అందుకే యశోద తనయుడు అందరికీ ఆదర్శం!

చిన్నతనంలో వెన్న దొంగిలించినా.. గోపాలురందరినీ రక్షించాడు. ద్రౌపదికి చీరలిచ్చి ఆమె ఆత్మగౌరవాన్ని కాపాడాడు. అయితే ఆ లీలాకృష్ణుడి లీలలను గమనిస్తే ఆయన చేసిన పనుల్లో ఓ నిగూఢార్థం కనిపిస్తుంది. కన్నయ్యగా వన్నెచిన్నెలతో ఆకట్టుకునే వయసు....

Updated : 19 Aug 2022 16:59 IST

చిన్నతనంలో వెన్న దొంగిలించినా.. గోపాలురందరినీ రక్షించాడు. ద్రౌపదికి చీరలిచ్చి ఆమె ఆత్మగౌరవాన్ని కాపాడాడు. అయితే ఆ లీలాకృష్ణుడి లీలలను గమనిస్తే ఆయన చేసిన పనుల్లో ఓ నిగూఢార్థం కనిపిస్తుంది. కన్నయ్యగా వన్నెచిన్నెలతో ఆకట్టుకునే వయసు నుంచే ఆయన ఎన్నో అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. తన జీవితం ద్వారా ఎంతోమందికి ఎన్నో పాఠాలను నేర్పాడు. అవి అప్పటి కాలానికే కాదు.. కాలమాన స్థితిగతులు పూర్తిగా మారిపోయినా ఇప్పటికీ మన జీవితాలకు వర్తింపజేసుకోవడానికి వీలున్నవే..! మరి, చిన్నికృష్ణుడి జీవితం నుంచి మనం నేర్చుకోదగిన కొన్ని పాఠాలేంటో మనమూ తెలుసుకుందాం రండి...

ఆసక్తులను వదలొద్దు..

చిన్నతనం నుంచే కన్నయ్యకు వేణువంటే ఎంతో ఇష్టం. గోవులను కాస్తూ.. దొరికిన సమయాన్నంతా వేణువు వూదుతూనే గడిపేవాడు. దాన్ని వినేందుకు ఆయన స్నేహితులు కూడా ఎంతో ఇష్టపడేవారు. ఈ ఇష్టాన్ని జీవితాంతం కొనసాగించాడు కృష్ణుడు.. పెద్దయిన తర్వాత కూడా ఈ ఆసక్తిని తగ్గనివ్వలేదు. రాజ్యపాలన, ఇతర బాధ్యతలతో తలమునకలై ఉన్నా సరే.. ఎప్పుడూ తన వేణుగానాన్ని పక్కన పెట్టలేదు. అంతెందుకు.. కురుక్షేత్ర యుద్ధంలో రథసారథిగా కొనసాగుతున్న సమయంలోనూ మురళిని తనతో పాటే ఉంచుకున్నాడు. దీన్నిబట్టే ఆయనకు దానిపై ఉన్న ఆసక్తి ఎంతో తెలుస్తుంది. ఆసక్తులు ప్రతి ఒక్కరికీ ఉంటాయి. కానీ ఉరుకుల పరుగుల జీవితంలో సమయాభావ కారణంగా వాటిని పక్కన పెట్టేస్తూ ఉంటాం. అందుకే మన ఆసక్తులను ఎప్పటికీ పక్కన పెట్టొద్దనే పాఠాన్ని కృష్ణుడి జీవితం నుంచి నేర్చుకుందాం.. ఎందుకంటే వాటివల్ల జీవితంలో ఒత్తిడి కూడా తగ్గుతుంది..

నిజమైన స్నేహితుడిగా..

చిన్ననాటి స్నేహితులు, వారితో చేసిన అల్లరి ఇవన్నీ గుర్తొస్తే ఎవరికైనా కళ్లలో నీళ్లు తిరగకమానవు. అయితే బిజీ జీవితంలో ఇంట్లోవాళ్లతోనే మాట్లాడేందుకు సమయం ఉండదు. ఇక స్నేహితులతో సంబంధబాంధవ్యాలను కొనసాగించే వారిని వేళ్లపై లెక్కించవచ్చు. కానీ కృష్ణుడి జీవితాన్ని గమనిస్తే ఆయన స్నేహితులను కుటుంబంతో సమానంగా ప్రేమించాడు. చిన్ననాటి స్నేహితుడైన సుధాముడు (కుచేలుడు) తనను కలుసుకోవడానికి వచ్చినప్పుడు తెచ్చిన అటుకులను అమృతంతో సమానంగా భావించి తృప్తిగా ఆరగించాడు. స్నేహితుడిని సహాయం అడగడానికి వచ్చి ఆత్మగౌరవం ఒప్పుకోక సుధాముడు అలాగే తిరిగి వెళ్లినా.. చెప్పకుండానే స్నేహితుడి కష్టాలన్నీ తెలుసుకున్నాడు శ్రీకృష్ణుడు. అతడు తిరిగి వెళ్లే లోపే వారి ఇంటి నిండా వెండి, బంగారాలను నింపి అపర కుబేరుడిగా మార్చాడు. అదీ కృష్ణుడికి స్నేహితులంటే ఉన్న ప్రేమ. మనం ఆయనలా చేయలేకపోయినా.. కనీసం స్నేహితులతో మంచిచెడ్డలు పంచుకుంటూ వారికి అవసరంలో మనకు చేతనైనంత సహాయం చేసినా చాలు..!

ఒదిగిపోయి ఉండాలి..

కృష్ణుడు నంద మహారాజు కుమారుడు.. ఆయన గోకులానికే పెద్ద.. మరి, ఆయన కుమారుడంటే ఎలా ఉండాలి.. ఎంతటి దర్పాన్ని ప్రదర్శించాలి? కానీ చిట్టి కన్నయ్య మాత్రం అవేవీ లేకుండా సాదాసీదాగా పెరిగాడు. గోపబాలురతో ఆడుకుంటూ, గోపికల కుండలు పగులగొడుతూ అల్లరి చేష్టలు చేసినా అందరూ సమానమేనన్న నిజాన్ని చెప్పకనే చెప్పాడు. కేవలం మనుషులనే కాదు.. పశువులను కూడా మనతో సమానంగా ప్రేమించడం ఆ చిన్నికృష్ణుడికే చెల్లింది. ఇలా తన జీవితం ద్వారా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న సత్యాన్ని నేర్పాడు. మధురకు రాజైనా తనవారిని ఎప్పుడూ దూరం పెట్టలేదాయన.. జీవితంలో కొన్ని విజయాలు సాధించగానే విర్రవీగే తత్వాన్ని విడనాడాలని తన జీవితం ద్వారా బోధించాడు ఆ గోపాలుడు.

తల్లిదండ్రులను ప్రేమిస్తూ..

చిన్నతనంలో మనం ఎంత అల్లరి చేసినా దాన్ని భరిస్తూ మనల్ని పెంచారు మన తల్లిదండ్రులు.. అయితే కాస్త ముసలివారవగానే.. వారికి సేవ చేయలేకో, చాదస్తం భరించలేకో లేక మరింకేవైనా కారణాలతోనో వారిని వృద్ధాశ్రమాలకు పరిమితం చేసేవారు ఎంతోమంది.. కానీ తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలు చూపించాల్సిన అవసరం ఎంత ఉందో తన జీవితం ద్వారా చెబుతాడా నారాయణుడు. తన జన్మరహస్యం తెలుసుకోగానే చెరలో ఉన్న తల్లిదండ్రులను బయటకు తీసుకురావాలన్న కాంక్షతో తనతో ఉన్నవారందరినీ వదిలి మరీ మధురకు పయనమయ్యాడు. తాను ప్రేమించిన రాధను, గోకులాన్ని, స్నేహితులైన గోపాలురందరినీ వదిలి అక్కడికి వెళ్లి మేనమామ కంసుడిని చంపి తల్లిదండ్రులను చెర నుంచి విడిపిస్తాడు. తల్లిదండ్రుల కోసం దేన్నైనా వదులుకోవడానికి, ఎంతదాకా అయినా వెళ్లడానికి వెనుకాడలేదా దేవకీ నందనుడు..!

ఎల్లప్పుడూ చిరునవ్వే..!

కష్టాలనేవి భూమిపై జన్మించిన ప్రతిఒక్కరికీ సహజమైనవి.ఎలాంటి కష్టం లేకుండా జీవించేవారు భూమిపై ఎవరూ కనిపించరేమో.. శ్రీకృష్ణుడికి కూడా కష్టాలు ఎదురయ్యాయి. అయితే వాటన్నింటినీ కేవలం చిరునవ్వుతో ఎదుర్కోవడం ఆయన ప్రత్యేకత. చాలామంది చిన్న సమస్య ఎదురవగానే భయపడిపోతుంటారు. కానీ పెద్ద పెద్ద శాపాలు, రాక్షసుల దాడులు, మరెన్నో విపత్తులు ఆ నందనందనుడి జీవితంలో ఎదురయ్యాయి. కానీ వాటిలో దేనికీ ఆయన బెదరలేదు. తన ముఖంపై తొణికిసలాడే చిరునవ్వును ఎప్పుడూ వదలలేదు. చిరునవ్వుతోనే వాటన్నింటినీ ఎదుర్కొని విజయం కూడా సాధించాడు. జీవితంలో ఎన్ని కష్టాలెదురైనా చిరునవ్వే ఆయుధంగా వాటన్నింటినీ ఇట్టే దాటేయొచ్చని తన జీవితం ద్వారా తెలియజేశాడా రాధావల్లభుడు.

చూశారుగా.. ఆ లీలా కృష్ణుడి జీవితం ద్వారా మనం నేర్చుకొని, పాటించాల్సిన కొన్ని పాఠాలేంటో.. మరి, మీరూ కృష్ణుడు నేర్పిన ఈ సత్యాలను మీ జీవితంలో అమలు చేస్తారు కదూ..!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్