Dora Jamme: పైసా పైసా కూడబెట్టి..రోడ్డేయించి!

అక్కడి ప్రజలంతా ఇల్లు, పుట్టిన ఊరు వదిలి వలస వెళ్లిపోతున్నారు. గర్భిణులు, వృద్ధులు ఆసుపత్రికి వెళ్లలేక నరకయాతన అనుభవిస్తున్నారు.

Updated : 11 Apr 2023 06:48 IST

అక్కడి ప్రజలంతా ఇల్లు, పుట్టిన ఊరు వదిలి వలస వెళ్లిపోతున్నారు. గర్భిణులు, వృద్ధులు ఆసుపత్రికి వెళ్లలేక నరకయాతన అనుభవిస్తున్నారు. పిల్లలు చదువుకు దూరమైపోతున్నారు.. వీటన్నింటికీ కారణం ఒక్కటే.. రోడ్డు లేకపోవడం! అది వేయించడానికి పూనుకుంది దొర జమ్మే. ఆమె ఏ రాజకీయ నాయకురాలో, ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తో కాదు.. ఓ సామాన్య ఆరోగ్య కార్యకర్త. పైసా పైసా కూడగట్టిన సొమ్ముని వెచ్చిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలిచింది.

ల్లూరి సీతారామరాజు జిల్లా.. జోలాపుట్‌ పంచాయతీలో కొండపై ఉంటుంది తోటగొడిపుట్‌ అనే గిరిజన గ్రామం. అక్కడికి వెళ్లాలంటే మట్టి మార్గమూ లేదు. ఉళ్లోకి వెళ్లాలంటే రాళ్లురప్పలు, ముళ్లు దాటుకుని మూడు కిలోమీటర్లు సన్నని మార్గంలో నడవాలి. తిరుగు ప్రయాణం ఆలస్యమైందో.. చీకటి భయం. అనుకోని ప్రమాదాలు సంభవించినా.. చేతిలో ఎంత బరువు ఉన్నా సరే.. కొండ దిగి, ఎక్కాల్సిందే. ఈ కారణంగానే గ్రామంలోని కుటుంబాలెన్నో వేరే ఊళ్లకి వలస వెళ్లిపోయాయి. అధికారుల వద్ద ఎన్నిసార్లు రోడ్డు విషయం ప్రస్తావించినా పట్టించుకున్న నాథుడే లేడు. ఏళ్లుగా పరిస్థితి మారకపోవడం, ఊళ్లో ఇంకా కొన్ని కుటుంబాలే మిగలడంతో జమ్మే ఆవేదనకు గురైంది. మంచి ఇల్లూ లేదామెకు. ఇంటి కోసమని పైసా పైసా కూడబెడుతూ వచ్చింది. ఆ సొమ్ముతో ఊరి కష్టం తీర్చాలనుకుంది. భర్త సహకారంతో నాలుగేళ్లుగా పోగేసిన రూ.2 లక్షలతో మూడు కిలోమీటర్ల మేర మట్టి రోడ్డు వేయిస్తోంది. ఇప్పటికే దాదాపు రెండు కిలోమీటర్ల మేర పూర్తయింది.


గర్భస్రావమై.. ప్రాణాపాయస్థితిలోకి..

‘మాది అరకు పక్కన గ్రామం. నా చిన్నతనంలోనే నాన్న చనిపోయారు. ఇద్దరు అన్నయ్యల్ని, నన్ను అమ్మే కష్టపడి పెంచింది. 2017లో పెళ్లై తోటగొడిపుట్‌కి కాపురానికొచ్చా. ఇద్దరు అబ్బాయిలు. అందరూ వలస వెళ్లడంతో ఊళ్లో 9 కుటుంబాలే మిగిలాయి. అందరూ అలా వెళ్లిపోతుంటే బాధేసేది. నేను ఆరోగ్య కార్యకర్తని. నెలకు రూ.4 వేలు జీతం. కొన్ని రోజుల క్రితం.. ఓ గర్భిణికి ఆరోగ్యం పాడైంది. డోలీలో ఆసుపత్రికి తీసుకెళ్దామంటే మోయడానికీ మనుషులు లేరు. అందరూ పని కోసమని కొండ దిగారు. ఆ అమ్మాయి పరిస్థితి విషమించి గర్భస్రావమైంది. చనిపోయే పరిస్థితి. కబురు పెడితే ఏఎన్‌ఎమ్‌లు, డాక్టర్‌ పైకొచ్చి చికిత్స చేయడంతో బతికింది. అనారోగ్యమొస్తే ఊళ్లో వృద్ధుల పరిస్థితీ ఇంతే! తాగునీటికీ ఎంతో దూరం వెళ్లి తెచ్చుకోవాలి. అదీ ఇబ్బందే! ఇవన్నీ చూశాక నాకు మాత్రమే ఉపయోగపడే ఇంటికంటే అందరికీ సాయపడే రోడ్డే ముఖ్యమనిపించింది’ అంటోంది జమ్మే.


వాహనాలొస్తాయ్‌!

ఆటో కాదు కదా.. బైకు కూడా వెళ్లలేని రోడ్డు! దీంతో బంధువులూ ఆ ఊరు వచ్చేవారు కాదు. ఇదంతా చూసి జమ్మే కూడా గతంలో గ్రామం విడిచి వెళదామా అనుకుందట. కానీ అందరూ ఇలా ఆలోచిస్తే ఊరే లేకుండా పోతుందని ఆగిపోయానంటుందీమె. ప్రాణాలకే ముప్పు అవుతోంటే మాత్రం చూడలేక తనే రంగంలోకి దిగింది. జేసీబీ వచ్చి పని మొదలు పెట్టేంత వరకూ తన నిర్ణయం ఊరివాళ్లకీ తెలియదు. రోజుకు రూ.16 వేలతోపాటు ఇతర ఖర్చులకూ ఇచ్చేలా జేసీబీ వాళ్లని ఒప్పించింది. ‘రహదారి సౌకర్యం వస్తే మంచినీరు, బోర్లు వంటివి వస్తాయని నమ్మకం. వాహనాలూ, అంబులెన్స్‌ వస్తాయి అనుకున్నా. నా ఆలోచన విని, నలుగురూ సాయానికీ వస్తున్నారు. డబ్బులు దాదాపుగా అయిపోయాయి. వ్యవసాయం చేసైనా రోడ్డు పూర్తి చేస్తా’ అని చెబుతోందామె.

- పొక్కళ్ల కీర్తి, విజయనగరం

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని