దేశంలోనే మొదటి బధిర న్యాయవాదిగా!

కేరళకు చెందిన సన్నీ, బెట్టీ దంపతులకు ముగ్గురు సంతానం. ఓ కొడుకు, కవలలైన కూతుళ్లు. ముగ్గురూ బధిరులే. అయితే ఆ అమ్మానాన్నలు కుంగిపోలేదు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథాలను నింపి తమ కాళ్లపై తాము నిలబడేలా చేశారు.

Published : 07 Oct 2021 14:45 IST

కేరళకు చెందిన సన్నీ, బెట్టీ దంపతులకు ముగ్గురు సంతానం. ఓ కొడుకు, కవలలైన కూతుళ్లు. ముగ్గురూ బధిరులే. అయితే ఆ అమ్మానాన్నలు కుంగిపోలేదు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథాలను నింపి తమ కాళ్లపై తాము నిలబడేలా చేశారు. కవలల్లో ఒకరైన సారా దేశంలోనే మొదటి బధిర న్యాయవాదిగా రికార్డులకెక్కింది.

సన్నీ దంపతులకు ప్రతీక్‌ పుట్టిన ఎనిమిదేళ్లకు సారా, మేరీ పుట్టారు. ఈ ఇద్దరూ క్లూనీ కాన్వెంట్‌ స్కూల్‌లో పదో తరగతి వరకు చదివారు. ఆపై బీకాం పూర్తి చేశారు. ఆ తర్వాత మేరీ నాన్నలా చార్టెడ్‌ అకౌంటెన్సీని ఎంచుకోగా, సారా లా చదవాలనుకుంది. ‘వినికిడి లోపం ఉన్న మాలో అమ్మానాన్న సానుకూల ద]ృక్పథాన్ని పెంపొందించారు. ఈ క్రమంలో సమాజ పరంగా ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్నారు. సాధారణ బడిలోనే మమ్మల్నీ చదివించారు. మా అభిరుచులకు తగ్గట్లుగా ఉన్నత విద్యను అందించి మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. చిత్రలేఖనం, డ్యాన్స్‌ ఇలా మాకు నచ్చిన అంశాల్లో తర్ఫీదునిప్పించారు. పాల్గొన్న ప్రతి పోటీలోనూ బహుమతి మాకే వచ్చేది’ అని వివరించింది సారా.

సారా న్యాయశాస్త్రాన్ని ఎంచుకోవడానికి ఆసక్తి మాత్రమే కారణం కాదు... తనలాంటి బధిరులెందరికో ఆదర్శంగా, అండగా నిలవాలనుకుంది. కాన్‌స్టిట్యూషనల్‌ లా, డిసెబిలిటీ లా, హ్యూమన్‌ రైట్స్‌ లా ... ఇలా అన్నింటిపైనా పట్టు సాధించి దివ్యాంగుల కేసులను వాదించాలనుకుంది. తనను చూసి మరికొంతమంది స్ఫూర్తి పొంది ఈ రంగంలోకి అడుగు పెడతారన్నది తన ఆలోచన. తను అవతలి వారి మాటలను తెలుసుకునేందుకు ఇంటర్‌ప్రెటర్‌ పరికరం సాయం తీసుకుంటుంది.

ఇ‘లా’ చదువుకుంది..

సెయింట్‌ జోసెఫ్‌ ఇన్‌స్టిట్యూషన్‌ లా కాలేజీలో సారా మొదటి బ్యాచ్‌ స్టూడెంట్‌. కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకుంది. తర్వాత కర్ణాటక బార్‌ కౌన్సిల్‌లో పేరును నమోదు చేయించుకుంది. ‘సెంటర్‌ ఫర్‌ లా అండ్‌ పాలసీ రిసెర్చ్‌’లో భాగంగా కాన్‌స్టిట్యూషనల్‌ లా అండ్‌ డిసేబిలిటీ లాలో పరిశోధన చేస్తోంది. దిల్లీకి చెందిన ‘నేషనల్‌ హ్యూమన్‌ లా నెట్‌వర్క్‌’ బెంగళూరులో ఏర్పాటు చేసిన సదస్సుకు ఆమెను ఆహ్వానించడమే కాకుండా తన ప్రతిభ చూసి సభ్యురాలిగా కూడా చేర్చుకుంది. సారా ‘యాక్సెస్‌ మంత్రాస్‌ డెఫ్‌ విమెన్‌ అచీవర్స్‌ ప్రోగ్రామ్‌’ నుంచీ ఆహ్వానం అందుకుంది. జాతీయస్థాయిలో ఆహ్వానం అందుకున్న ముగ్గురు మహిళల్లో ఈమె ఒకరు. విద్యారంగంలో విజయం సాధించిన మహిళగా సారా ఎన్నికైంది. ఆన్‌లైన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల మంది ప్రముఖులు పాల్గొన్నారు. సారా సోదరుడు టెక్సాస్‌లో ఐటీ సంస్థలో ఉన్నతోద్యోగి. సోదరి ఫ్రెంచ్‌ ఆడిట్‌ సంస్థలో పనిచేస్తోంది.
‘చాలామంది తల్లిదండ్రులు దివ్యాంగులైన పిల్లలను ఉన్నత చదువులు చదివించేందుకు ఆసక్తి చూపించరు. ప్రాథమిక విద్య ముగిశాక ఏదో ఒక ఒకేషనల్‌ కోర్సులో చేర్పిస్తారు. చిన్నారుల సామర్థ్యాలను తక్కువగా అంచనా వేయొద్దు. ఇకనుంచైనా అలాంటి పిల్లలున్న వారు తమ ఆలోచనలను మార్చుకోవాలి. నైపుణ్యాలున్న దివ్యాంగుల కోసం విదేశాల్లోనూ బోలెడు అవకాశాలు ఎదురు చూస్తున్నాయి’ అని చెబుతోంది సారా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్