ్చు అన్నది నా నమ్మకం. అదే నన్నింత వరకూ నడిపించింది. మా స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడ. నాన్న వ్యాపారరీత్యా.. ముంబయిలో ఉండే వాళ్లం. బీఎస్సీ మైక్రో బయాలజీ చదివా. పెళ్లయిన తర్వాత మావారు కూర్మ వెంకటప్రసాద్‌తో కలిసి 1996లో హైదరాబాద్‌ వచ్చేశా. ఖాళీగా ఉండటం నాకిష్టం ఉండదు. అందుకే ఏదో ఒకటి చేయాలని ఆలోచించే దాన్ని. డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ పెడదామనుకున్నా. కానీ మావారికి వ్యవసాయం అంటే ఇష్టం. రైతులకు మేలుచేసేలా ఏదైనా మంచి వ్యాపారం ప్రారంభించాలనేది ఆయన కల. దాంతో రైతుల నుంచి బేబీకార్న్‌, స్వీట్‌కార్న్‌ని కొనుగోలు చేసి వాటితో నిల్వ ఉండే సమోసాలు, స్ప్రింగ్‌రోల్స్‌, బర్గర్లు చేసే కుటీర పరిశ్రమని ఇంట్లోనే స్థాపించా. మా వ్యాపారం నెమ్మదిగా ఊపందుకుంది. ఆర్డర్లు ఎక్కువయ్యాయి. దాంతో ఇల్లు సరిపోలేదు. 2007లో ఉప్పల్‌ పారిశ్రామికవాడలో యూనిట్‌ పెట్టాం. గజ్వేల్‌, ప్రజ్ఞాపూర్‌, వికారాబాద్‌ ప్రాంతాల్లో బేబీకార్న్‌ పంట సాగు చేయడానికి రైతులతో ఒప్పందం కుదుర్చుకున్నాం. వాళ్లకు విత్తనాలని ఉచితంగా ఇస్తాం. బేబీకార్న్‌ పంట నలభైఐదురోజులకే కోతకొస్తుంది. ఆ తర్వాత..... ఆ గడ్డిని పశువులకు వేసుకుంటూ కూడా రైతులు లాభపడుతున్నారు. కొందరు బంధువులు మాత్రం.. అలా ‘పశువులకు వేసే బేబీకార్న్‌తో వ్యాపారమా? సమోసాల వ్యాపారమా’ అంటూ వెటకారం ఆడేవారు. ఆ వ్యాపారంలో తప్పేముంది? అందుకే నేనా వ్యాఖ్యల్ని పట్టించుకోలేదు. మా ఉత్పత్తుల రుచి, నాణ్యత బాగుండటంతో మేం చేసిన సమోసాలు... చెన్నె, బెంగళూరు, విజయవాడలకు ఎగుమతవుతున్నాయి. హైదరాబాద్‌లోనూ పెద్ద హోటళ్లు, ఫంక్షన్‌ హాళ్లు, సూపర్‌ మార్కెట్‌ల నుంచి ఆర్డర్‌ వస్తున్నాయి. మా యూనిట్‌లో పనిచేసే మహిళా సిబ్బంది సంఖ్య 30 నుంచి 150 మందికి చేరింది. ఈ వ్యాపారం విజయవంతం అవ్వడంతో నా దృష్టి ప్రొటీన్‌ని పుష్కలంగా అందించే పుట్టగొడుగులపై పడింది. 

నలభై ఎకరాల్లో...

కర్నూలులో 2018లో.. పుట్టగొడుగుల వ్యాపారం ప్రారంభించాం. ఇందుకోసం 40 ఎకరాల భూమిని కొన్నాం. ఇక్కడ 300 మంది పని చేస్తున్నారు. అలాగే సన్న, చిన్నకారు రైతుల నుంచి వరి గడ్డిని కొంటుంటాం. ఈ ఏడాది ఐదువేల టన్నుల  గడ్డిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకు ఐదువేలమంది రైతులతో ఒప్పందం చేసుకున్నాం. ఇది ఏటా జరిగే ప్రక్రియే. ఏడాదిలో వీళ్ల నుంచి రెండు సార్లు గడ్డిని కొనుగోలు చేస్తుంటాం. నిజానికి మొదట్లో ఎలా ఉన్నా... కరోనా వేళ ఈ వ్యాపారం ఊపందుకుంది. వైద్యుల సూచన మేరకు చాలామంది శాకాహారులు మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా పుట్టగొడుగులను తినడం ప్రారంభించారు. దీంతో వీటికి డిమాండ్‌ పెరిగింది. గతంలో హోటళ్లు, నగరవాసులకే పరిమితమైన ఈ పుట్టగొడులు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోనూ విరివిగా వాడుతున్నారు. దాంతో మా వ్యాపారం కూడా లాభాలబాట పట్టింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదు వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాం. అన్ని వ్యాపారాల్లోనూ కలిపి ఏడాదికి రూ.40 కోట్ల టర్నోవర్‌ ఉంటుంది. వ్యాపారాల్ని మరింత విస్తరించాలనుకుంటున్నాం. నాకిద్దరు అబ్బాయిలు. వాళ్లూ ఈ పనుల్లో నాకు చేదోడుగా ఉంటారు.

అసలు ఏ ఇబ్బందుల్లేకుండా అంతా సాఫీగా సాగుతోంది అనుకోవడానికి లేదు. కరోనా వేళ వ్యాపారంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. కరోనా పేరుచెప్పి కొందరు ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టారు. మాకూ ఆర్థికంగా నష్టం వచ్చింది. అయినా ధైర్యం కోల్పోకుండా ముందుకు సాగా. వ్యాపారాన్ని ఇంకా విస్తరించాలని ఉన్నా... ఆహారోత్పత్తులు నిల్వ ఉంచడానికి కోల్డ్‌ స్టోరేజీలు అవసరమవుతాయి. అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దానికి ప్రభుత్వ సాయం లేనిదే ముందుకెళ్లలేం.


ఏదైనా సాధించాలనుకుంటే... స్త్రీని, వైకల్యం ఉంది.. బాధ్యతలున్నాయి అనుకుంటాం. కానీ ఇలాంటివి ఎప్పటికీ అవరోధం కాదు. మనకు లక్ష్యం ఉండటం ముఖ్యం. ఆలోచనల్లో స్పష్టత, పట్టుదల ఉంటే కచ్చితంగా దాన్ని చేరుకుంటాం.

- ఎల్లయ్యోల్ల ప్రభాకర్‌, హైదరాబాద్‌

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్