చీర సంప్రదాయం.. ఈతరానికి అందివ్వాలని..

‘అమ్మ పెళ్లినాటిది’, ‘ఇది తమ్ముడు మొదటి జీతంతో కొన్నది’.. అలమరా తెరవాలే కానీ.. ప్రతిచీరతో మనకు ఏదోక జ్ఞాపకం ముడిపడి ఉంటుంది. భారతీయ సంప్రదాయానికీ ప్రతీక. అలాంటిదాన్ని ‘అసౌకర్యం’ పేరుతో ఈతరం పక్కన పెట్టడాన్ని తట్టుకోలేక పోయారామె.

Updated : 10 Jun 2023 03:43 IST

‘అమ్మ పెళ్లినాటిది’, ‘ఇది తమ్ముడు మొదటి జీతంతో కొన్నది’.. అలమరా తెరవాలే కానీ.. ప్రతిచీరతో మనకు ఏదోక జ్ఞాపకం ముడిపడి ఉంటుంది. భారతీయ సంప్రదాయానికీ ప్రతీక. అలాంటిదాన్ని ‘అసౌకర్యం’ పేరుతో ఈతరం పక్కన పెట్టడాన్ని తట్టుకోలేక పోయారామె. తన ‘చీరస్మరణీయం’ ద్వారా వాళ్ల మార్గంలోనే వెళ్లి దాని గొప్పదనాన్ని చాటుతున్నారు గొట్టాపు దుర్గప్రియ. ఆవిడని వసుంధర పలకరించింది.

కప్పుడు ఇంటి పని, బరువులు మోయడం, పొలం పని.. దేన్నైనా చీరలోనే చేసేవారు. ఇప్పుడు పండగలప్పుడు కాసేపు కట్టుకోమన్నా ‘అమ్మో.. మావల్ల కాదు’ అనేవారే ఎక్కువ. చుడీదార్‌, లెహెంగాలు సంప్రదాయ దుస్తులేగా అంటారు. మన తెలుగు సంప్రదాయమే చీర కదా! ‘కంఫర్ట్‌ లేద’ని చెప్పి పక్కన పడేస్తే దాన్ని ముందుకెవరు తీసుకెళతారు అనిపించింది. అందుకే 2020 అక్టోబరులో ఫేస్‌బుక్‌లో ‘చీరస్మరణీయం’ ప్రారంభించా. మాది విజయవాడైనా పెరిగిందంతా చెన్నై. అక్కడ స్థిరపడి తెలుగుకు దూరమయ్యానన్న భావనతో నాన్న మమ్మల్ని పట్టుపట్టి తెలుగు చదివించారు. భాష, సంప్రదాయాలను మర్చిపోకూడదనే వారాయన. చెప్పులు వదిలేసినట్లు ఇతర భాషలనూ గుమ్మం బయటే వదిలి రావాలనే వారు. ఆయన ప్రభావంతోనే తెలుగు సాహిత్యంలో బీఏ చేశా. మావారు కెమికల్‌ ఇంజినీర్‌. ఆయన ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లాం. మలేసియా తెలుగు సంఘంలో టీచర్‌గా చేశా. విదేశాల్లో ఉన్న తెలుగు వారికీ, ఇతరులకీ 16 ఏళ్లుగా తెలుగు బోధిస్తున్నా. నా విద్యార్థులు 3 వేలకు పైనే!

ఆలోచన అలా..

విదేశాల్లో ఉన్నా.. ఏ కార్యక్రమమైనా నా ఎంపిక చీరే! ఓసారి ఫేస్‌బుక్‌లో ఉత్తర భారతదేశానికి చెందిన చీర గ్రూపు చూశా. అందులో సంప్రదాయం కంటే గ్లామర్‌కే ప్రాధాన్యం. చీరను ప్రేమించే నాకు ఊపిరాడలేదక్కడ. వెంటనే బయటకు వచ్చేశా. కానీ నా మనసూరుకోలేదు. మనకో గ్రూపుంటే బాగుండునని కారులో వస్తూ ‘చీరస్మరణీయం’ ప్రారంభించా. నా ఆలోచన చెప్పినప్పుడు చీరకి గ్రూపేంటి అనడిగిందో అమ్మాయి. ఆడవాళ్లకి చీరంటే ఓ జ్ఞాపకం. అలమర తెరిస్తే చాలు.. ‘తొలిసారి కట్టిన చీర, అమ్మ జ్ఞాపకం, ఫలానా వారు పెట్టా’రంటూ చెప్పుకొస్తారు. కొన్నాళ్లకు అది చిరిగి పోయినా ఫొటో దాన్ని గుర్తుకు తెస్తుందిగా అన్నా. అప్పుడామ్మాయే ఆలోచన భలేగుంది అంది. ఆనందంగా స్నేహితులందరినీ ఆహ్వానించా. తెలుగులో పోస్టు, ఫొటోతోపాటు చీర ప్రత్యేకతను చెప్పమనేదాన్ని. ఒక్కొక్కరుగా ఎందరో చేరారు. వీరిలో పెద్ద పెద్ద ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, రచయిత్రులు, గాయనులూ ఇలా ఎందరో. వెయ్యి మంది అయ్యాక సాయం కోసం గ్రూపులో యాక్టివ్‌గా ఉండే నీలు, వనితలను అడ్మిన్లుగా చేర్చుకున్నా.

అదో కుటుంబం..

వారానికి రెండు థీమ్‌లు ఇస్తాం. వేసవిలో పచ్చడి పడుతూ ఫొటోకి తయారీనీ జోడించమన్నాం.

నువ్వు ఆవకాయ, నీరావకాయ, మెంతి ఆవకాయ, మాగాయ అంటూ ఎన్నిరకాలు పోస్ట్‌ చేశారో! ఓల్డెన్‌ శారీ-గోల్డెన్‌ శారీ పేరుతో ఒకే చీరని కొన్నేళ్ల
క్రితం, ఇప్పుడు కట్టుకొని దిగిన ఫొటోలను పంచుకోమన్నాం. నేను మా బాబు బారసాల రోజుది 28 ఏళ్ల తర్వాత కట్టుకుని పెట్టా. ఒకావిడ 39 ఏళ్ల నాటి చీర.. ఆవిడని పెళ్లికూతురిని చేసినప్పటిది... ఇలా ఒక్కొక్కరూ జ్ఞాపకాలను పంచుకున్నారు. కొందరు ఫొటోతో  పాటు కవితలు రాస్తుంటారు. ఇంకొకరు తిరుపతి విశేషాలు చెబుతుంటారు. పుస్తకాలు, మంచి కథనాలు.. 70, 80 ఏళ్లనాటి చీరలు.. విలస, పుట్టపాక, బొబ్బిలి కాటన్‌, పొందూరు, బండారు లంక.. అంటూ నేత ప్రత్యేకతలెన్నో పంచుకుంటూ ఉంటారు. మా గ్రూపులో దాదాపు 3 వేల మందున్నారు. మూడేళ్లలో ఒక్కసారీ ఇబ్బంది ఎదురవలేదు. ఓసారి నా ఆరోగ్యం
బాగోకపోతే గ్రూపువాళ్లు ఎక్కడెక్కడి నుంచో చూడటానికి వచ్చారు. అది చూసి మా ఇంట్లో ఆశ్చర్యపోయారు. అందుకే చీరస్మరణీయాన్నీ కుటుంబమని చెబుతుంటా. చీరకట్టుకునే సందర్భాన్ని, ఆసక్తిని కలగజేయడమే మా గ్రూపు ఉద్దేశం. అలాగైనా తర్వాతి తరాలు దీన్ని కొనసాగించేలా చేయొచ్చన్న కోరిక.

కొన్ని రాష్ట్రాల్లో 10 వేల మంది చీరలో మారథాన్‌ చేశారు. బైకు ప్రయాణాలు, డ్యాన్స్‌, వ్యాయామం వంటి ప్రయోగాలూ జరుగుతున్నాయి. అలా మన దగ్గరా చేయాలనుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్