Updated : 19/12/2022 01:51 IST

మళ్లీ మనకి... మిసెస్‌ వరల్డ్‌ కిరీటం!

మిసెస్‌ వరల్డ్‌ కిరీటం మన దేశాన్ని వరించి 21 ఏళ్లైంది. తర్వాత అది అందని ద్రాక్షగానే మిగిలింది. సర్గమ్‌ కౌశల్‌ ఆ నిరీక్షణకు తెరదించింది...

దాదాపు నాలుగు దశాబ్దాల చరిత్ర ‘మిసెస్‌ వరల్డ్‌’ పోటీలది. ఇప్పటివరకూ దేశానికి ఆ కిరీటాన్ని తీసుకొచ్చింది డాక్టర్‌ అదితి గోవిత్రికర్‌ మాత్రమే! అదీ 21 ఏళ్ల క్రితం. ఈ ఏడాది ‘మిసెస్‌ ఇండియా వరల్డ్‌’గా నిలిచిన తర్వాత 32 ఏళ్ల సర్గమ్‌ ‘మిసెస్‌ వరల్డ్‌’ కిరీటాన్ని దేశానికి తేవడమే తన లక్ష్యమంది. అన్నట్టుగానే సాధించిందీ జమ్మూ అమ్మాయి. భర్త ఆది కౌశల్‌ భారత నౌకాదళ అధికారి. ఆయన వృత్తిరీత్యా విశాఖపట్నంలో ఉంటున్నారు. ఇంగ్లిష్‌ లిటరేచర్‌లో పీజీ పూర్తి చేసిన ఈమె టీచర్‌గానూ పనిచేసింది. క్యాన్సర్‌ బాధిత పిల్లల కోసం సేవా సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ఈమెకు అందాల పోటీలపై ఆసక్తి ఎక్కువ. పెళ్లయ్యాక ప్రయత్నించే స్వేచ్ఛ కలిగింది. అలా ఈ ఏడాది ప్రారంభంలో మిసెస్‌ ఇండియా వరల్డ్‌ గెలిచి ప్రపంచ వేదికపై పోటీ పడే అర్హత సాధించింది. అమెరికాలోని వెస్ట్‌గేట్‌ లాస్‌ వెగాస్‌ రిసార్ట్‌- కాసినోలో పోటీ. 63 దేశాలకు చెందిన సౌందర్యరాశులు పాల్గొంటే.. వారందరినీ వెనక్కి నెట్టి మన సర్గమ్‌ కిరీటాన్ని దక్కించుకుంది. పాలినేసియా, కెనడా దేశాల భామలు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ‘ఏళ్ల నిరీక్షణ తర్వాత కిరీటం దక్కించుకున్నాం. చాలా ఆనందంగా ఉంది’ అని తన సంబరాన్ని వ్యక్తం చేస్తోంది. గర్వించదగ్గ విషయమే మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని