pratibha Tiwari: వ్యవసాయంలో ‘ప్రతిభ’...

రసాయనాల్లేని పంట పండించాలనుకున్నారామె. అయితే అప్పటికే భూమి సారవంతాన్ని కోల్పోయి తీవ్ర నష్టాన్నే ఇచ్చింది. రెండో పంటను తెగుళ్లు తినేసినా.. ఆమె మాత్రం తన భగీరథ ప్రయత్నం వీడలేదు.

Published : 21 May 2023 01:22 IST

రసాయనాల్లేని పంట పండించాలనుకున్నారామె. అయితే అప్పటికే భూమి సారవంతాన్ని కోల్పోయి తీవ్ర నష్టాన్నే ఇచ్చింది. రెండో పంటను తెగుళ్లు తినేసినా.. ఆమె మాత్రం తన భగీరథ ప్రయత్నం వీడలేదు. సేంద్రియ ఎరువులనే వినియోగిస్తూ.. చివరకు భూమిని సారవంతం చేయగలిగారు. వేల క్వింటాళ్ల దిగుబడిని పొందుతూ రూ.కోట్లలో లాభాలబాట పట్టారు. వందలాదిమంది రైతులకు సేంద్రియ వ్యవసాయంలో మార్గదర్శకురాలవుతున్నారు ప్రతిభ తివారీ.   

విద్యాబోధన ప్రతిభ కల. బిహార్‌కు చెందిన ఈమె అనుకున్నట్లుగానే పదేళ్లకుపైగా ఉపాధ్యాయురాలిగా కొనసాగారు కూడా. దగ్గర్లోని హర్దాలో భర్తకు 50 ఎకరాల పొలం ఉండేది. ఓసారి కుటుంబంతో వెళ్లినప్పుడు అక్కడి రైతులంతా రసాయనిక ఎరువులను వినియోగించడం చూశారీమె. ఆ పక్కనే విడిగా చిన్నచోటులో కూరగాయలను పెంచుతుంటే సందేహమొచ్చి అడిగారు. రసాయనాలతో పండించేదంతా మార్కెట్‌కు, సేంద్రియ ఎరువులతో విడిగా పండిస్తున్నది తమ కుటుంబాల కోసమన్నారు. 

ఉద్యోగాన్ని వదిలేసి.. ‘అధిక దిగుబడి కోసమే వారంతా రసాయనాలను వినియోగిస్తున్నారని అర్థమైంది. అప్పుడే సేంద్రియ ఎరువులతోనూ అధిక లాభాలు పొందేలా చేస్తే అన్న ఆలోచన వచ్చింది. నా ఆలోచన ఇంట్లో చెబితే.. మావారు ‘ఇద్దరం టీచర్లమే. హర్దాకెలా వెళ్లే’దంటూ ఒప్పుకోలేదు. సేంద్రియ పంట వల్ల ఉపయోగాలు, ఎవరో ఒకరం మార్గం వేస్తేనే కదా.. మరికొందరు అనుసరించేది అని చెప్పి ఒప్పించా. మా పొలంలో వ్యవసాయం చేయడానికి ఉద్యోగాలకు రాజీనామా చేసి, హర్దా చేరుకున్నామం’టారీమె.

మార్చగలిగా.. సేంద్రియ ఎరువులతోనే కొంచెం భాగంలో మొదట గోధుమను పండించే ప్రయత్నం చేశారు ప్రతిభ. దీనికంటే ముందు సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన కోర్సు పూర్తిచేశారు. ప్రభుత్వం నిర్వహించే వర్క్‌షాపు, సదస్సులకు హాజరయ్యేవారు. అలా కొన్ని నెలల తర్వాత వ్యవసాయానికి దిగారు. అప్పటివరకు వేసిన రసాయన ఎరువులతో భూమి అంతా నిండి ఉంటుందని తెలుసామెకు. అతికష్టంపై ఎకరానికి 10 క్వింటాళ్లు మాత్రమే పండింది. రెండో పంటగా పెసలు వేస్తే తెగుళ్లతో మొత్తం నాశనమైంది. ‘రసాయనాలు నిండి ఉన్న భూమి నిస్సారమవుతుంది. పూర్తిగా సేంద్రియ నేలగా మార్చడానికి నాకు మూడేళ్లు పట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రసాయనాల వినియోగంతో సాయిల్‌ ఆర్గానిక్‌ కార్బన్‌(ఎస్‌ఓసీ) శాతం 1 నుంచి 0.3కు పడిపోయిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎంత నష్టమొచ్చినా.. వెనుకడుగు వేయకుండా ఓపిగ్గా ఎదురుచూసి నేను మంచి ఫలితాలందుకున్నా. 2019లో ఆర్గానిక్‌ భూమిగా ప్రభుత్వం నుంచి ధ్రువపత్రాన్ని తీసుకొన్నా. ఆ తర్వాత నుంచి గోధుమ, పప్పు ధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలతోపాటు మునగ, మందార, కలబంద వంటివన్నీ పండించడం మొదలుపెట్టా’నంటారీమె.

రైతుల్లో.. ప్రతిభ సాధిస్తున్న అధికదిగుబడి స్థానిక రైతులనూ ఆకట్టుకుంది. తనను సంప్రదించిన రైతుల కోసం పలురకాల శిక్షణా తరగతులు నిర్వహించారామె. తన కృషితో నేడు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 1400మందికిపైగా వ్యవసాయంలో ఈమెను అనుసరిస్తున్నారు. అంతేకాదు, వీరు పండించే ఉత్పత్తులు మార్కెట్‌లో విక్రయమవడానికి ఫార్మర్స్‌ ప్రొడ్యుసర్స్‌ ఆర్గనైజేషన్స్‌(ఎఫ్‌పీఓ)లతో ప్రతిభ కలిసి పనిచేస్తున్నారు. మార్కెటింగ్‌లో రైతులకు చేయూతనిస్తూ వారిని సేంద్రియ వ్యవసాయంవైపు అడుగులేయిస్తున్నారు. అలాగే మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రకు చెందిన రైతులెందరో ఈమెను సంప్రదిస్తున్నారు. ‘భూమిషా ఆర్గానిక్స్‌’ పేరుతో స్టోర్‌ ప్రారంభించి 70రకాలకు పైగా గోధుమ, బియ్యం, పప్పులు, మసాలా దినుసులు, పిండిలు, చిరుధాన్యాలను విక్రయిస్తున్నారు ప్రతిభ. 2022లో క్రిషికా నేచురల్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ప్రారంభించి చిరుధాన్యాల ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ఇండోనేసియా, ఇంగ్లండ్‌ తదితర దేశాలకు 11రకాలకుపైగా ఈ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నారు. గతేడాది రూ.కోటి రూపాయల టర్నోవర్‌ను పొందారు ప్రతిభ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్