close
Updated : 22/07/2021 20:30 IST

చివరకు అలా అంతరిక్షంలోకి వెళ్లొచ్చింది! 

Photo: Twitter

నేలపై నుంచి నింగిని అందరూ చూడగలరు... కానీ ఆమె మాత్రం చిన్నప్పటి నుంచే ఆకాశం నుంచి అవనిని చూడాలనుకుంది.. అంతరిక్షంలోకి అడుగు పెట్టాలనుకుంది.. అందుకోసం ఎడతెగని ప్రయత్నాలు చేసింది. అయితే అంతరిక్షం మాత్రం అందని ద్రాక్షలా మిగిలిపోయింది.. అలాగని ఆమె తన ఆశలను వదులుకోలేదు. చివరకు ఎనిమిది పదుల వయసులో అంతరిక్షంలోకి వెళ్లి తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఆమే టెక్సాస్‌కు చెందిన వేలీ ఫంక్.

అత్యంత పెద్ద వయసులో!

అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్ చేపట్టిన అంతరిక్ష యాత్ర విజయవంతంగా పూర్తైంది. ఆయనతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు ‘న్యూ షెపర్డ్‌’ నౌక ద్వారా అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి భూమిని చేరుకున్నారు. బెజోస్‌కే చెందిన ‘బ్లూ ఆరిజిన్‌’ సంస్థ చేపట్టిన ఈ ప్రయోగంలో 82 ఏళ్ల మహిళా పైలట్‌ వేలీ ఫంక్‌ కూడా ఉన్నారు. తద్వారా అంతరిక్షంలోకి అడుగుపెట్టిన అతిపెద్ద వయస్కురాలిగా రికార్డు పుటల్లోకి ఎక్కారు. ఈ సందర్భంగా ఆమె గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం రండి.

చిన్ననాటి స్వప్నం!

1939 ఫిబ్రవరి 1న న్యూ మెక్సికోలోని టావోస్‌ నగరంలో పుట్టింది ఫంక్‌. నింగిలో ఎగురుతున్న విమానాలను చూసి తాను కూడా ఆకాశంలోకి వెళ్లాలనుకుంది. అందుకోసం చిన్నప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టింది. విద్యాభ్యాసంలో భాగంగా స్టీఫెన్స్‌ కాలేజ్ ఏవియేషన్‌లో చేరి గ్రాడ్యుయేషన్‌ పట్టాతో పాటు పైలట్‌ లైసెన్స్‌ను అందుకుంది. 20 ఏళ్ల వయసులోనే ప్రొఫెషనల్‌ పైలట్‌గా మారింది. యూఎస్‌ మిలిటరీ బేస్‌లో ఫ్లైట్‌ ఇన్స్ట్రక్టర్‌గా విధులు నిర్వర్తించిన మొదటి మహిళ కూడా ఆమే కావడం విశేషం. అమెరికాలోని ఫెడరేషన్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (FAA) లో కోర్సు పూర్తి చేసి ఫ్లైట్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. FAA చరిత్రలో ఒక మహిళ ఫ్లైట్‌ ఇన్‌స్పెక్టర్‌ కావడం అదే మొదటిసారి. అదేవిధంగా నేషనల్‌ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బోర్డు (NTSB)లో ఎయిర్‌ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన తొలి మహిళ కూడా ఆమే కావడం విశేషం.

అలా ఆశలు ఆవిరయ్యాయి!

1961లో ‘మెర్క్యురీ 13’ పేరుతో ఓ ప్రైవేట్‌ స్పేస్‌ ప్రాజెక్టును చేపట్టింది నాసా. ఇందులో భాగంగా మొత్తం 25 మంది మహిళలను ఎంపిక చేసింది. అంతరిక్ష యాత్రకు సంబంధించి వారికి కఠిన శిక్షణ అందించింది. శిక్షణలో భాగంగా Sensory deprivation tank (ఉప్పు నీటితో నిండిన ఐసోలేషన్‌ ట్యాంక్‌)లో ఏకబిగిన 10 గంటల 35 నిమిషాల పాటు గడిపింది ఫంక్‌. అది కూడా కాళ్లు చేతులు కదపకుండా. ఇది కూడా ఒక రికార్డు. చివరకు 13 మంది మహిళలు మాత్రమే శిక్షణ పూర్తి చేసుకున్నారు. అందులో 22 ఏళ్ల ఫంక్‌ కూడా ఉంది. ఆ టీంలో ఆమే అతి పిన్న వయస్కురాలు కావడం విశేషం. ‘మెర్క్యురీ 13’ ప్రాజెక్టుతో తన చిన్ననాటి కల నెరవేరే సమయమొచ్చిందని ఎంతో సంబరపడిపోయింది ఫంక్. అయితే చివరికి ఆడవాళ్లను అంతరిక్షంలోకి పంపలేమంటూ నాసా ఈ ప్రాజెక్టును పక్కనపెట్టేసింది. దీంతో ఫంక్‌ ఆశలు ఆడియాశలయ్యాయి.

ఇంజినీరింగ్‌ డిగ్రీ లేదంటూ!

‘హై స్పీడ్‌ జెట్‌ టెస్ట్ పైలట్లు, ఇంజినీరింగ్ డిగ్రీలు ఉన్న వారిని మాత్రమే అంతరిక్ష కార్యకలాపాలకు అనుమతించాలని నాసా నిర్ణయించింది. దీంతో అంతరిక్షంలోకి అడుగుపెట్టాలన్న నా ఆశలకు అడ్డుకట్ట పడింది. అప్పటికి నాసాలో మిలిటరీ టెస్ట్‌ పైలట్లుగా పురుషులే ఉండేవారు. వారికి మాత్రమే అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం ఉండేది. మహిళలను మిలిటరీ జెట్‌ టెస్ట్‌ పైలట్లుగా అనుమతించేవారు కాదు. ‘మెర్క్యురీ 13’ ప్రాజెక్టు తర్వాత నేను నాసాకు నాలుగుసార్లు వేర్వేరుగా దరఖాస్తు చేశాను. అయితే ఇంజినీరింగ్‌ డిగ్రీ లేనందున నాలుగుసార్లు నన్ను తిరస్కరించారు’ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారీ సూపర్‌ వుమన్.

గౌరవ అతిథిగా!

నాసా నిర్ణయాలతో నిరుత్సాహపడినా ‘అంతరిక్షం’ ఆశలు వదులుకోలేదు ఫంక్. 1984 నాటికి పైలట్‌గా మొత్తం 19,600 గంటల పాటు విమానాలు నడిపిన ఘనత ఆమె సొంతం. అదేవిధంగా 3 వేల మందికి ఈ రంగంలో శిక్షణ కూడా ఇచ్చింది. అయితే నాసా నిర్ణయాలతో అంతరిక్షంలోకి మాత్రం వెళ్లలేకపోయింది. అందుకు నిరుత్సాహపడినా ఆశలు మాత్రం వదులుకోలేదు. అవకాశమొచ్చినప్పుడల్లా అంతరిక్షంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తూనే ఉంది.

ఈ క్రమంలో ఈ నెల ప్రారంభంలో జెఫ్‌ బెజోస్‌ తన స్పేస్‌ టూర్‌ గురించి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా మెర్క్యురీ 13ని గుర్తు చేస్తూ ‘సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. మళ్లీ ఇప్పుడు వేలీ ఫంక్‌కి అవకాశం వచ్చింది. మా గౌరవ అతిథిగా మేం ఆమెను అంతరిక్షంలోకి తీసుకెళుతున్నాం’ అని సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టాడు.

జులై 20న పశ్చిమ టెక్సాస్‌ ఎడారిలోని ఓ మారుమూల ప్రాంతంలో ఉన్న లాంచ్‌ సైట్‌ వన్‌ నుంచి ‘న్యూషెపర్డ్‌’ ఆకాశంలోకి దూసుకెళ్లింది. నలుగురు ప్రయాణికులతో కూడిన ఈ నౌక విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి భూమిని చేరుకుంది. ఈ క్రమంలోనే అంతరిక్షయాత్ర చేపట్టిన అతి పెద్ద వయస్కురాలిగా చరిత్రపుటల్లోకి ఎక్కారు ఫంక్‌. దీంతో పాటు తన చిన్ననాటి స్వప్నాన్ని కూడా సాకారం చేసుకుంది.


Advertisement

మరిన్ని