Updated : 06/01/2022 20:27 IST

Sports Biopics: క్రీడాకారిణులుగానూ అదరగొట్టేస్తున్నారు!

‘తెలిసింది గోరంత.. తెలియాల్సింది కొండంత..’ అంటుంటారు. మైదానంలో మెరికల్లాంటి ప్రదర్శన చేసే క్రీడాకారిణుల జీవితానికి ఇది అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. తమ ఆటతో దేశానికి పేరుప్రఖ్యాతులు తీసుకొచ్చే అమ్మాయిలు ఇక్కడిదాకా రాగలిగారంటే.. దాని వెనుక ఎన్నో కష్టాలు, సవాళ్లు దాగుంటాయి. అలాంటి స్ఫూర్తి గాథలను జీవితచరిత్రలుగా మలిచి వెండితెరకెక్కిస్తున్నారు ఎందరో దర్శకనిర్మాతలు. ఆ జాబితాలో తాజాగా బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అనుష్కా శర్మ కూడా చేరిపోయింది. భారత మహిళా క్రికెట్‌కు వన్నెలద్దిన బెంగాలీ ‘బబుల్‌’ జులన్‌ గోస్వామి బయోపిక్‌ను రూపొందిస్తున్నట్లు తాజాగా ప్రకటించిందీ అందాల తార. కేవలం దానికి నిర్మాతగానే కాదు.. అందులో జులన్‌ పాత్రను కూడా తనే పోషిస్తున్నట్లు చెబుతూ.. ఈ సినిమాకు సంబంధించిన తొలి టీజర్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఇలా పలువురు క్రీడాకారిణుల జీవితకథ నేపథ్యంలో తెరకెక్కిన బయోపిక్స్‌ గతంలోనూ కొన్నున్నాయి.

జులన్‌ గోస్వామి - చక్దా ఎక్స్‌ప్రెస్

భారత మహిళా క్రికెట్‌కు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చిన విమెన్‌ క్రికెటర్స్‌లో జులన్‌ గోస్వామి పేరు తప్పకుండా ఉంటుంది. ఆల్‌రౌండర్‌గా పేరుగాంచిన ఈ బెంగాలీ క్రికెటర్‌ బయోపిక్‌ను తాను రూపొందిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది అందాల తార అనుష్కా శర్మ. అమ్మయ్యాక మూడేళ్ల అనంతరం ఈ సినిమాతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించబోతోన్న అనుష్క.. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తూనే.. ఇందులో జులన్‌గానూ నటిస్తోంది. ‘చక్దా ఎక్స్‌ప్రెస్‌’ పేరుతో రూపొందుతోన్న ఈ బయోపిక్‌కు సంబంధించిన తొలి టీజర్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. ఓ సుదీర్ఘ క్యాప్షన్‌ పెట్టింది అనుష్క.

‘చక్దా ఎక్స్‌ప్రెస్‌ - క్రికెట్‌ కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మాజీ మహిళా క్రికెట్‌ కెప్టెన్‌ జులన్‌ గోస్వామి జీవితకథ స్ఫూర్తితో నిర్మిస్తోన్న చిత్రమిది. జులన్‌ క్రికెటర్‌గా మారాలని నిర్ణయించుకున్న సమయంలో.. క్రీడల గురించి ఆలోచించే మహిళలు చాలా అరుదనే చెప్పాలి. అలాంటి రోజుల్లో ఎన్నో సవాళ్లను దాటుకుంటూ ప్రపంచ వేదికపై తనను తాను నిరూపించుకున్న తీరు అసాధారణం. ఆమె జీవితంలోని ఇలాంటి మలుపులెన్నో ఈ బయోపిక్‌లో ఉన్నాయి. సరైన ప్రోత్సాహం, సౌకర్యాలు, ఆదాయం లేకపోయినా.. క్రికెట్‌నే కెరీర్‌గా ఎంచుకొని తన ప్రతిభతో దేశాన్ని గర్వపడేలా చేసిందామె.. ‘మహిళలకు క్రికెట్టా?’ అనే మూసధోరణుల్ని బద్దలుకొడుతూ దేశంలో ఎంతోమంది యువతులు ఈ ఆటను కెరీర్‌గా ఎంచుకునేందుకు మార్గనిర్దేశనం చేసింది. అభిరుచి, పట్టుదల ఉంటే దేన్నైనా గెలవచ్చన్న దానికి జులన్‌ జీవితమే ప్రత్యక్ష ఉదాహరణ. భారత క్రికెట్లో మహిళా విప్లవానికి తెర తీసిన ఇలాంటి క్రికెటర్లందరికీ సెల్యూట్‌ చేస్తున్నా. ఓ మహిళగా, క్రికెట్‌ లవర్‌గా జులన్‌ జీవితాన్ని తెరకెక్కించడం గర్వంగా ఉంది..’ అంది అనుష్క.

ఇక ఇదే టీజర్‌ని సోషల్‌ మీడియాలో పంచుకున్న జులన్‌.. ‘11 మంది సమష్టిగా ఆడితేనే విజయం సిద్ధిస్తుంది. మనం మన కోసం కాదు.. దేశం కోసం ఆడాలి..’ అంటూ తన నిరాడంబరతను చాటుకుందీ బెంగాల్‌ ఎక్స్‌ప్రెస్.


మిథాలీ రాజ్‌ - శెభాష్‌ మిథూ

రెండు దశాబ్దాలుగా భారత మహిళల క్రికెట్‌కు కర్త, కర్మ, క్రియ.. అన్నీ తానై ముందుండి నడిపిస్తోంది క్రికెట్‌ క్వీన్‌ మిథాలీ రాజ్‌. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లు అందుకుందామె.. ఎంతోమంది ఔత్సాహిక మహిళా క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచింది. అలాంటి ది లెజెండ్‌ క్రికెటర్‌ జీవితకథను ‘శెభాష్‌ మిథూ’ పేరుతో తెరకెక్కిస్తున్నారు బాలీవుడ్‌ దర్శకుడు శ్రీజిత్‌ ముఖర్జీ. ఇందులో డింపుల్‌ బ్యూటీ తాప్సీ పన్ను మిథాలీ రాజ్‌గా నటిస్తోంది. ఇక ఈ పాత్ర కోసం తాప్సీ మైదానంలోకి దిగి క్రికెట్‌ కూడా నేర్చుకుంది. మిథాలీ ఫ్రెండ్‌, కోచ్‌ దగ్గర క్రికెట్‌లో ఓనమాలు దిద్దానంటోందీ బాలీవుడ్‌ అందం.

‘మిథాలీది, నాది ఒకే రకమైన ఆలోచన విధానం. ఈ సినిమా కోసం ముఖ్యంగా నేను ఆమె ప్రవర్తన, హావభావాలపై దృష్టి పెట్టాను. ఇందుకోసం ఆమెతో తరచూ ఫోన్లో మాట్లాడడం, వీలు చిక్కినప్పుడల్లా ఆమెను కలవడం.. వంటివి చేశాను. కొన్ని సన్నివేశాల కోసం నెట్‌లో సాధన చేశా..’ అంటూ చెప్పుకొచ్చింది తాప్సీ. అంతేకాదు.. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను, మిథాలీని కలిసిన సందర్భాలను ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోల రూపంలో సోషల్‌ మీడియాలో పంచుకుంటుంటుందీ ఆన్‌స్క్రీన్‌ క్రికెటర్‌. ఈ సినిమా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.


సైనా - సైనా నెహ్వాల్

తన క్రీడా నైపుణ్యాలతో ఒకప్పుడు ప్రపంచ నం.1 బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిగా నిలిచింది హైదరాబాదీ షట్లర్‌ సైనా నెహ్వాల్‌. ఒలింపిక్‌ కాంస్య పతకంతో సహా ప్రపంచ వేదికలపై దేశానికి పతకాల పంట పండించిన ఈ స్టార్‌ స్మాషర్‌ జీవితకథతో ‘సైనా’ అనే బయోపిక్‌ను తెరకెక్కించారు దర్శకుడు అమోల్‌ గుప్తే. బాలీవుడ్‌ బ్యూటీ పరిణీతి చోప్రా సైనాగా నటించిన ఈ సినిమా గతేడాది మార్చిలో విడుదలై ప్రేక్షకుల ఆదరాభిమానాల్ని చూరగొంది. అయితే సైనా పాత్రలో ఒదిగిపోయేందుకు పరి చేసిన సాధన అంతా ఇంతా కాదు. తరచూ సైనాను కలవడంతో పాటు బ్యాడ్మింటన్‌ కూడా నేర్చుకున్నానంటోందీ బాలీవుడ్‌ అందం.

‘సైనా పాత్రలో ఒదిగిపోయేందుకు ఆమె లైఫ్‌స్టైల్‌ను దగ్గర్నుంచి గమనించాను. ఆమె ఆహారపుటలవాట్లు, గెలుపోటముల్ని స్వీకరించే విధానం, హావభావాలు, షటిల్‌ కోర్టులో ఉన్నప్పుడు ఆమె ప్రవర్తన ఎలా ఉంటుంది.. ఈ విషయాల గురించి ఓ చిన్న థీసిస్‌ తయారుచేశాను. ఇక బ్యాడ్మింటన్‌ సాధనలో భాగంగా థానేలోని షటిల్ అకాడమీలో చేరాక.. అక్కడి క్రీడాకారుల జీవన విధానం గురించి తెలుసుకున్నా. అప్పట్నుంచి ఓ అథ్లెట్‌గా ఉండడం ఆరంభించా. ఈ కఠిన సాధనే ఆన్‌స్క్రీన్‌పై సైనాలా మారేందుకు, పాత్రకు తగిన న్యాయం చేసేందుకు దోహదం చేసింది. దీనికి తోడు కోచ్‌ల సహాయంతో శారీరకంగా, మానసికంగానూ పూర్తి సన్నద్ధత సాధించా..’ అంటూ పాత్ర కోసం తాను సిద్ధపడిన విధానం గురించి ఓ సందర్భంలో పంచుకుంది పరి.


‘దంగల్‌’ గర్ల్స్!

 

అమ్మాయిలపై వివక్ష ఉన్న రాష్ట్రంలో పుట్టి.. అంతర్జాతీయ వేదికలపై దేశానికి కీర్తి ప్రతిష్ఠలు సంపాదించి పెట్టిన ఘనత ఫోగట్‌ సిస్టర్స్‌కే దక్కుతుందనడం అతిశయోక్తి కాదు. తండ్రి మహవీర్‌ సింగ్‌ ఫోగట్‌ ప్రోత్సాహంతో మల్లయుద్ధం (రెజ్లింగ్‌)లో దేశానికి పతకాల పంట పండించారు గీతా ఫోగట్‌, బబితా ఫోగట్‌. ఈ అక్కచెల్లెళ్ల జీవితకథ నేపథ్యంలో వచ్చిన ‘దంగల్‌’ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర ఎంత భారీ విజయాన్ని అందుకుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇందులో గీతగా ఫాతిమా సనా షేక్‌, బబితగా సన్యా మల్హోత్రా ఒదిగిపోయారు. మహవీర్‌ సింగ్‌ పాత్రలో నటించిన ఆమిర్‌ ఖాన్‌.. అమ్మాయిలూ అబ్బాయిలకేమీ తీసిపోరంటూ ఈ సమాజానికి చక్కటి సందేశాన్నిచ్చారు. అమ్మాయిలు ఆటల్లో రాణించలేరనే మూసధోరణిని బద్దలు కొట్టి.. అంతర్జాతీయ స్థాయిలో ఆడపిల్లల సత్తా చాటిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో పలు అవార్డులను సైతం అందుకుంది. అంతేకాదు.. వివిధ దేశాల్లోనూ ప్రదర్శితమై కలెక్షన్ల వర్షం కురిపించింది.


మహిళల సత్తా చాటాయి!

* భారత బాక్సింగ్ క్వీన్గా ఎదిగి దేశానికే గర్వకారణంగా నిలిచిన మణిపూర్‌ లెజెండ్‌ బాక్సర్‌ మేరీకోమ్‌ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘మేరీకోమ్‌’. ఇందులో మేరీగా ప్రియాంక చోప్రా నటన విమర్శకులను సైతం మెప్పించింది. ఈ పాత్రలో ఒదిగిపోవడానికి పీసీ కఠోర పరిశ్రమ చేసింది.. బాక్సింగ్‌ నేర్చుకుంది. ఓవైపు అమ్మగా, మరోవైపు కెరీర్‌ని బ్యాలన్స్‌ చేయడంలో మహిళలు సమర్థులు అని నిరూపించిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతో పాటు జాతీయ స్థాయిలో పలు అవార్డులు కూడా అందుకుంది.

* వయసు అంకె మాత్రమేనని లేటు వయసులో షార్ప్‌ షూటర్స్‌గా పేరుతెచ్చుకున్న వదినా మరదళ్లు చంద్రో తోమర్‌, ప్రకాషీ తోమర్‌ జీవితకథ ఆధారంగా ‘సాండ్‌ కీ ఆంఖ్‌’ అనే సినిమాను తెరకెక్కించారు దర్శకుడు తుషార్‌. ఇందులో చంద్రోగా భూమీ పడ్నేకర్‌, ప్రకాషీగా తాప్సీ తమ నటనతో మెప్పించారు. 2019లో విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందనే వచ్చింది.

వీటితో పాటు క్రీడల్లో మహిళలు ఎదుర్కొన్న వివక్ష, ఇతర సమస్యల్ని ఇతివృత్తంగా చేసుకుని పలు చిత్రాలు తెరకెక్కాయి. ‘రష్మీ రాకెట్‌’, ‘కౌసల్య కృష్ణమూర్తి’, ‘చక్‌దే ఇండియా’, ‘సుల్తాన్‌’.. వంటివి అందుకు ఉదాహరణలు!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని