Rakul : అప్పుడు ఆడిషన్స్‌ కోసం క్యూ కట్టా!

‘లక్ష్యం ఉన్నతంగా ఉన్నప్పుడు ఎదురయ్యే సవాళ్లు కూడా అంతే కఠినంగా ఉంటాయి..’ అంటుంటారు. ఆ సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలమంటోంది టాలీవుడ్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.

Published : 01 Oct 2023 11:44 IST

(Photos: Instagram)

‘లక్ష్యం ఉన్నతంగా ఉన్నప్పుడు ఎదురయ్యే సవాళ్లు కూడా అంతే కఠినంగా ఉంటాయి..’ అంటుంటారు. ఆ సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలమంటోంది టాలీవుడ్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. రంగుల ప్రపంచంలోకి రావాలని కలలు కన్న ఆమె సినీ తారల్ని చూసి.. ‘అబ్బ వీళ్ల జీవితమే బాగుంది.. డబ్బు, హోదా, పలుకుబడి.. అన్నీ ఉన్నాయి’ అనుకుంటాం. కానీ ఈ స్థితికి రావడానికి వాళ్లు చేసిన ప్రయత్నాలు, పడిన కష్టాలు, ఎదుర్కొన్న సవాళ్లు.. ఇవేవీ చాలామందికి తెలియవు. ఒక్కోసారి ప్రతిభ ఉన్నా అవకాశాల కోసం వేచి చూడాల్సి వస్తుంటుంది. కెరీర్‌ తొలినాళ్లలో తానూ ఇలాంటి పరిస్థితుల్నే ఎదుర్కొన్నానంటోంది టాలీవుడ్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. సినిమాల్లోకి రావాలని చిన్న వయసు నుంచే కలలు కన్న ఈ ముద్దుగుమ్మ.. ఒకప్పుడు అవకాశాల కోసం ఎదురుచూడాల్సి వచ్చిందంటోంది. అయినా తన ఓపిక, ఆత్మవిశ్వాసమే ప్రస్తుతం తననీ స్థాయిలో నిలబెట్టాయని చెబుతోంది. ప్రస్తుతం బాలీవుడ్‌ తారలంతా ‘I have come a long way’ అనే హ్యాష్‌ట్యాగ్‌ వేదికగా తమ కెరీర్‌ సవాళ్లు, వాటిని ఎదుర్కొన్న తీరును సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రకుల్‌ కూడా ఈ హ్యాష్‌ట్యాగ్‌ను జతచేస్తూ.. కెరీర్‌లో తాను ఎదుర్కొన్న ఆటుపోట్లను షేర్‌ చేసుకుంది.

ఆర్మీ కుటుంబంలో పుట్టిపెరిగిన రకుల్‌ చిన్న వయసు నుంచే సినిమాల్లోకి రావాలని కలలు కంది. ఈ క్రమంలోనే 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే మోడలింగ్‌ చేయడం ప్రారంభించింది. ‘గిల్లీ’ అనే కన్నడ సినిమాతో వెండితెరపై తొలిసారి మెరిసిన రకుల్‌.. ‘కెరటం’ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇక అప్పట్నుంచి వరుస చిత్రాలు చేస్తూ చిత్ర పరిశ్రమంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం తానీ స్థాయిలో ఉన్నానంటే.. కెరీర్‌ ఆరంభంలో పలు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడం వల్లే అంటోందీ ముద్దుగుమ్మ.

నా స్థానంలో మరొకరిని!

ప్రస్తుతం బాలీవుడ్‌ తారలంతా ఒక్కొక్కరుగా ‘I have come a long way’ అనే హ్యాష్‌ట్యాగ్‌ వేదికగా.. తమ కెరీర్‌ స్టోరీస్‌ని పంచుకుంటున్నారు. సినిమాల్లోకి వచ్చే క్రమంలో తామెదుర్కొన్న సవాళ్లు, తమ అనుభవాల్ని ఈ వేదికగా పంచుకుంటున్నారు. రకుల్‌ కూడా కెరీర్‌ ఆరంభంలో తానెదుర్కొన్న సవాళ్లను తాజాగా సోషల్‌ మీడియాలో పంచుకుంది.

‘కాలేజీలో ఉన్నప్పుడే నేను సినిమాల్లోకి రావాలని కలలు కన్నా. నిజానికి ఆ సమయంలో ఈ రంగుల ప్రపంచం గురించి నాకు ఏమీ తెలియదు. అయినా పూర్తి ఆత్మవిశ్వాసం, స్వీయ నమ్మకంతో 18 ఏళ్ల వయసులోనే మోడలింగ్‌ చేయడం ప్రారంభించా. ఆపై మిస్‌ ఇండియా పోటీల్లోనూ పాల్గొని.. నాలుగు సబ్‌టైటిల్స్‌ గెలుచుకున్నా. అయితే ఈ ప్రయాణంలో పలు సవాళ్లు చవి చూశా. ఇదిలా ఉంటే ఇంటిని, కుటుంబాన్ని వదిలి ముంబయి చేరుకొని ఒంటరిగా గడపడం మరో సవాలుగా అనిపించేది. ఇక సినిమా అవకాశాల్లో భాగంగా ఆడిషన్స్‌ కోసం క్యూలో నిలబడడం, క్యాస్టింగ్‌ ఏజెంట్స్‌/డైరెక్టర్లకు కాల్స్‌ చేయడం.. ఇప్పటికీ మర్చిపోను. అలాగే పలు సినిమాల కోసం సంతకం చేసినా.. ఆ తర్వాత నా స్థానంలో మరొకరిని తీసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఏదైతేనేం.. ఓ మంచి నటిగా మీ అందరి (అభిమానుల) మనసుల్లో స్థానం సంపాదించుకోగలిగాను. ఈ అనుభవాలన్నీ నాకెన్నో పాఠాలు నేర్పాయి.. కొన్ని మధురానుభూతుల్నీ అందించాయి.

అదే నా సక్సెస్‌ సీక్రెట్‌!

అయితే ఎన్ని సవాళ్లు ఎదురైనా.. నాపై నేను నమ్మకం ఉంచా.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాను. అప్పుడూ, ఇప్పుడూ నా సక్సెస్‌ సీక్రెట్‌ కష్టపడి పనిచేయడమే! లక్ష్యం ఉన్నతంగా ఉన్నప్పుడు ఎదురయ్యే సవాళ్లు కూడా అంతే కఠినంగా ఉంటాయి.. ఓపికతో వాటిని ఎదుర్కొన్నప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలం. అయితే ఈ క్రమంలో దక్కిన చిన్న చిన్న విజయాల్ని కూడా సెలబ్రేట్‌ చేసుకుంటూ అంతిమ లక్ష్యం దిశగా ముందుకు సాగినప్పుడే సానుకూల దృక్పథం అలవడుతుంది..’ అంది రకుల్‌. తెలుగులో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’, ‘పండగ చేస్కో’, ‘కిక్‌ 2’, ‘నాన్నకు ప్రేమతో’, ‘సరైనోడు’, ‘ధృవ’, ‘మన్మధుడు 2’.. వంటి హిట్‌ చిత్రాల్లో నటించిందీ ముద్దుగుమ్మ. మరోవైపు బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాల్ని అందుకుంటోంది. ప్రస్తుతం ‘ఇండియన్‌ 2’తో పాటు మరో రెండు చిత్రాల్లో నటిస్తోన్న ఈ పంజాబీ బ్యూటీ.. వ్యాపారంలోనూ తనదైన ముద్ర వేసింది. స్వతహాగా ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అయిన రకుల్‌.. హైదరాబాద్‌, విశాఖపట్నంలలో పలు జిమ్‌ సెంటర్లను నడుపుతోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్