Published : 17/04/2022 11:45 IST

కెరీర్‌ బ్రేకా? మేం ఉద్యోగాలిప్పిస్తాం!

(Photo: Instagram)

పెళ్లి, పిల్లలు, భర్తకు వేరే చోటికి బదిలీ అవడం.. మహిళల కెరీర్‌కి బ్రేక్‌ పడడానికి ఇలా బోలెడు కారణాలున్నాయి. పోనీ.. ఆ తర్వాత తిరిగి కెరీర్‌ కొనసాగిద్దామంటే సరైన అవకాశాలు లేకపోవడం, ఒకవేళ ఉన్నా.. తమ ప్రతిభకు తగ్గ ఉద్యోగం దొరక్కపోవడం.. ఇలా కెరీర్‌ని తిరిగి కొనసాగించే విషయంలో చాలామంది మహిళలు అసంతృప్తితోనే ఉన్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ తరుణంలో ఇలాంటి ఉద్యోగ అసమానతలకు చెక్‌ పెట్టాలని నిర్ణయించుకుంది పుణేకు చెందిన పూజా బంగద్‌. ఈ క్రమంలోనే ఓ టెక్‌ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించి.. ఈ వేదికగా ఐటీ కెరీర్‌లో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించాలనుకునే అతివల కోసం.. అధిక వేతనం, మంచి హోదాతో కూడిన ఉద్యోగ కల్పన చేస్తోంది. ఇలా సౌలభ్యం, సంతృప్తితో కూడిన ఉపాధిని అందిస్తూ ఎంతోమంది మహిళల్లో వెలుగులు నింపుతోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ స్టార్టప్‌ జర్నీ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం..!

పూజ చిన్నతనం నుంచీ చదువులో మహా చురుకు. ఏ విషయమైనా ప్రయోగాత్మకంగా నేర్చుకుంటేనే జీవితాంతం గుర్తుంటుందని నమ్మే ఆమె.. సమస్యను విశ్లేషించడం, పరిష్కరించడంపై ఎక్కువ దృష్టి పెట్టేది. ఈ ఆసక్తే ఆమెను కంప్యూటర్‌ సైన్స్‌ ఎంచుకునేలా చేసింది. సావిత్రిబాయి ఫూలే పుణే యూనివర్సిటీ నుంచి ఇదే విభాగంలో మాస్టర్స్‌ పట్టా అందుకున్న పూజకు.. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లోనే విప్రో, ఇన్ఫోసిస్‌, కాగ్నిజెంట్‌.. వంటి పలు సంస్థల్లో ఉద్యోగావకాశాలు తలుపుతట్టాయి.

‘షీ వర్క్‌’ అలా పుట్టింది!

ఈ క్రమంలోనే కాగ్నిజెంట్‌ సంస్థలో రెండేళ్ల పాటు అసోసియేట్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తించిన పూజ.. కేవలం తన వృత్తిపైనే దృష్టి పెట్టలేదు.. ఐటీ విభాగంలో హోదా పెరుగుతున్న కొద్దీ మహిళల శాతం తగ్గుతున్న విషయాన్ని గమనించింది. ఎలాగైనా సరే.. ఈ అసమానతలకు చెక్‌ పెట్టాలన్న ఆలోచనలో పడిందామె. ఇదే తరుణంలో ఈ సమస్య పూర్వపరాలపై పరిశోధనలు చేసిన ఆమె.. తిరిగి కెరీర్‌ ప్రారంభించాలనుకునే మహిళల కోసం ఓ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటుచేయాలని నిర్ణయించుకుంది. ఈ ఆలోచన ఫలితమే 2019లో పూజ తన ఫ్రెండ్‌తో కలిసి ప్రారంభించిన ‘షీ వర్క్‌’ స్టార్టప్‌.

‘ఐటీ విభాగంలో ఉన్నత స్థాయిల్లోకి వెళ్లే కొద్దీ మహిళల శాతం తగ్గడం గమనించాను. ఇందుకు గల కారణాలపై పరిశోధిస్తే.. మహిళలు తీసుకునే కెరీర్‌ బ్రేకే అని అర్థమైంది. అంటే.. పలు వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాల వల్ల కెరీర్‌లో విరామం తీసుకొని.. తిరిగి చేరాలనుకుంటోన్న మహిళలకు సరైన అవకాశాలు దొరకట్లేదు.. పైగా వాళ్లకు ప్రతిభ ఉన్నా.. అందుకు తగ్గ హోదా/ఉన్నత స్థాయి దక్కట్లేదు. ఈ సమస్యకు చరమగీతం పాడాలనే ‘షీ వర్క్‌’ ప్రారంభించా. మహిళల ప్రతిభకు తగిన పట్టం కట్టే ఉపాధి వేదిక ఇది..’ అంటూ తన స్టార్టప్‌ గురించి చెప్పుకొచ్చింది పూజ.

సౌకర్యానికే ప్రాధాన్యం!

ప్రస్తుతం పలు దేశ, విదేశీ ఐటీ కంపెనీలతో అనుసంధానమై పనిచేస్తోన్న తన సంస్థ.. ఉద్యోగం చేసే క్రమంలోనూ మహిళల సౌకర్యానికే పెద్ద పీట వేస్తోందని చెబుతోంది. ‘మహిళలకు ఇంటా, బయటా ఎన్నో పనులుంటాయి. ఒక్కోసారి వీటిని బ్యాలన్స్‌ చేసుకోవడం వారికి కత్తి మీద సామవుతోంది.. పైగా ఒక చోట ఉద్యోగం చేస్తున్నప్పుడు భర్త ఉద్యోగ బదిలీ రీత్యా తన ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి రావచ్చు. కానీ మా సంస్థ వేదికగా ఉద్యోగం పొందిన మహిళలు తమ మనసు చంపుకొని అలాంటి త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్లు ఎప్పుడైనా, ఎక్కడ్నుంచైనా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసే వెసులుబాటు ఆయా కంపెనీలు కల్పిస్తున్నాయి. అంతేకాదు.. వాళ్ల వ్యక్తిగత, వృత్తిపరమైన లక్ష్యాలకు అనుగుణంగా ప్రాజెక్టులను ఎంచుకునే ఛాయిస్‌ కూడా వారికి ఉంది..’ అంటోంది పూజ.

త్వరలో అమెరికాలోనూ..!

ప్రస్తుతం ఇండియాలోని స్టార్టప్‌లు, మధ్యస్థాయి, ఎమ్మెన్సీ ఐటీ కంపెనీలతో మమేకమై పనిచేస్తోన్న ఈ సంస్థ ద్వారా ఉద్యోగం పొందాలంటే ఔత్సాహిక మహిళలు ముందుగా ఇందులో రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. తమ విద్యా, వృత్తికి సంబంధించిన ప్రొఫైల్స్‌ ఇందులో అప్‌లోడ్‌ చేయాలి. వాటిని సునిశితంగా పరిశీలించి, కొన్ని టెక్నికల్‌ పరీక్షల్లో పాసయ్యాకే షీ వర్క్‌ కమ్యూనిటీలోకి ఆహ్వానిస్తారు. ఆపై ఆయా కంపెనీ ప్లేస్‌మెంట్స్‌ మీ ప్రొఫైల్‌కి మ్యాచైతే.. వాళ్లే మీకు సమాచారమిస్తారు. దాన్ని బట్టి మీరు ఇంటర్వ్యూ/ఇతర పరీక్షల్లో ప్రతిభ చూపి మీ చదువు, అనుభవానికి తగ్గ ఉద్యోగం సంపాదించుకోవచ్చు. ఒకరకంగా చెప్పాలంటే.. ఇది ఒక కన్సల్టెన్సీ సంస్థ తరహా సేవల్ని అందిస్తోందన్నమాట! అంతేకాదు.. తమ సంస్థలో రిజిస్టర్‌ అయిన అభ్యర్థులకు నైపుణ్యాభివృద్ధి కోర్సులు కూడా అందిస్తున్నామంటున్నారు పూజ.

ఇలా ఐటీ రంగంలో మహిళల ప్రాతినిథ్యం పెంచేందుకు తన వంతుగా కృషి చేస్తోన్న పూజ.. ఈ రెండేళ్ల కాలంలో తన సంస్థ ద్వారా వేలాది మంది మహిళలకు ఉద్యోగ కల్పన చేసింది. త్వరలోనే తన సేవల్ని అమెరికాలోనూ విస్తరించనున్నట్లు చెబుతోందీ పుణే ఆంత్రప్రెన్యూర్‌.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని