Published : 22/07/2021 19:17 IST

కెరీర్, కన్నబిడ్డ.. ఈ రెండూ మాకు రెండు కళ్లు!

Photo: Instagram

చనుబాలు తాగే పసి బిడ్డను వదిలి రోజుల తరబడి దూరంగా ఉండడానికి ఏ తల్లికీ మనసొప్పదు. ఒకవేళ ఉండాల్సి వస్తే అన్ని రోజులకు సరిపడా పాలు తీసి భద్రపరచడం వీలు కాకపోవచ్చు! ఇదే సందిగ్ధంలో కూరుకుపోయింది కెనడియన్‌ మహిళల బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారిణి కిమ్ గాచర్‌. మూడు నెలల పసిబిడ్డ సోఫీకి తల్లైన ఆమె టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటోంది. ఈ క్రమంలో అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ నిబంధనల ప్రకారం బిడ్డను ఇంట్లోనే వదిలి తనొక్కర్తే రావాల్సి ఉంటుంది. కానీ అందుకు ఆమె ఇష్టపడలేదు. అలాగని పోటీల నుంచి తప్పుకోవడానికీ మనసొప్పలేదామెకు. ఇదే విషయాన్ని కమిటీ దృష్టికి తీసుకెళ్లగా ఆమె విన్నపాన్ని ఆలకించిన ఒలింపిక్‌ సంఘం.. తల్లులు చంటిబిడ్డలతో టోక్యో రావచ్చంటూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇలా ఎంతోమంది కొత్తగా తల్లులైన క్రీడాకారిణులు తమ చిన్నారులతో సహా ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి మార్గం సుగమమైంది. మరి, ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న కొంతమంది బ్రెస్ట్‌ఫీడింగ్‌ మామ్స్‌/చిన్న పిల్లలున్న తల్లుల గురించి తెలుసుకుందాం..

బిడ్డను వెంట తెచ్చుకుంటే తప్పేంటి?

‘గతేడాది నేను, నా టీమ్‌ టోక్యో ఒలింపిక్స్‌ కోసం అర్హత సాధించాం. అయితే ఓ పాలిచ్చే తల్లిగా ఇప్పుడు నేనో పెద్ద సందిగ్ధంలో చిక్కుకున్నా. కరోనా కారణంగా అథ్లెట్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు టోక్యో రావడానికి అనుమతి లేదు. దీంతో పోటీలు జరిగే 28 రోజుల పాటు నేను నా బిడ్డకైనా దూరంగా ఉండాలి.. లేదంటే ఒలింపిక్స్‌నైనా వదులుకోవాలి.. నాకు ఈ రెండూ కష్టమే..! ఇన్ని రోజులకు సరిపడా పాలు తీసి భద్రపరచమని కొంతమంది నాకు సలహా ఇచ్చారు.. కానీ అది సాధ్యమేనా? అంతేకాదు.. ఎక్కువ కసరత్తులు/సాధన చేసే అథ్లెట్‌గా నాలో పాల ఉత్పత్తి కూడా అంతంతమాత్రంగానే ఉంది.. ఇక పోటీలకు వెళ్లినా పాలు తీసి అక్కడ్నుంచి నా బిడ్డకు చేరవేయాలి.. ఈ క్రమంలోనూ సవాళ్లు, సమస్యలు ఎన్నో ఉన్నాయి.. ఇలాంటి అయోమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నాకు పాలుపోవట్లేదు..!

జపాన్‌ అభిమానులకు పోటీలు ప్రత్యక్షంగా వీక్షించడానికి అనుమతి ఉన్నప్పుడు.. నేను నా బిడ్డను వెంట తెచ్చుకుంటే తప్పేంటి?’ అంటూ తన ఆవేదనను ఇటీవలే వీడియో రూపంలో సోషల్‌మీడియాలో పంచుకుంది కిమ్‌. ఇది కాస్తా అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ దృష్టికి వెళ్లడంతో తమ నిబంధనల్లో పలు మార్పులు చేసింది. పాలిచ్చే తల్లులు తమ చంటి బిడ్డల్ని వెంట తెచ్చుకోవచ్చంటూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అంతేకాదు.. చిన్న పిల్లలున్న తల్లులు కూడా తమ చిన్నారుల్ని వెంట తీసుకురావడానికి అనుమతించింది.

క్రీడాకారిణులకు ఇది సుదినం!

ఇలా తన ఆవేదనను పరిగణనలోకి తీసుకొని చంటి పిల్లల్ని వెంట తీసుకురావడానికి అనుమతించిన ఒలింపిక్‌ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది కిమ్‌. ‘మహిళా క్రీడాకారులకు ఇది శుభదినం..’ అంటూ తన ఆనందాన్ని వెలిబుచ్చిందామె. కెనడా మహిళల బాస్కెట్‌ బాల్‌ జట్టులో కీలక సభ్యురాలైన కిమ్.. 2001 నుంచి జట్టులో కొనసాగుతోంది. ఇప్పటికే లండన్‌, టొరంటో, రియో ఒలింపిక్స్‌లో తన బృందంతో సహా పాల్గొని ప్రతిభ కనబరిచింది. 2019లో FIBA AmeriCup పోటీల్లో తన జట్టు రన్నరప్‌గా నిలిచి ఒలింపిక్స్‌ అర్హత కోసం తుది దశ పోటీల్లో పాల్గొనడంలో కీలక పాత్ర పోషించిందామె. ఇక 2020లో టోక్యో బెర్తు ఖరారు చేసుకుంది కిమ్‌ బృందం. ఆరేళ్ల వయసు నుంచే బాస్కెట్‌ బాల్‌పై ప్రేమ పెంచుకున్న ఈ కెనడియన్‌ స్టార్‌ ప్లేయర్‌.. అటు చదువును, ఇటు క్రీడను బ్యాలన్స్‌ చేస్తూ ముందుకు సాగింది. ‘మన జీవితంలో జరిగే చిన్న చిన్న విషయాలే మనల్ని విజయం వైపు నడిపిస్తాయ’నే సిద్ధాంతాన్ని నమ్ముతానంటోన్న కిమ్‌.. టోక్యోలో తన జట్టుకు పతకం అందించాలన్న గట్టి పట్టుదలతో ఉంది.

బిడ్డ పుట్టిన రెండు నెలలకే..!

అటు ఇంటిని, ఇటు కెరీర్‌ని.. ఈ రెండింటినీ రెండు కళ్లలా భావిస్తుంటారు ఎంతోమంది మహిళలు. ఈ రెండు బాధ్యతల్ని బ్యాలన్స్‌ చేసుకుంటూ ముందుకు సాగుతుంటారు. యూఎస్‌కు చెందిన మారథాన్‌ రన్నర్‌ అలిఫైన్‌ తులియాముక్‌ కూడా అదే కోవకి చెందుతుంది. ఈ జనవరిలో జో అనే పాపకు జన్మనిచ్చిన ఆమె.. ఒలింపిక్స్‌లో తన కూతురిని తన వెంట తీసుకెళ్లే అవకాశం ఉంటుందో, లేదోనని మథనపడింది. అయితే తాజాగా కమిటీ తీసుకున్న నిర్ణయంతో సంతోషించిన ఆమె.. ‘బిడ్డకు పాలిచ్చే ఓ తల్లిగా ఈ ఒలింపిక్స్‌లో పాల్గొంటానని నేను అనుకోలేదు. అమ్మగా నేను నా బిడ్డను ఎంత ప్రేమిస్తానో.. అథ్లెట్‌గా నా ఆటనూ అంతే గౌరవిస్తా..’ అంటోంది.

కెన్యాలో జన్మించిన ఆమె.. యూఎస్‌ తరఫున మారథాన్‌ పోటీల్లో పాల్గొంటోంది. ఇప్పటికే పదిసార్లు యూఎస్‌ఏ ట్రాక్‌, ఫీల్డ్‌ విభాగాల్లో నేషనల్‌ ఛాంపియన్‌గా నిలిచిన అలిఫైన్‌.. గతేడాది టోక్యో అర్హత పోటీల్లో పాల్గొని విజయం సాధించింది. ఇక బిడ్డ పుట్టిన రెండు నెలలకే తిరిగి సాధన ప్రారంభించిన ఆమె.. పూర్తి స్థాయి సన్నద్ధత, ఆత్మవిశ్వాసంతో ఒలింపిక్స్‌ బరిలోకి దిగుతోంది.

కెప్టెన్‌గా.. అమ్మగా..!

యూఎస్‌ మహిళల జాతీయ ఫుట్‌బాల్‌ టీమ్‌కి కెప్టెన్‌గా కొనసాగుతోంది అలెక్స్‌ మోర్గాన్‌. అందం, అంతకుమించిన క్రీడా ప్రతిభ కలిగిన ఆమె.. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో తన జట్టు పసిడి పతకం గెలవడంలో ప్రధాన పాత్ర పోషించింది. అంతేనా.. 2015, 2019 ఫిఫా మహిళల ప్రపంచకప్‌లలో తన జట్టు విజయం సాధించడంలో కీలకంగా మారిందామె. 2008లో ఫిఫా అండర్‌-20 మహిళల ప్రపంచకప్‌లో ఉత్తరకొరియాతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో అద్భుతమైన విన్నింగ్‌ గోల్‌ కొట్టి జట్టుకు మరపురాని విజయాన్నందించిందామె. దీంతో ఆ గోల్‌ను ‘గోల్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌’, ‘ఆ ఏడాదిలో రెండో అత్యుత్తమమైన గోల్‌’గా ఫిఫా అభివర్ణించింది. ఇలా జట్టు సభ్యురాలిగా/కెప్టెన్ గానే కాదు.. వ్యక్తిగతంగా పలు అవార్డులు గెలుచుకుందామె. 2013, 2016, 2017, 2018.. ‘CONCACAF ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డులతో పాటు.. 2019లో ‘ఉత్తమ మహిళా అథ్లెట్‌’గా పురస్కారం అందుకుంది.

2020 మేలో ఛార్లీ అనే పాపకు జన్మనిచ్చిన ఆమె.. ఇప్పుడు తన చిన్నారితో కలిసి టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడుతోంది.   ఫుట్‌బాలర్‌గానే కాదు.. వ్యాపారవేత్తగా, రచయిత్రిగా, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, మార్కెటింగ్‌ ఐకాన్‌గా.. బహుముఖ ప్రజ్ఞ కనబరుస్తోందామె.

అమ్మయినా విజయం మనదే!

‘తల్లయ్యాక కూడా మహిళలు పోటీపడగలరు.. విజయం సాధించగలరు’ అంటోంది అమెరికాకు చెందిన పరుగుల రాణి అలిసన్‌ ఫెలిక్స్‌. ఇప్పటికే నాలుగుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొని తొమ్మిది పతకాలు గెలుచుకున్న ఆమె.. ఈ విశ్వ క్రీడల వేదికపై ట్రాక్‌, ఫీల్డ్‌ ఈవెంట్లలో ఎక్కువ పతకాలు సాధించిన మొదటి మహిళగా రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

ఇక 2018లో క్యామ్రిన్‌ అనే పాపకు జన్మనిచ్చిన అలిసన్‌.. డెలివరీ సమయంలో తాను, తన చిన్నారి తీవ్ర ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొన్నారు. అయితే ఆపై వాటి నుంచి బయటపడి.. తిరిగి పరుగు ప్రారంభించిన అలిసన్‌.. తల్లయ్యాకా మహిళలు కెరీర్‌లో దూసుకుపోగలరని నిరూపించడానికే సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించానంటోంది.

‘ఇటు పరుగుకు ఎంత ప్రాధాన్యమిస్తానో.. అమ్మగా ఇంటినీ అంతే ప్రేమిస్తా. అయితే మహిళలు తల్లయ్యాక తిరిగి కెరీర్‌లో సక్సెస్‌ కాలేరన్నది చాలామంది భావన. కానీ అది తప్పని నిరూపించడానికే టోక్యోకు వెళ్తున్నా..’ అంటోందీ రన్నింగ్‌ మామ్.

వీళ్లతో పాటు జమైకా స్ప్రింటర్‌ ఫ్రేజర్‌, ఉజ్బెకిస్థాన్‌ జిమ్నాస్ట్‌ ఒక్సానాతో పాటు ఇండియా నుంచి దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌, టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా.. తదితరులు కూడా తమ చిన్నారులతో కలిసి టోక్యో చేరుకోనున్నారు. ఏదేమైనా.. ఓవైపు అమ్మతనానికి, మరోవైపు కెరీర్‌కు సమప్రాధాన్యమిస్తూ.. ఆ రెండింటినీ బ్యాలన్స్‌ చేసుకుంటూ అమ్మయ్యాకా మహిళలు మునుపటిలా అన్నింట్లోనూ రాణించగలరని నిరూపిస్తున్నారీ స్టార్‌ అథ్లెట్స్!

ఆల్‌ ది బెస్ట్‌ సూపర్‌ మామ్స్!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి