Published : 03/02/2022 20:00 IST

K Pop Star: ‘బ్లాక్‌స్వాన్‌’కి అడుగు దూరంలో నిలిచింది!

(Photo: Instagram)

సంగీతానికి రాళ్లను కరిగించే శక్తి కూడా ఉందంటుంటారు. అందులోనూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పాప్‌ సంగీతం వింటూ మైమరచిపోని మనసుండదంటే అతిశయోక్తి కాదు. మరి, అలాంటి మ్యూజిక్‌ బ్యాండ్‌లో పాడే అవకాశం రావడమంటే పెట్టి పుట్టాలి. అంతటి అద్భుతమైన అవకాశానికి అడుగు దూరంలో నిలిచింది ఒడిశా రాక్‌స్టార్‌ శ్రేయా లెంకా. సంగీతం, డ్యాన్స్‌ అంటే ప్రాణం పెట్టే ఈ చిన్నది.. కొరియన్‌ పాప్‌ బ్యాండ్‌ బ్లాక్‌స్వాన్‌లో ఖాళీగా ఉన్న స్థానాన్ని భర్తీ చేయడానికి షార్ట్‌లిస్ట్‌ చేసిన ఇద్దరు ఫైనలిస్టుల్లో ఒకరిగా నిలిచింది. అదృష్టం వరించి ఈ పోటీలో గెలిస్తే.. కొరియన్‌ పాప్‌ బ్యాండ్‌లో చేరబోయే తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించనుందామె. ఈ నేపథ్యంలో ఈ యంగ్‌ సెన్సేషన్‌ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం రండి..

ఐదో స్థానం కోసం ఆ ఇద్దరూ..!

పాప్‌ సంగీతానికి ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానులున్నారని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అలాంటి పాప్‌ మ్యూజిక్‌ బ్యాండ్‌లలో దక్షిణ కొరియాకు చెందిన ‘బ్లాక్‌స్వాన్‌’ ఒకటి. 2020లో మొత్తం ఐదుగురు అమ్మాయిలతో ఏర్పడిన ఈ సంగీత బృందం నుంచి అదే ఏడాది నవంబర్‌లో హేమే అనే అమ్మాయి తప్పుకుంది. దీంతో ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఆడిషన్స్‌ నిర్వహించింది ఈ బ్యాండ్‌ మాతృక సంస్థ డీఆర్‌ మ్యూజిక్‌. ఇందులో భాగంగానే భారత్‌కు చెందిన శ్రేయా లెంకా, బ్రెజిల్‌ అమ్మాయి గ్యాబ్రియెలా దాల్సిన్‌ తుది పోటీలకు అర్హత సాధించారు. తుది స్థానం కోసం వీరిద్దరూ ఇప్పటికే దక్షిణ కొరియా చేరుకున్నారు. ఈ క్రమంలోనే నెల రోజుల సుదీర్ఘ శిక్షణ అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ ఈ తుది ఫలితాల్లో శ్రేయా గెలిస్తే.. కొరియన్‌ పాప్‌ బ్యాండ్‌లో చేరబోయే తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించనుంది.

యోగా రక్తంలోనే ఉంది!

ఒడిశా స్టీల్‌ సిటీగా పేరుగాంచిన రూర్కెలాలో 2003లో జన్మించింది శ్రేయా లెంకా. యోగా అంటే ప్రాణం పెట్టే కుటుంబంలో పుట్టిన ఆమె.. పెరిగి పెద్దయ్యే క్రమంలో ఈ వ్యాయామంపై ప్రేమ పెంచుకుంది. దీంతో చిన్న వయసు నుంచే తన కుటుంబ సభ్యులతో పాటు యోగాసనాలు వేయడం సాధన చేసేది. అంతేకాదు.. ఒడిస్సీ నృత్యం సాధన చేసే అక్కను చూసి తానూ ఎలాగైనా ఆ నృత్యం నేర్చుకోవాలని పట్టుబట్టింది. ఇక అప్పటికే యోగాతో తన శరీరాన్ని విల్లులా వంచడం అలవాటు చేసుకున్న శ్రేయకు ఒడిస్సీ నేర్చుకోవడం పెద్ద కష్టమేమీ కాలేదు. ఇలా తనలోని తపనను గుర్తించిన ఆమె తల్లిదండ్రులు ఆర్థిక స్థోమత అంతంతమాత్రమే అయినా వాటన్నింటినీ పక్కన పెట్టి ఆమెను వెన్ను తట్టి ప్రోత్సహించారు. ఇలా తన పట్టుదల, ఇంట్లో వాళ్ల ప్రోత్సాహంతో స్థానికంగా పలు నృత్య ప్రదర్శనల్లో సత్తా చాటింది శ్రేయ. పలు అవార్డులు సైతం అందుకుంది. ఒడిస్సీతో పాటు పలు సమకాలీన నృత్య రీతుల్ని సైతం అవపోసన పట్టింది.

ఆ క్రెడిటంతా మా బామ్మదే!

నిజానికి ఇలా డ్యాన్సే కాదు.. అద్భుతమైన గాత్రం ఈ యంగ్‌ సెన్సేషన్‌కి దేవుడిచ్చిన వరం అంటుంటారు ఆమె సన్నిహితులు. అయితే తనలో దాగున్న ఈ ప్రతిభను గుర్తించింది మాత్రం తన బామ్మే అంటోంది శ్రేయ.

‘నాకు నృత్యం అంటే ఎంత మక్కువో.. సంగీతమన్నా అంతే ఇష్టం. అయితే నాలో దాగున్న ఈ సంగీత ప్రతిభను గుర్తించింది మాత్రం మా బామ్మే. తనే నాకు హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇప్పించి ఆరితేరేలా చేసింది. ఇక పాశ్చాత్య సంగీతానికి సంబంధించిన మెలకువల్ని మాత్రం ఆన్‌లైన్‌ వీడియోలు చూసి నేనే సొంతంగా నేర్చుకున్నా..’ అంటోంది శ్రేయ. 18 ఏళ్ల వయసులోనే విభిన్న నృత్య, గాత్ర మెలకువల్ని అవపోసన పట్టిన ఈ చిన్నది.. ఇప్పటికే కొన్ని కొరియన్‌ పాప్‌ పాటలకు సంబంధించిన కవర్‌ సాంగ్స్‌ కూడా చేసింది. అంతేకాదు.. వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ మరింతమంది అభిమానుల్ని సంపాదించుకుంది.

ఇలా తన బహుముఖ ప్రజ్ఞతో ప్రస్తుతం ప్రపంచ వేదికపై పోటీపడుతోన్న ఈ యూత్‌ ఐకాన్‌.. కొరియన్‌ పాప్‌ బ్యాండ్‌ ‘బ్లాక్‌స్వాన్‌’లో చోటు దక్కించుకోవాలని మనసారా కోరుకుందాం..!

గుడ్‌ లక్‌ శ్రేయ!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని