అంతరిక్షంలో యోగాసనాలు వేసింది!
అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి శూన్యం. అందుకే వస్తువులైనా, అక్కడికెళ్లిన మనుషులైనా ఒక్క చోట నిలవకుండా కదులుతూనే ఉంటారు. మరి, అలాంటి చోట యోగా చేస్తే..? అది అసాధ్యం అంటారా? కానీ తలచుకుంటే ఇదీ సాధ్యమే అని నిరూపించారు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన....
(Photos: Screengrab)
అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి శూన్యం. అందుకే వస్తువులైనా, అక్కడికెళ్లిన మనుషులైనా ఒక్క చోట నిలవకుండా కదులుతూనే ఉంటారు. మరి, అలాంటి చోట యోగా చేస్తే..? అది అసాధ్యం అంటారా? కానీ తలచుకుంటే ఇదీ సాధ్యమే అని నిరూపించారు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన వ్యోమగామి సమంతా క్రిస్టోఫెరెటీ. ‘కాస్మిక్ కిడ్స్’ వ్యవస్థాపకురాలు, యోగా నిపుణురాలు అయిన జామీ ఆమోర్‌ను ఫాలో అవుతూ ఆమె వేసిన యోగాసనాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
యోగా చేయాలంటే సౌకర్యవంతమైన ప్రదేశం, అనువైన వాతావరణం ఉండాలనుకుంటారు చాలామంది. కానీ పట్టుదల ఉంటే చాలు.. ఎక్కడైనా యోగా చేసేయచ్చని నిరూపించింది సమంత. ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఉన్న ఆమె.. అక్కడ్నుంచే యోగాసనాలు వేసి అందరినీ అబ్బురపరిచింది.
ఎలాస్టిక్ బ్యాండ్‌తో బ్యాలన్స్ చేస్తూ..!
‘కాస్మిక్ కిడ్స్’ అనే యోగా ప్లాట్‌ఫామ్ వ్యవస్థాపకురాలు జామీ ఆమోర్‌తో కలిసి సమంత యోగాసనాలు వేసింది. ముందుగా వీరిద్దరూ ఆన్‌లైన్ ద్వారా కనెక్ట్ అయ్యారు. ఆపై జామీ ఇచ్చే సూచనలు ఫాలో అవుతూ సమంత యోగాసనాలు వేసింది. భార రహిత వాతావరణంలోనూ కదలకుండా ఒక చోట పొందికగా ఉండడానికి సమంత ఎలాస్టిక్ బ్యాండ్‌ను తన మెడకు కట్టుకుంది. ముందుగా వార్మప్‌తో ప్రారంభించిన ఆమె.. ఒక్కో ఆసనం వేస్తూ ఆకట్టుకుంది. శూన్య గురుత్వాకర్షణ శక్తిలోనూ తనను తాను బ్యాలన్స్ చేసుకుంటూ క్రిస్ క్రాస్.. వంటి యోగాసనాల్ని కూడా అలవోకగా వేసేసిందామె.
అంతరిక్షంలోనూ.. సాధ్యమే!
ఇలా సమంత చేసిన యోగాసనాలకు సంబంధించిన వీడియోను ‘కాస్మిక్ కిడ్స్’ సంస్థ ట్విట్టర్‌లో పంచుకుంది. సమంత కూడా.. ‘భార రహిత వాతావరణంలోనూ యోగా సాధ్యమే! అయితే దీనికి కాస్త శ్రమించాల్సి ఉంటుంది. కానీ ఓపిగ్గా చేస్తే ఏదీ అసాధ్యం కాదు.. కావాలంటే మీరే చూడండి..’ అంటూ తన వీడియోను ట్విట్టర్లో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. చాలామంది నెటిజన్లు సమంత పట్టుదల, అంకితభావాన్ని ప్రశంసిస్తున్నారు. ఆమె చేసిన యోగాసనాలు చూసి స్ఫూర్తి పొందుతున్నారు. ‘యోగా ఎక్కడైనా సాధ్యమే అని నిరూపించిన మీకు హ్యాట్సాఫ్!’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అంతరిక్షంలోకి.. రెండోసారి!
ఇటలీలోని మిలాన్‌లో జన్మించిన సమంతకు చిన్న వయసు నుంచే శాస్త్ర సాంకేతిక రంగాలంటే మక్కువ. ఈ దిశగానే చదువు కొనసాగించిన ఆమెను.. 2009లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వ్యోమగామిగా ఎంపిక చేసింది. ఆ తర్వాత శిక్షణ పూర్తిచేసుకొని 2014, నవంబర్ 23న అంతరిక్షంలోకి వెళ్లింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 200 రోజులు గడిపిన ఆమె.. 2015, జూన్ 11న భూమికి తిరిగొచ్చింది. మళ్లీ ఈ ఏడాది ఏప్రిల్ 27న ‘మిషన్ మినర్వా’లో భాగంగా రెండోసారి అంతరిక్షంలోకి వెళ్లిన సమంత.. తాజాగా అక్కడ్నుంచే యోగాసనాలు వేసింది. తాజాగా అంతరిక్ష కేంద్రానికి తొలి మహిళా యూరోపియన్ కమాండర్‌గా ఎంపికైన సమంత.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అంతరిక్షం నుంచి భూమిని వివిధ కోణాల్లో ఫొటోలు తీస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తుంటారు. ఇటీవలే అంతరిక్షంలో ‘హెల్త్ వన్’ అనే వైద్య పరికరం పనితీరు పైనా పరీక్షలు నిర్వహించారామె. వ్యోమగాముల ఆరోగ్యాన్ని పరీక్షించడానికి లేజర్ సాంకేతికతతో పని చేసే పోర్టబుల్ పరికరమిది!
ప్రస్తుతం సమంత భర్త, తన ఇద్దరు పిల్లలు జర్మనీలో నివాసముంటున్నారు. విదేశీ భాషలు నేర్చుకోవడానికి ఇష్టపడే ఈ లేడీ ఆస్ట్రోనాట్‌కు హైకింగ్, స్కూబా డైవింగ్ వంటి సాహస్యకృత్యాలంటే మక్కువట! అంతేకాదు.. సమయం దొరికినప్పుడల్లా యోగా కూడా సాధన చేస్తానంటోందామె.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.