పర్యావరణంపై ప్రేమతో ‘యూకే పీఎం’ అవార్డు గెల్చుకుంది!

ఆరేళ్లంటే ఇంకా అమ్మానాన్నల లాలనలో గడిపే వయసు. తోటి పిల్లలతో సరదాగా ఆడుకోవడం తప్ప బయటి ప్రపంచం గురించి ఆలోచించే శక్తి సామర్థ్యాలు ఉండవు. కానీ భారత సంతతికి చెందిన అలీషా గదియా మాత్రం ఆరేళ్ల వయసు నాటికే పర్యావరణం గురించి ఆలోచిస్తోంది.

Published : 09 Oct 2021 18:31 IST

(Photo: Twitter)

ఆరేళ్లంటే ఇంకా అమ్మానాన్నల లాలనలో గడిపే వయసు. తోటి పిల్లలతో సరదాగా ఆడుకోవడం తప్ప బయటి ప్రపంచం గురించి ఆలోచించే శక్తి సామర్థ్యాలు ఉండవు. కానీ భారత సంతతికి చెందిన అలీషా గదియా మాత్రం ఆరేళ్ల వయసు నాటికే పర్యావరణం గురించి ఆలోచిస్తోంది. వాతావరణ మార్పులు, అడవుల పరిరక్షణపై అవగాహన కల్పిస్తోంది. అందుకే ‘క్లైమేట్‌ ప్రిన్సెస్‌’గా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్ నుంచి ‘పాయింట్స్ ఆఫ్‌ లైట్’ అవార్డును అందుకుంది.

ఆ చిన్నారికి పర్యావరణమంటే ప్రేమ!

నాటింగ్హాంషైర్‌లోని వెస్ట్‌ బ్రిడ్జ్‌ఫోర్డ్‌ ప్రాంతానికి చెందిన అలీషాకు పర్యావరణమంటే ఎంతో ప్రేమ. ఇందులో భాగంగానే అటవీ పరిరక్షణ కోసం కృషి చేస్తోన్న ‘కూల్‌ ఎర్త్‌’ అనే ఓ స్వచ్ఛంద సంస్థకు మినీ అంబాసిడర్‌గా ఎంపికైంది. సంస్థ తరఫున అటవీ నిర్మూలన కార్యక్రమాలకు వ్యతిరేకంగా తన గళం వినిపిస్తూ ఇటీవల 3 వేల పౌండ్ల విరాళాలను సేకరించింది. తను చదివే స్కూల్లో ‘క్లైమేట్‌ ఛేంజ్‌ క్లబ్‌’ పేరిట ఓ గ్రూపు ఏర్పాటుచేసి మొక్కల పెంపకం, చెత్త నిర్వహణ వంటి విషయాలపై అవగాహన కల్పిస్తోంది. అదేవిధంగా వాతావరణ మార్పులకు సంబంధించి యూకేలోని ప్రముఖ కంపెనీలు, ప్రభావశీల వ్యక్తులు, సెలబ్రిటీలకు వందలాది లేఖలు, ఈ-మెయిల్స్‌ పంపింది.

ప్రధాని లేఖ రాయడం సంతోషంగా ఉంది!

‘ఈ అవార్డు వచ్చినందుకు సంతోషంగా ఉంది. నన్ను మెచ్చుకుంటూ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ స్వయంగా లేఖ రాసినందుకు ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను. అయితే ఇలాంటి బహుమతి వస్తుందని కలలో కూడా ఊహించలేదు. నాకు మద్దతుగా నిలిచిన టీచర్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నన్ను మొదటి యూత్‌ అంబాసిడర్‌గా ఎంచుకున్నందుకు ‘కూల్‌ ఎర్త్‌’ సంస్థకు థ్యాంక్స్‌ చెబుతున్నాను. వాతావరణ మార్పులు... ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ఇదెంతో ముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన పెంచుకోవాలి. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతు కృషి చేయాలి. అడవులను కాపాడేందుకు నా శక్తిమేర ప్రయత్నిస్తున్నాను. ఈ పుడమి తల్లిని పచ్చగా మార్చేందుకే విస్తృతంగా విరాళాలు సేకరిస్తున్నాను’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది అలీషా.

80 కిలోమీటర్ల స్కూటర్ ఛాలెంజ్!

‘కూల్‌ ఎర్త్‌’ మినీ అంబాసిడర్‌గా విరాళాల సేకరణ కోసం కొన్ని నెలల క్రితం 80 కిలోమీటర్ల స్కూటర్‌ ఛాలెంజ్‌లో పాల్గొంది అలీషా. ఆన్‌లైన్‌ ఫండ్‌ రైజింగ్‌ పేజీ ద్వారా మొత్తం 3,400 పౌండ్లను సేకరించింది. బ్రిటన్‌ రాణి క్వీన్‌ ఎలిజబెత్, ప్రముఖ పర్యావరణ ప్రేమికుడు డేవిడ్‌ అటెన్‌బరో వంటి ప్రముఖులు ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలిచారు.

ఆ అమ్మాయిని చూసి నేర్చుకోవచ్చు!

ఈ సందర్భంగా అలీషాకు అవార్డు రావడంపై పలువురు ప్రముఖులు స్పందిస్తూ ‘పర్యావరణ పరిరక్షణకు మనమేం చేయాలో ఈ అమ్మాయిని చూసి నేర్చుకోవచ్చు. ఈ పురస్కారానికి అలీషా పూర్తి అర్హురాలు. తను ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలి’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు.

‘క్లైమేట్‌ ప్రిన్సెస్‌’ అంటున్నారు!

వివిధ రంగాల్లో సత్తా చాటుతూ సమాజంలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారికి 2014 నుంచీ ‘బ్రిటిష్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ పాయింట్స్‌ ఆఫ్‌ లైట్‌ అవార్డ్‌’ను బహూకరిస్తున్నారు. ‘మా అమ్మాయిని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. ప్రకృతి పరిరక్షణలో భాగంగా గత ఏడాది ఎన్నో కార్యక్రమాలు, క్యాంపెయిన్లలో పాల్గొంది. విరాళాలు సేకరించింది. అందరూ తనను ‘క్లైమేట్ ప్రిన్సెస్’ అంటున్నారు. చిన్న పిల్లైనా అలీషానే మాకు స్ఫూర్తి’ అని హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆ చిన్నారి తల్లిదండ్రులు కిరణ్‌, పూజ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్