అమ్మ చెప్పింది!

అంబానీల ఇంటి ఆడబిడ్డ.. పిరమాళ్‌ కుటుంబానికి కోడలు... జీవితం పూలపాన్పే కదా అనుకుంటాం. కానీ వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలడానికి కావాల్సిన నాయకత్వ లక్షణాలు వెండి పళ్లెంలో పెట్టి అందిస్తే వచ్చేవి కాదుగా? రిలయన్స్‌ రిటైల్, జియో సహా మరో ఏడు సంస్థలని నడిపిస్తున్న ఈషా అంబానీ పిరమాళ్‌ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు...

Updated : 26 May 2024 08:02 IST

అంబానీల ఇంటి ఆడబిడ్డ.. పిరమాళ్‌ కుటుంబానికి కోడలు... జీవితం పూలపాన్పే కదా అనుకుంటాం. కానీ వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలడానికి కావాల్సిన నాయకత్వ లక్షణాలు వెండి పళ్లెంలో పెట్టి అందిస్తే వచ్చేవి కాదుగా? రిలయన్స్‌ రిటైల్, జియో సహా మరో ఏడు సంస్థలని నడిపిస్తున్న ఈషా అంబానీ పిరమాళ్‌ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు...

కాష్, ఈషా కడుపులో ఉన్నప్పుడు నీతా అంబానీని చూడ్డానికి ముఖేష్‌ అంబానీ అమెరికా వెళ్లారట. ‘పిల్లలకు ఏం పేరు పెడదాం?’ అని నీతా అడిగితే... ‘అబ్బాయి అంబానీ, అమ్మాయి అంబానీ అని పిలవలేంగా ఆలోచిస్తాలే’ అని ఇండియాకి తిరుగుపయనమయ్యారట ముఖేష్‌. ఆయన అలా విమానమెక్కారో లేదో... మీకు కవలలు పుట్టారంటూ విమానంలో అనౌన్స్‌మెంట్‌ చేసి చెప్పారు. ఆ సమయంలో ఆయన పర్వతాలపై ప్రయాణించడంతో పాపకి ఈషా అని పేరు పెట్టారట. ఈషా అంటే ‘పర్వతాలకు దేవత’ అని అర్థం. ఆకాశ ప్రయాణానికి గుర్తుగా ఆకాష్‌ అని అబ్బాయికి పేరు పెట్టారు. ముంబయి నివాసంలో అనంత్, ఆకాష్, అన్షుల్, అన్‌మోల్‌లతో కలిసి పెరిగింది ఈషా. ‘వాళ్ల ఆటల్లోకి నన్ను రానిచ్చేవారు కాదు. ఎందుకు రానివ్వరు? అనే పంతంతో వాళ్ల మధ్యలో ఆడుతూ టామ్‌బాయ్‌లా పెరిగా. ఇక మా అమ్మ... తనని టైగర్‌మామ్‌ అని ముద్దుగా పిలుచుకుంటాం. నేను స్కూల్‌ ఎగ్గొడతా అని అంటే నాన్న ఇదో విషయమా అన్నట్టు తేలిగ్గా చూసేవారు. కానీ అమ్మ అలా కాదు. తినాలి, చదవాలి.. ఆడాలి. దానికో పద్ధతి ఉండాలనేది. అలాగని ఆడపిల్లవి కాబట్టి ఈ పని చేయొద్దు ఇలాగే ఉండాలి అని అనడం ఇంతవరకూ వినలేదు. ‘ఒక మగాడికి ఉద్యోగం వస్తే అతను తన కుటుంబాన్ని బాగా చూసుకుంటాడు. అదే ఇంట్లో ఒక మహిళకు పని దొరికితే ఆ ఊరి తలరాతే మారిపోతుంద’ని అమ్మ అన్న మాటలు నన్ను ఎంతగా ప్రభావితం చేశాయంటే మా సంస్థలో అమ్మాయిలకు కీలక పదవుల్లో ప్రాధాన్యం ఇచ్చేలా చేశాయి’ అంటోంది ఈషా. 

ఉద్యోగం చేసి...

అంబానీల వారసురాలు... వద్దన్నా వారసత్వ పగ్గాలు వస్తాయి అనుకుంటే పొరపాటు. చదువు పూర్తయ్యాక ఈషా సాధారణ ఉద్యోగిలా పనిచేసి అనుభవాన్ని సంపాదించుకుంది. యేల్‌ యూనివర్సిటీలో సైకాలజీ అండ్‌ సౌత్‌ ఏషియన్‌ స్టడీస్‌లో డిగ్రీ, ఆపై స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఎంబీయే చేసింది. ఆ తర్వాత మెకింజీ కంపెనీలో బిజినెస్‌ అనలిస్ట్‌గా పనిచేసింది. ధీరూబాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్లో కొన్నాళ్లు టీచర్‌గానూ పనిచేసింది. ఆ తర్వాత రిలయన్స్‌ రిటైల్‌ సహా అనేక విభాగాల్లో పనిచేసింది. 23 ఏళ్లకే వ్యాపార సామ్రాజ్యంలో అడుగుపెట్టిన ఈషా రిలయన్స్‌ రిటైల్, జియో, రిలయన్స్‌ ఫౌండేషన్, ధీరూబాయ్‌ అంబానీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ సహా మరో ఏడు సంస్థలకు సారథ్యం వహిస్తోంది. అజియో, కాస్మెటెక్స్‌ సంస్థ టిరా బ్యూటీ, కవర్‌స్టోరీ, నెట్‌మెడ్‌ ఫార్మసీ, 7-ఎలివన్, ఫ్రెష్‌పిక్, హమ్లీజ్‌ తను నడుపుతున్న సంస్థల్లో కొన్ని. జియోఫైనాన్స్‌లోనూ ఆమె పాత్ర కీలకం.

మనమూ మారాలి...

అమ్మాయిలకు నాయకత్వ లక్షణాలు లేవు. వాళ్లకు కొన్ని రంగాలే నప్పుతాయి అంటే ఈషా ఒప్పుకోదు. ‘నేను 1991లో పుట్టాను. లిబరలైజేషన్‌ యుగం ప్రారంభమైందీ, ఇండియా కలలు కనడం పెరిగిందీ అప్పుడే కదా! మా అమ్మకూడా మాకోసం ఐదేళ్లు ఇంటిపట్టునే ఉంది. ఆ తర్వాత కుటుంబంతోపాటు సంస్థ బాధ్యతల్నీ తీసుకుంది. అమ్మని చూశాక మహిళల్లోని నాయకత్వ లక్షణాల శక్తి ఏంటో అర్థమైంది. ఆడవాళ్లకు లీడర్‌షిప్‌ ఇవ్వకపోతే ఆ కంపెనీలే నష్టపోతాయనేది నా నమ్మకం. అంతేకాదు, ప్రపంచం వేగంగా మారిపోతోంది. మారే ప్రపంచంతోపాటు మనమూ మారాలి. ఆడవాళ్లకు టీచర్‌ ఉద్యోగాల్లాంటివే బాగుంటాయి అంటే ఆ మాటలు నమ్మొద్దు. అవి పాత నమ్మకాలు. మనమంతా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌ రంగాల్లోకి రావాల్సిందే. 2015లో జియో లాంచ్‌ అయినప్పుడు మొబైల్‌ వాడకంలో ఇండియా ర్యాంక్‌ 155. ఇప్పుడు నెంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. మనల్ని మనం నమ్ముకుంటే ఏదైనా సాధ్యమే’ అంటోంది ఈషా.

పెళ్లయ్యాక... గీతాబోధ!

పుట్టినిల్లూ, మెట్టినిల్లూ రెండూ రెండు వ్యాపార సామ్రాజ్యాలు. అయినా కుటుంబానికీ, వర్క్‌లైఫ్‌కీ మధ్య ఉన్న సన్నని గీతని చక్కగా అనుసరిస్తోంది ఇద్దరు కవలలకు తల్లైన ఈషా. ‘పని పనే. కానీ స్నేహితులు, కుటుంబం వీటికుండే ప్రాధాన్యం వీటిదే. ఈ విషయంలో అమ్మానాన్నలనే అనుసరిస్తున్నా. ఇక షేరింగ్‌ ఈజ్‌ కేరింగ్‌ అంటారు కదా... అందరిలానే అమ్మా, నేను, మరదళ్లు నగల్ని షేర్‌ చేసుకుంటాం. శ్లోకా వదిన అవ్వడానికి ముందు నుంచీ స్నేహితురాలు కూడా. అదిప్పుడూ కొనసాగుతోంది. ఇక మావారు ఆనంద్‌ పిరమాళ్‌కి ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ. నోరు తెరిస్తే భగవద్గీత శ్లోకాలు వినిపిస్తారు. మా ఆకాష్, అనంత్‌తో ఇష్టంగా ఉంటారు. ఇక స్నేహితులు అంటారా? ఇంటికి దూరంగా యూఎస్‌లో ఉన్నప్పుడు... ప్రియాంకచోప్రా నాకు తోడుగా ఉండేది. తనే నా మెంటార్, అక్క, స్నేహితురాలు అన్నీ. ఆలియాభట్‌తో అంతే చనువుగా ఉంటా’ అనే ఈషాకి కార్ల కలెక్షన్‌ అంటే చాలా ఇష్టం. బెంట్లీ ఆర్నేజ్, రోల్స్‌రాయిస్‌ కలినన్, బీఎమ్‌డబ్ల్యూ సెవెన్‌ సిరీస్, మెర్సిడెజ్‌ బెంజ్‌... వంటివి కలెక్షన్లలో కొన్ని.


 భలే నచ్చింది

మా కవల పిల్లలు ఆద్యశక్తి, కృష్ణల కోసం... అమ్మ ఐదడుగుల ఎత్తుండే అందమైన కబోర్డుని కానుకగా ఇచ్చింది. టెడ్డీబేర్‌లు, పిల్లల వస్తువులతో నింపిన ఆ కబోర్డ్‌ నాకు భలే నచ్చింది. వాళ్లు ఆడుకోవడానికి ప్రత్యేకమైన నర్సరీనీ సిద్ధం చేసింది. అమ్మానాన్నలకి ఎంత పనున్నా... మాకు అవసరం అనుకుంటే క్షణాల్లో మా దగ్గర ఉండేవారు. నేనూ నా పిల్లల విషయంలో అదే సూత్రాన్ని అనుసరించాలనుకుంటున్నాను.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్