అందుకే ఇనుప పాత్రల్లో వండితే మంచిదట!

సంతాన లేమి, తరచూ గర్భస్రావాలు, థైరాయిడ్‌, పీసీఓఎస్‌, హార్మోన్ల అసమతుల్యత.. ఇలా చెప్పుకుంటూ పోతే మహిళల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే సమస్యలకు లెక్క లేదు. గత కొన్నేళ్లుగా ఇలాంటి ప్రత్యుత్పత్తి సమస్యలతో బాధపడే....

Published : 08 Jun 2023 12:33 IST

సంతాన లేమి, తరచూ గర్భస్రావాలు, థైరాయిడ్‌, పీసీఓఎస్‌, హార్మోన్ల అసమతుల్యత.. ఇలా చెప్పుకుంటూ పోతే మహిళల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే సమస్యలకు లెక్క లేదు. గత కొన్నేళ్లుగా ఇలాంటి ప్రత్యుత్పత్తి సమస్యలతో బాధపడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే వీటన్నింటికీ మూల కారణం రక్తహీనతే అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇలాంటి అనారోగ్యాలు మహిళల్ని అటు శారీరకంగానే కాదు.. ఇటు మానసికంగానూ కుంగదీస్తున్నాయంటున్నారు. మరి, దీనికి పరిష్కారం లేదా అంటే.. ‘ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌’ సిద్ధాంతాన్ని పాటిస్తూ పూర్వకాలపు పాకశాస్త్ర పద్ధతుల్ని అలవర్చుకోవడమే దీనికి అత్యుత్తమ మార్గమని సూచిస్తున్నారు.

మారుతున్న కాలాన్ని బట్టి ప్రతి విషయంలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వంట చేసే విధానంలోనూ ఎన్నెన్నో మార్పులొచ్చాయి. మట్టి పాత్రలు, ఇనుముతో తయారుచేసిన పాత్రలు కొన్నాళ్లు కనుమరుగైనా.. మళ్లీ ఇప్పుడు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల పలు రకాల ప్రయోజనాలూ ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఎదుర్కొనే రక్తహీనత సమస్యకు ఇనుప పాత్రల్లో వండుకోవడమే అత్యుత్తమమైన మార్గమని చెబుతున్నారు నిపుణులు.

ఈ సమస్యలన్నీ అందుకే!

‘శారీరక అలసట, నీరసం, మానసిక కుంగుబాటు.. ఇలాంటి లక్షణాలు ఈ మధ్యకాలంలో చాలామందిలో కనిపిస్తున్నాయి. ఇక చిన్నారుల్లో పదేళ్లు నిండక ముందే జుట్టు నెరిసిపోవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు సంతాన లేమి, తరచూ గర్భస్రావాలు, థైరాయిడ్‌, పీసీఓఎస్‌, హార్మోన్ల సమస్యలు.. వంటివన్నీ మహిళలకు పెనుశాపాలుగా మారుతున్నాయి. మరి, ఇవన్నీ ఎందుకు తలెత్తుతున్నాయో తెలుసా? వీటన్నింటికీ మూలకారణమేంటో ఎప్పుడైనా ఆలోచించారా? ఇలాంటి సమస్యలన్నింటి వెనుకా ఒకే ఒక్క కారణం ఉంది.. అదేంటంటే.. సూక్ష్మ పోషకాల లోపం.. అందులోనూ శరీరానికి తగినంత ఐరన్‌ లభించక రక్తహీనత తలెత్తడం వల్లే ఈ అనారోగ్యాలన్నీ చుట్టుముడుతున్నాయి. మన శరీరంలో హెమోగ్లోబిన్‌ తగినంత ఉంటే ఎంతో యాక్టివ్‌గా ఉంటాం.. శరీరంలోని ప్రతి అవయవానికీ ఆక్సిజన్‌ని సరఫరా చేస్తూ.. శరీరాన్ని-మెదడును సమన్వయపరచడంలో హెమోగ్లోబిన్‌ పాత్ర కీలకం. ఇది లోపిస్తే మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.

అదొక్కటే పరిష్కారం!

మరి, వీటన్నింటికీ తగిన పరిష్కారం మన వంటింట్లోనే ఉంది. అదేంటంటే.. వంట చేసే క్రమంలో ఇనుముతో తయారుచేసిన పాత్రల్ని ఉపయోగించడమే! ఇలా ఐరన్‌ పాత్రల్లో తయారుచేసే పదార్థాలతో పాటు మనం తీసుకునే ఆహారంలో ఐరన్‌ అధికంగా ఉండే వాటికి ప్రాధాన్యమిస్తే శారీరకంగా, మానసికంగా, సౌందర్యపరంగా ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి. మరీ ముఖ్యంగా పొట్ట సంబంధిత సమస్యలు, స్లీప్ అప్నియా (నిద్ర పోతున్నప్పుడు శ్వాస ప్రక్రియలో సమస్యలేర్పడడం), ఐవీఎఫ్‌-కీమోథెరపీ చికిత్సలు తీసుకుంటున్న వారికి ఈ పాకశాస్త్ర పద్ధతి చక్కగా ఉపయోగపడుతుంది.

ఇక్కడ మరో విషయం ఏంటంటే.. రక్తహీనత ఉన్న వారిలో తీపి తినాలన్న కోరిక పెరుగుతుంది.. తద్వారా స్వీట్స్‌ ఎక్కువగా తిని బరువు పెరిగే అవకాశాలూ లేకపోలేదు. అలాంటప్పుడు ఇనుప పాత్రల్లో వండిన వంటకాలు తినడం వల్ల శరీరంలో హెమోగ్లోబిన్‌ పెరిగి స్వీట్‌ క్రేవింగ్స్‌ తగ్గుముఖం పడతాయి. అయితే ఇక్కడ వంట కోసం ఉపయోగించే ఐరన్‌ పాత్రలు మరీ పెద్దవి, మరీ చిన్నవి కాకుండా చూసుకోవడం ముఖ్యం. అలాగే ఎక్కువసేపు అధిక మంటపై ఉడికించడం వల్ల అందులోని సూక్ష్మ పోషకాలు నశిస్తాయి కాబట్టి.. తక్కువ మంటపై వండుకోవడం మంచిది.

ఎలా మెయింటెయిన్‌ చేయాలి?

ఇనుప పాత్రల్ని వాడకం పూర్తయ్యాక శుభ్రంగా కడిగి, పొడిగా ఆరబెట్టాలి. తడిదనం లేని, గాలి తగలని ప్రదేశంలో వాటిని భద్రపరచాల్సి ఉంటుంది. లేదంటే అవి త్వరగా తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. అలా జరగకుండా.. భద్రపరిచే ముందు వాటి ఉపరితలంపై కాస్త నూనె రాసి పేపర్‌లో లేదంటే మక్మల్ వస్త్రంలో చుడితే సరిపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్