పేగుబంధం లేకపోయినా.. పిల్లలమయ్యాం!

జీవితంలో ఎన్నో బంధాలూ అనుబంధాల్ని పెంచుకున్నారు. కుటుంబ బరువు బాధ్యతల్ని మోశారు. తీరా పిల్లలూ మనవళ్లతో హాయిగా  గడపాల్సిన సమయంలో వాళ్లంతా సుదూరంగా స్థిరపడటంతో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. ఇలాంటి వాళ్లని చాలా దగ్గరగా చూసిన వందనా నాడిగ్‌ నాయర్‌.. వాళ్లకు తోడూనీడగా నిలవాలనుకున్నారు. అందుకోసం ఓ సంస్థని స్థాపించారామె. ఆ సంస్థ ప్రతినిధులు వేలమంది పెద్దలకు ఆప్తమిత్రులుగా ఉంటున్నారిప్పుడు.

Updated : 30 Aug 2022 14:06 IST

జీవితంలో ఎన్నో బంధాలూ అనుబంధాల్ని పెంచుకున్నారు. కుటుంబ బరువు బాధ్యతల్ని మోశారు. తీరా పిల్లలూ మనవళ్లతో హాయిగా  గడపాల్సిన సమయంలో వాళ్లంతా సుదూరంగా స్థిరపడటంతో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. ఇలాంటి వాళ్లని చాలా దగ్గరగా చూసిన వందనా నాడిగ్‌ నాయర్‌.. వాళ్లకు తోడూనీడగా నిలవాలనుకున్నారు. అందుకోసం ఓ సంస్థని స్థాపించారామె. ఆ సంస్థ ప్రతినిధులు వేలమంది పెద్దలకు ఆప్తమిత్రులుగా ఉంటున్నారిప్పుడు. బెంగళూరుకు చెందిన వందనను వసుంధర పలకరించగా తన ప్రయాణం గురించి చెప్పుకొచ్చారిలా...


ఏం తెలియదు, భారమని పెద్దవాళ్లని పక్కన పెడుతుంటాం. కానీ రాబోయే తరాలకు వారే దిక్సూచి. వాళ్లతో కాస్త సమయం గడపండి. నవ్వుతూ మాట్లాడండి. వాళ్లెంత సంబరపడతారో.. వాళ్ల ఆనందంతో మనకెంత సంతృప్తి కలుగుతుందో మీకే అర్థమవుతుంది. మనల్ని చూసి పెద్దలకు గౌరవం, సాయం చేయడం లాంటి విలువలు మన పిల్లలకూ అబ్బుతాయి. ఉత్తమ సమాజానికి బాటలు ఏర్పడతాయి’

చిన్నప్పట్నుంచీ మానసిక ఆరోగ్యంపై ఆసక్తి ఎక్కువ. అందుకే సైకాలజీలో డిగ్రీ, అమెరికాలోని మిషిగన్‌ యూనివర్సిటీ నుంచి ఆర్గనైజేషనల్‌ సైకాలజీలో పీహెచ్‌డీ చేశా. హిందుస్థాన్‌ యూనిలివర్‌ సహా ఎన్నో సంస్థల్లో హెచ్‌ఆర్‌ విభాగాల్లో పనిచేశా. తర్వాత ‘కకూన్‌’ అనే కన్సల్టింగ్‌ సంస్థను ప్రారంభించా. సంస్థల అభివృద్ధిలో అవసరమైన సాయం చేయడం దీని పని. ఆ క్రమంలో సేవా విభాగంలో ఏదైనా చేయాలని ఆలోచించి ఎన్‌జీఓలతో కలిసి పనిచేసే ‘ఫైకస్‌’ అనే సంస్థను మొదలుపెట్టా. నా చిన్నప్పుడు మాది ఉమ్మడి కుటుంబం. పెదనాన్న, పెద్దమ్మ, పిన్ని, బాబాయ్‌, అత్తయ్య, మామయ్య.. అందరి ఆప్యాయతల మధ్య పెరిగా. పెళ్లయ్యాకా అమ్మానాన్నల బాగోగులను నేనే చూసుకుంటున్నా. వాళ్లు మాతోనే కలిసుంటారు. కానీ మా బంధువుల్లో చాలామంది పరిస్థితి అలా కాదు. పిల్లలు విదేశాల్లో స్థిరపడటంతో వయసు మళ్లినవాళ్లు ఒంటరిగానే జీవిస్తున్నారు. దీంతో వాళ్లకేం కావాలో చూసుకుంటూ ఉండేదాన్ని. ఇల్లు, వృత్తి పనులు.. ఒక్కోసారి సమయం ఉండేది కాదు. దీంతో వాళ్ల పనులు కొన్ని ఆలస్యమయ్యేవి. మన అనుకున్న వాళ్లకి కూడా అన్నీ సక్రమంగా చేయలేకపోవడం బాధించింది. ఇలా ఇంకెంత మంది ఉంటారో అన్న ఆలోచన నుంచి వచ్చిందే ‘ఎల్డర్‌ ఎయిడ్‌ వెల్‌నెస్‌’.

వృద్ధులకు సాయపడాలన్న ఆలోచనను స్నేహితుడు సంతోష్‌ అబ్రహంతో చెబితే తనూ చేయికలిపాడు. అలా 2015లో ఈ సంస్థ ప్రారంభమైంది. దీనికోసం ఎనిమిది నెలలు పరిశోధించా. హెల్త్‌కేర్‌ సంస్థలు చాలానే ఉన్నాయి కానీ ప్రత్యేకంగా వృద్ధుల ఆరోగ్యం, రోజువారీ అవసరాలను పట్టించుకునేవి కనిపించలేదు. మేం వాటన్నింటినీ పూర్తిచేయాలనుకున్నాం. సంస్థ ద్వారా పార్ట్‌టైమ్‌, ఫుల్‌టైమ్‌ నర్సింగ్‌, మెడికల్‌ చెకప్‌లకు తోడెళ్లడం, బిల్లులు చెల్లించడం, ప్రయాణాల్లో తోడుండటం, షాపింగ్‌, హాబీ క్లాసులకు తీసుకెళ్లడం, వాళ్లతో సమయం గడపడం ఇలా వాళ్ల ప్రతి అవసరాన్నీ తీరుస్తాం. అందుకు కొంత మొత్తాన్నీ తీసుకుంటాం. బెంగళూరుతోపాటు మైసూరు, చెన్నై, ముంబయి, హైదరాబాద్‌, కోయంబత్తూరు, అహ్మదాబాద్‌, పాలక్కాడ్‌లలోనూ సేవలందిస్తున్నాం. వృద్ధుల కోసం వెల్‌నెస్‌ యాక్టివిటీస్‌నీ నిర్వహిస్తున్నాం. ఇప్పటివరకూ పది వేలమందికి సాయమందించాం.

ఆ ఆశీర్వాదమే...

ఈ వయసులో ఇంకేం చేస్తారనుకుంటాం కానీ వృద్ధులకీ వ్యాపకాలు, కొత్తగా చేయాలన్న తపన.. ఉంటాయి. వాటిని అందుకోవడానికి పిల్లలు దగ్గర లేరన్న భావన అడ్డంకి అవ్వకూడదన్నది నా ఆశయం. సంస్థ ప్రారంభించినపుడు అనేక సవాళ్లు. ఈ తరహా సర్వీసులు మొదటిసారి కావడంతో చాలామంది నమ్మేవారే కాదు. అయినా అధైర్యపడలేదు. ‘మేం కాకపోతే వాళ్లకి ఇంకెవరు సాయం చేస్తార’ంటూ సమాధానపడేవాళ్లం. మరోవైపు ‘ఒకరికి సమస్యగా మారుతున్నాం’ అన్న భావనలో చాలామంది తాము ఇబ్బంది పడ్డా నిమ్మకుండిపోతారు. దీంతో మానసిక సమస్యలూ చుట్టుముడతాయి. ఇవన్నీ పరిశీలించుకుంటూ, దానికి తగ్గట్టుగా అందించే సేవల్లో మార్పులు చేసుకుంటూ వచ్చాం. వీళ్లలో ప్రధాన సమస్య.. బాధ, సంతోషాల్ని పంచుకోవడానికి ఎవరూ లేకపోవడం. అందుకే వాళ్ల ఇష్టాలు తెలుసుకోవడం, చిన్న చిన్న సర్‌ప్రైజ్‌లు, ఆప్యాయంగా మాట్లాడటం వంటివీ చేస్తుంటాం. దీంతో మా ప్రతినిధుల రాక కోసం ఎదురుచూసే వారే ఎక్కువ. ఒకరకంగా పేగు తెంచుకొని పుట్టని పిల్లలమయ్యామన్నమాట. శారీరక సమస్యలవల్ల కొందరిలో ఆత్మన్యూనత ఏర్పడుతుంది. అలాంటివారిని కొత్త వ్యాపకాలు ఎంచుకునేలా ప్రోత్సహిస్తుంటాం. వాళ్లలో ఒంటరి భావన కలగకుండా చూస్తాం. సేవలు పొందుతున్న వారు ‘చల్లగా ఉండండి’ అంటూ దీవిస్తోంటే ఆ ఆశీస్సులే నన్ను మరింత ముందుకు నడిపిస్తున్నాయి. నా విజయంలో కుటుంబానిదీ ప్రధాన పాత్రే. ఇన్ని సంస్థలను ఏకకాలంలో చూసుకోగలుగుతున్నానంటే వాళ్లే కారణం.

- రుత్విక్‌ సండ్ర, బెంగళూరు


ఆహ్వానం

వసుంధర పేజీపై మీ అభిప్రాయాలు, సలహాలు, నిపుణులకు ప్రశ్నలు... ఇలా మాతో ఏది పంచుకోవాలన్నా 9154091911కు వాట్సప్‌, టెలిగ్రాం, సిగ్నల్‌ల ద్వారా పంపవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్