‘అంధీ’ అంటూ హేళన చేశారు.. పరుగుతో సమాధానం చెప్పింది!

ఆ అమ్మాయి నెలలు నిండకుండానే జన్మించింది. అది కూడా కొసరంత కంటి చూపుతో..! దీనికి తోడు తనకు చెవులు కూడా పూర్తిగా ఏర్పడలేదు. ఇలా ఆ పసిపాప పరిస్థితి చూసి వైద్యులు కూడా చేతులెత్తేశారు. చివరకు ఏడు నెలల పాటు ఇంక్యుబేటర్‌లో ఉంచి చికిత్స అందిస్తే కానీ సాధారణ స్థితికి రాలేదామె. అలా చిన్నప్పుడే చావుతో పోరాడి గెలిచి నిలిచిన ఆ అమ్మాయి.. నేడు అదే పోరాట స్ఫూర్తితో ఒలింపిక్స్‌ బెర్తు దక్కించుకుంది.

Published : 07 Jul 2021 19:41 IST

Photo: Twitter

ఆ అమ్మాయి నెలలు నిండకుండానే జన్మించింది. అది కూడా కొసరంత కంటి చూపుతో..! దీనికి తోడు తనకు చెవులు కూడా పూర్తిగా ఏర్పడలేదు. ఇలా ఆ పసిపాప పరిస్థితి చూసి వైద్యులు కూడా చేతులెత్తేశారు. చివరకు ఏడు నెలల పాటు ఇంక్యుబేటర్‌లో ఉంచి చికిత్స అందిస్తే కానీ సాధారణ స్థితికి రాలేదామె. అలా చిన్నప్పుడే చావుతో పోరాడి గెలిచి నిలిచిన ఆ అమ్మాయి.. నేడు అదే పోరాట స్ఫూర్తితో ఒలింపిక్స్‌ బెర్తు దక్కించుకుంది. ఆమే.. దిల్లీకి చెందిన సిమ్రన్‌ శర్మ. తాజాగా టోక్యో పారాలింపిక్స్‌లో 100 మీటర్ల పరుగులో బెర్తు ఖరారు చేసుకొని.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు పుటల్లోకి ఎక్కింది.

భర్త ప్రోత్సాహంతో..!

వెన్ను తట్టి ప్రోత్సహిస్తే ఆకాశాన్నైనా అందుకుంటారు ఆడవారు. అందులోనూ కట్టుకున్న భర్త అండ లభిస్తే ఇక వారికి తిరుగనేది ఉండదు. సిమ్రన్‌ విషయంలో ఈ మాటలు మరోసారి నిజమయ్యాయి. ఎక్కువ దూరం చూడలేని సిమ్రన్‌ను పెద్ద మనసుతో మనువాడాడు ఆర్మీ జవాను నాయక్‌ గజేంద్ర సింగ్‌. భర్తగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తన అర్ధాంగి అభిరుచిని తెలుసుకున్నాడు. ఈ క్రమంలోనే పారా అథ్లెట్‌గా తన భార్య కలను సాకారం చేసేందుకు కోచ్‌గా మారాడు. ఆమె అథ్లెటిక్‌ ట్రైనింగ్ కోసం ఇల్లు సైతం అమ్మాడు. అప్పులు కూడా చేశాడు.

‘అంధీ’ అని అవహేళన చేశారు!

ఇటీవల దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో టోక్యో పారాలింపిక్స్ అర్హత పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో 100 మీటర్ల దూరాన్ని 12 సెకన్లలో పూర్తి చేసింది సిమ్రన్‌. ఈ క్రమంలోనే పారాలింపిక్స్‌కు అర్హత సాధించి.. ఈ ఘనత దక్కించుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. ‘పారాలింపిక్స్ లాంటి ప్రతిష్ఠాత్మక క్రీడల్లో భారతదేశానికి ప్రాతినిథ్యం వహిస్తానని కలలో కూడా అనుకోలేదు. ఈ ప్రయాణంలో ఎన్నో అవహేళనలు, అవమానాలు ఎదుర్కొన్నాను. చాలామంది నన్ను ‘అంధీ (గుడ్డిది)’ అని పిలిచేవారు. నా తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అందుకే అథ్లెటిక్స్‌లో ఆసక్తి ఉన్నప్పటికీ అందులో శిక్షణ పొందలేకపోయాను. అప్పుడే చీకటి నిండిన నా జీవితంలోకి వెలుగులా వచ్చారు మావారు. ఆయన ప్రోత్సాహం వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నాను’ అని అంటోందీ పారా అథ్లెట్.

పెళ్లైన మరుసటి రోజే..!

సిమ్రన్‌, గజేంద్ర సింగ్‌ 2017లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ‘జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో ఒకసారి గజేంద్ర సింగ్‌ను కలిశాను. ఆయన కూడా ఓ అథ్లెట్‌. క్రీడలపై మంచి అవగాహన ఉంది. ఈ క్రమంలోనే ఆట కోసం నేను పడుతున్న తాపత్రయాన్ని బాగా అర్థం చేసుకున్నారు. పెళ్లైన మరుసటి రోజే నన్ను జిమ్‌కు తీసుకెళ్లారు. ఇల్లు అమ్మి ఈ క్రీడలో నాకు శిక్షణ కూడా ఇప్పించారు. ట్రైనింగ్‌లో భాగంగా రోజూ ఆయనే నన్ను స్టేడియానికి తీసుకెళ్లేవారు. ఇలా సుమారు నాలుగేళ్ల పాటు మా జీవితాల్ని ఆటకు అంకితం చేశాం. ఈ కష్టానికి ప్రతిఫలమే పారాలింపిక్స్‌ బెర్తు. ఈ పోటీల్లో పతకం సాధించేందుకు నా శాయశక్తులా కృషి చేస్తాను’ అని అంటోంది సిమ్రన్.

తండ్రి వెంటిలేటర్‌పై ఉండగానే!

దిల్లీకి చెందిన ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టింది సిమ్రన్‌. ముగ్గురు సంతానంలో ఆమె అందరి కంటే చిన్నవారు. ఈ క్రమంలో 2019లో తన తండ్రి వెంటిలేటర్‌పై ఉండగానే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొంది సిమ్రన్‌. ఫైనల్స్‌ వరకు వెళ్లి సత్తా చాటింది. ఆ పోటీలు ముగిసిన వెంటనే ఆమె తండ్రి కన్నుమూశారు. అదే ఏడాది చైనా గ్రాండ్‌ ప్రిక్స్‌ పోటీల్లో స్వర్ణ పతకం గెల్చుకుందీ సూపర్‌ వుమన్‌. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయి వేదికగా జరిగిన వరల్డ్‌ పారా గ్రాండ్‌ ప్రిక్స్‌లోనూ బంగారు పతకం సాధించింది.

అందుకే అప్పులు చేశాను!

ఈ క్రమంలో సిమ్రన్‌ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తోన్న భర్త గజేంద్ర సింగ్‌ మాట్లాడుతూ- ‘నా భార్యకు దృష్టి లోపం ఉన్నప్పటికీ ఏ విషయాన్నైనా వెంటనే పసిగడుతుంది. ఆమెకు పరిశీలనా శక్తి ఎక్కువ. దేశం తరఫున పతకాలు గెలవాలన్న ఆకాంక్ష ఆమె అణువణువునా నిండి ఉంది. ఈ క్రమంలో సిమ్రన్‌ శిక్షణ కోసం ప్రభుత్వంతో పాటు ఇండియన్‌ ఆర్మీ మాకు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. అయితే అవి సరిపోవడం లేదు. అందుకే ఇంటిని అమ్మేశాను. బ్యాంకు నుంచి రూ.3 లక్షల రుణం తీసుకోవడంతో పాటు మరికొందరు స్నేహితుల దగ్గర అప్పులు చేశాను. ప్రస్తుతానికి ఈ సమస్యలు పెద్దగా కనిపించచ్చు. కానీ ఒకసారి ఆమె పతకంతో తిరిగి వస్తే.. ఆ సంతోషం ముందు ఈ కష్టాలన్నీ చిన్నవైపోతాయి. ఈ సందర్భంగా నా సతీమణిలా ఆటల్లో రాణిస్తోన్న మహిళలందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.. ‘ఏ పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయద్దు. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. కష్టపడండి. మీపై మీరు నమ్మకం పెంచుకోండి’.. అని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్