మూడేళ్లు మంచానికే పరిమితమైనా.. మళ్లీ పంచ్ విసిరింది!

కోట్లాది భారత అభిమానుల కళ్ల్లల్లో సంతోషాన్ని నింపుతూ అరంగేట్ర ఒలింపిక్స్‌లోనే కాంస్యాన్ని గెల్చుకుంది యువ బాక్సర్‌ లవ్లీనా బొర్గొహెయిన్‌. దూకుడే మంత్రంగా ముందుకు సాగిన ఈ 23 ఏళ్ల అమ్మాయి తన అదిరిపోయే పంచులతో ప్రపంచ మేటి బాక్సర్లను సైతం మట్టి కరిపించింది. అయితే లవ్లీనా పవర్‌ పంచ్‌ల వెనక మరో మేటి బాక్సర్‌ కృషి, శ్రమ దాగి ఉన్నాయి.

Published : 06 Aug 2021 18:07 IST

Photo: Instagram

కోట్లాది భారత అభిమానుల కళ్ల్లల్లో సంతోషాన్ని నింపుతూ అరంగేట్ర ఒలింపిక్స్‌లోనే కాంస్యాన్ని గెల్చుకుంది యువ బాక్సర్‌ లవ్లీనా బొర్గొహెయిన్‌. దూకుడే మంత్రంగా ముందుకు సాగిన ఈ 23 ఏళ్ల అమ్మాయి తన అదిరిపోయే పంచులతో ప్రపంచ మేటి బాక్సర్లను సైతం మట్టి కరిపించింది. అయితే లవ్లీనా పవర్‌ పంచ్‌ల వెనక మరో మేటి బాక్సర్‌ కృషి, శ్రమ దాగి ఉన్నాయి. ఆమే సిక్కింకు చెందిన మాజీ బాక్సర్‌, కోచ్‌ సంధ్య గురుంగ్.

శిష్యురాలి ఆటను టీవీలో చూస్తూ!

టోక్యో వేదికగా లవ్లీనా బాక్సింగ్‌ రింగ్‌లో పంచ్‌లు కురిపిస్తుంటే టీవీల్లో చూసి మురిసిపోయారు భారత క్రీడాభిమానులు. అందులో కోచ్‌ సంధ్య కూడా ఉన్నారు. సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌లోని బుర్తుక్‌లోని తన నివాసంలో శిష్యురాలి ఆటను ఎంతో ఆసక్తిగా తిలకించారీ మాజీ బాక్సర్‌. లవ్లీనా ఒక్కొక్క రౌండ్‌ను దాటి ముందుకు పోతుంటే గర్వంగా మురిసిపోయారు.

మూడేళ్లుగా మంచానికే పరిమితమైనా!

బాక్సింగ్‌లో లవ్లీనా ప్రస్థానం ఎంత స్ఫూర్తినిచ్చిందో సంధ్య గురుంగ్‌ కథ కూడా అంతే ప్రేరణనిస్తుంది. గ్యాంగ్‌టక్‌లోని బుర్తుక్‌ ప్రాంతానికి చెందిన సంధ్యకు చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఎంతో ఆసక్తి. అయితే దురదృష్టవశాత్తూ టీనేజ్‌లో ఉన్నప్పుడు ఆమె ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. పక్షవాతానికి గురై మూడేళ్లు పూర్తిగా మంచానికే పరిమితమైంది. అయితే ఈ ప్రమాదం ఆటలపై ఆమెకున్న ఆసక్తిని ఆపలేకపోయింది. పక్షవాతం నుంచి క్రమంగా కోలుకుంది. సిక్కింకు చెందిన మాజీ ఒలింపియన్‌ జస్లాల్‌ ప్రధాన్‌ స్ఫూర్తితో బాక్సింగ్‌ రింగ్‌లోకి ప్రవేశించింది. 1999లో సాధన ప్రారంభించిన సంధ్య 2000లో మొదటిసారి బాక్సింగ్‌ బరిలోకి దిగింది. 68 కిలోల విభాగంలో జాతీయ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో కాంస్య పతకం సాధించి జాతీయ స్థాయి బాక్సర్‌గా ఎదిగింది.

బాక్సర్లను తయారుచేస్తూ!

2008లో చివరి గేమ్ ఆడిన సంధ్య బంగారు పతకం గెల్చుకుని గర్వంగా తన కెరీర్‌కు వీడ్కోలు పలికింది. ఈ క్రమంలో క్రీడారంగంలో ఆమె సేవలను గుర్తించిన అప్పటి సిక్కిం ప్రభుత్వం ఆమెను ‘బాక్సింగ్‌ అఫీషియల్‌’ లేదా ‘కోచ్‌’ ఏదో ఒక బాధ్యతను ఎంచుకోమంది. ‘బాక్సింగ్‌ అఫీషియల్ అనేది సీజనల్‌. అదే కోచ్‌ అయితే రెగ్యులర్‌గా శిక్షణనివ్వాల్సి ఉంటుంది. అయితే ఆ సమయంలో కోచ్‌గా ఉండాలంటే డిప్లొమో ఉండాలన్న నిబంధనతో నేను ఆ కోర్సు పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యాను. అయితే కోర్సు పూర్తవ్వక ముందే నాకు నేషనల్‌ క్యాంప్‌ కోచ్‌గా అవకాశం వచ్చింది. అయితే అప్పటి క్రీడా మంత్రి, ప్రస్తుత సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌ సింగ్‌ గోలే మళ్లీ నన్ను పిలిచి నేషనల్‌ కోచ్‌గా అవకాశం కల్పించారు. అలా 2010 నుంచి జాతీయ స్థాయి బాక్సర్లను తయారుచేస్తున్నాను’ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు సంధ్య.

ఒక్కసారి కూడా ‘నో’ చెప్పలేదు!

సబ్‌ జూనియర్‌ క్యాంప్‌ సందర్భంగా 2012లో మొదటిసారిగా లవ్లీనాను కలుసుకుంది సంధ్య. ఆ తర్వాత 2016 నుంచి ఆమెకు రెగ్యులర్‌గా శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. ‘రియో ఒలింపిక్స్ తర్వాత దిల్లీలో నేషనల్‌ క్యాంప్‌ జరిగింది. అప్పుడు లవ్లీనా నా దగ్గరకు వచ్చింది. తనకు శిక్షణ ఇవ్వాలని కోరింది. అప్పటికే ఆమె గురించి తెలియడంతో నేను కాదనలేకపోయాను. లవ్లీనాకు బాక్సింగ్‌ అంటే చాలా ఇష్టం. క్రమశిక్షణ కలిగిన అమ్మాయి. ఆట కోసం నిజాయతీగా కష్టపడుతుంది. నా శిక్షణలో ఆమె ‘నో’ అని చెప్పిన సందర్భం ఒక్కటి కూడా లేదు.

మొదట్లో లవ్లీనా ఆటతీరును చూసినప్పుడు నాకొక విషయం తెలిసింది. మేటి బాక్సర్‌గా ఎదిగేందుకు ఆమెలో అన్ని అర్హతలున్నాయి. ముఖ్యంగా ఎత్తు తనకెంతో ప్లస్‌ పాయింట్‌. అయితే ఎందుకో ఆమె భయపడుతుంది. బలహీనమైన ప్రత్యర్థులు ఎదురైనప్పుడు ఈ లోపం పెద్దగా కనిపించదు కానీ... కొద్దిగా మెరుగైన బాక్సర్లు ఎదురైనప్పుడు ఒత్తిడికి లోనై భయాందోళనలకు గురవుతుంది. అందుకే ఆట కన్నా ముందు భయంతో పోరాడి గెలవాలని ఆమెకు సూచించాను.

‘తుమ్‌ షేర్నీ నహీ హో...తుమ్‌ షేర్‌ హో (నువ్వు ఆడ సింహానివి కావు... సింహానివి)’ అని తనలో ధైర్యం నూరిపోసేదాన్ని. చాలామంది అమ్మాయిల్లాగే లవ్లీనాకు నడుము వరకు అందమైన కురులు ఉండేవి. అయితే బాక్సింగ్‌ రింగ్‌లో చురుగ్గా కదిలేందుకు 2018లో జుట్టును కత్తిరించుకుంది. ఆటపై ఆమెకున్న అంకిత భావానికి అది నిదర్శనం. కేవలం బాక్సింగ్‌ క్రీడాకారిణిగానే కాదు వ్యక్తిగతంగానూ లవ్లీనా అంటే నాకెంతో ఇష్టం. తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలని తాపత్రయపడుతుంటుంది’ అని అప్పటి రోజులను గుర్తుకు తెచ్చుకున్నారీ మాజీ బాక్సర్.

లవ్లీనా లాగే మరికొంతమందిని...!

లవ్లీనా లాగే మరికొంతమంది మహిళా బాక్సర్లను తయారుచేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది సంధ్య. టోక్యోలో తన శిష్యురాలి విజయంపై స్పందించిన ఆమె.. ‘నా ఏకైక లక్ష్యం ఒలింపిక్సే’ అని ఐదేళ్ల క్రితం నా వద్ద శిక్షణకు వచ్చినప్పుడే చెప్పింది లవ్లీనా. తన కల నెరవేరినందుకు నాక్కూడా ఎంతో గర్వంగా, సంతోషంగా ఉంది. మేం వేలమైళ్ల దూరంలో ఉన్నప్పటికీ తరచూ ఫోన్‌లో మాట్లాడుకుంటాం. దురదృష్టవశాత్తూ నేను టోక్యోకు వెళ్లలేకపోయాను. అయితే వీడియో కాల్స్‌ ద్వారా ఆమెతో నిత్యం మాట్లాడుతూ ఉన్నాను. ప్రత్యర్థుల బలాలు, బలహీనతల గురించి పరస్పరం చర్చించుకున్నాం. ఒలింపిక్‌ పోడియంపై తను మెడల్‌ అందుకున్నప్పుడు నా మనసు కూడా సంతోషంతో నిండిపోయింది’ అని చెప్పుకొచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్