Dragon Girl: ఆ ఫోన్‌ కాల్‌ నా జీవితాన్నే మార్చేసింది!

‘ఒక్క ఛాన్స్‌’ అంటూ సినిమా స్టూడియోల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే వాళ్లను చూస్తుంటాం. కానీ తాను మాత్రం ఆ శ్రమ లేకుండానే తొలి సినిమా ఛాన్స్‌ కొట్టేశానంటోంది యువ నటి పూజా భలేకర్‌. ఇందుకు కారణం.. తనకున్న మార్షల్‌ ఆర్ట్స్‌ నైపుణ్యాలే! నటన వైపు రావాలని కానీ, వస్తానని....

Updated : 15 Jul 2022 13:03 IST

(Photos: Instagram)

‘ఒక్క ఛాన్స్‌’ అంటూ సినిమా స్టూడియోల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే వాళ్లను చూస్తుంటాం. కానీ తాను మాత్రం ఆ శ్రమ లేకుండానే తొలి సినిమా ఛాన్స్‌ కొట్టేశానంటోంది యువ నటి పూజా భలేకర్‌. ఇందుకు కారణం.. తనకున్న మార్షల్‌ ఆర్ట్స్‌ నైపుణ్యాలే! నటన వైపు రావాలని కానీ, వస్తానని కానీ కలలో కూడా ఊహించలేదంటోన్న ఈ ముద్దుగుమ్మ.. ఏకంగా స్టార్‌ డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ చిత్రంలోనే తొలి అవకాశాన్ని అందుకోవడం విశేషం. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం LADKI (అమ్మాయి). మన దేశంలో తొలి మార్షల్ ఆర్ట్స్ సినిమాగా పేరు పొందింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 వేలకు పైగా థియేటర్లలో విడుదలవుతున్న ఈ సినిమా కోసం ఒకటి కాదు.. రెండు కాదు.. నిరంతరాయంగా పదేళ్ల పాటు శ్రమించింది పూజ. ఆ కష్టమేంటో తన మాటల్లోనే..!

‘నేను పుట్టి పెరిగిందంతా ముంబయిలోనే. చిన్న వయసు నుంచి చదువు కంటే ఆటల పైనే ఎక్కువ దృష్టి పెట్టేదాన్ని. అలాగని మనసు ఒక్క చోట ఉండేది కాదు. ముందు యోగా నేర్చుకున్నా. ఆ తర్వాత అథ్లెటిక్స్ వైపు మనసు మళ్లింది. ఈ క్రమంలో పరుగు, జంపింగ్, హర్డిల్స్‌ సాధన చేశా.

మార్షల్‌ ఆర్ట్స్‌.. నా బలం!

అయితే ఓరోజు కొంతమంది అబ్బాయిలు మార్షల్‌ ఆర్ట్స్‌ (తైక్వాండో) ప్రాక్టీస్‌ చేయడం చూశా. నాకూ దానిపై ఆసక్తి కలిగింది. వెంటనే ఈ విషయం ఇంట్లో చెప్పా. అమ్మానాన్నలు కూడా నా నిర్ణయాన్ని కాదనలేదు. ముఖ్యంగా అమ్మ ఈ విషయంలో నన్నెంతో ప్రోత్సహించింది. అలా నా మార్షల్‌ ఆర్ట్స్ ప్రయాణం ప్రారంభమైంది. అయితే అంతకుముందే యోగా, అథ్లెటిక్స్‌లో నేను పొందిన నైపుణ్యాలు ఇప్పుడు మరింతగా ఉపయోగపడ్డాయి. దీంతో ఈ క్రీడలో పేరు సంపాదించడానికి నాకు పెద్ద సమయం పట్టలేదు. తైక్వాండోలో జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో ఎన్నో పతకాలు కూడా సంపాదించా. ఈ నైపుణ్యాలే అనుకోకుండా నాకు సినిమా అవకాశాన్ని కూడా తెచ్చిపెట్టాయి.

‘లడ్కీ’లో అలా కనిపిస్తా!

నేను నా కాంపిటీషన్స్‌తో బిజీగా ఉన్న రోజులవి. అప్పుడే ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్‌ వర్మ ఫోన్‌ చేసి ఓసారి కలవమన్నారు. వెంటనే నాన్నతో కలిసి ముంబయిలోని ఆయన ఆఫీస్‌కి వెళ్లా. అప్పటికే ఆయన నా గురించి చాలా విషయాలు తెలుసుకున్నారని అక్కడికెళ్లాకే అర్థమైంది. ఆ మీటింగే నా జీవితానికి టర్నింగ్‌ పాయింట్‌ అని చెప్తా. ఎందుకంటే నటన వైపు రావాలని కానీ, వస్తానని కానీ నేను కలలో కూడా ఊహించలేదు. అలాంటిది అనుకోకుండా ఆయన తన చిత్రం ‘LADKI : Enter the Girl Dragon (తెలుగులో అమ్మాయి)’లో అవకాశమిచ్చేసరికి నన్ను నేనే నమ్మలేకపోయా. ఆర్జీవీకి అమెరికన్‌ మార్షల్‌ ఆర్టిస్ట్‌ బ్రూస్‌ లీ అన్నా, ఆయన ఫిలాసఫీ అన్నా చాలా ఇష్టం. ఈ స్ఫూర్తితోనే ‘లడ్కీ’ రూపుదిద్దుకుంది. ఇందులో బ్రూస్ లీని అమితంగా ఆరాధించే పూజా కానిక్‌ అనే అమ్మాయి పాత్రలో కనిపిస్తా. నిజానికి నేను వర్మని కలవడానికి ముందే ఆయన ఆ పాత్రకు ఈ పేరు పెట్టారట. విధి అంటే ఇదేనేమోనని అప్పుడనిపించింది.

పదేళ్ల శ్రమ ఇది!

సినిమాకు ఓకే చేసిన మరుక్షణం నుంచే బ్రూస్‌ లీ ఫైటింగ్‌ స్టైల్‌లో మార్షల్‌ ఆర్ట్స్‌ సాధన చేయడం ప్రారంభించా. నా దృఢమైన శరీరం, పోరాట నైపుణ్యాలకు తోడు నా తపన, పట్టుదల ఈ పాత్రకు నేను పూర్తిగా అంకితమయ్యేలా చేశాయి. నా పదేళ్ల శ్రమకు ఫలితమీ చిత్రం. మార్షల్ ఆర్ట్స్ లో నా నైపుణ్యాల్ని,  నా దేహదారుఢ్యాన్ని తొలిసారి వెండితెరపై ప్రదర్శించే అవకాశం ఈ సినిమా నాకు అందించింది. మనలోని బలాబలాలపై విశ్వాసముంచి స్వీయ నమ్మకంతో ముందుకు సాగడమే అసలైన సాధికారత అని నమ్మే వ్యక్తిని నేను. పని ప్రదేశంలో సమాన అవకాశాలు దక్కించుకోవడమే కాదు.. మనల్ని మనం ప్రేమతో స్వీకరించినప్పుడే అన్నింటా విజయం సాధించగలం. ఈ జర్నీలో నేను నేర్చుకున్న గొప్ప విషయం ఇదే. ఇక అమ్మాయిలకి కూడా మార్షల్ ఆర్ట్స్ చాలా అవసరం. ఈ సినిమాతో కొంతమందికైనా అవగాహన కలిగి నేర్చుకుంటారని ఆశిస్తున్నా.. ఇక పైనా సినిమాల్లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నా. ట్రైలర్‌ విడుదలైన వెంటనే కొంతమంది కొత్త కథలతో నన్ను సంప్రదించారు. ఇది నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్