500 రోజులు గుహలోనే ఒంటరిగా గడిపింది!

మన వాళ్లను వదిలి ఓ పూట ఊరెళ్తేనే ఉండలేం. అలాంటిది ఫోన్లు పక్కన పెట్టి, ఈ ప్రపంచంతో సంబంధాలు తెంచుకొని, ఒంటరిగా ఓ చీకటి గుహలో ఉండడమంటే.. ఆ ఊహే భయంకరంగా ఉంది కదూ! అలాంటి సాహసమే చేసింది స్పెయిన్‌కు చెందిన బియాట్రిజ్‌ ఫ్లామిని. వృత్తిరీత్యా క్రీడాకారిణి, పర్వతారోహకురాలైన....

Updated : 18 Apr 2023 17:31 IST

(Photo: Instagram)

మన వాళ్లను వదిలి ఓ పూట ఊరెళ్తేనే ఉండలేం. అలాంటిది ఫోన్లు పక్కన పెట్టి, ఈ ప్రపంచంతో సంబంధాలు తెంచుకొని, ఒంటరిగా ఓ చీకటి గుహలో ఉండడమంటే.. ఆ ఊహే భయంకరంగా ఉంది కదూ! అలాంటి సాహసమే చేసింది స్పెయిన్‌కు చెందిన బియాట్రిజ్‌ ఫ్లమిని. వృత్తిరీత్యా క్రీడాకారిణి, పర్వతారోహకురాలైన ఆమె.. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 500 రోజులు చిమ్మ చీకట్లు కమ్ముకున్న గుహలో కాలం గడిపింది. అక్కడే రెండు పుట్టినరోజులు జరుపుకొన్న ఆమె.. తాజాగా గుహ నుంచి బయటికొచ్చింది. ఇలా సాటి వ్యక్తితో సంబంధం లేకుండా ఒంటరిగా గడపడం ఓ అద్భుతమైన అనుభూతినిచ్చిందంటోన్న బియాట్రిజ్‌.. అసలెందుకిలా చేసింది? ఇన్ని రోజులు ఒంటరిగా చీకటి గుహలో ఉండాల్సిన అవసరం ఆమెకేంటి? అసలు దీని వెనకున్న కారణమేంటి? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

స్పెయిన్‌కు చెందిన 50 ఏళ్ల బియాట్రిజ్‌ వృత్తిరీత్యా సాహస క్రీడాకారిణి.. పర్వతారోహకురాలు కూడా! పర్వతారోహణపై ఔత్సాహికులకు శిక్షణ కూడా ఇస్తుంటుంది. ఇప్పటివరకు తన కెరీర్‌లో ఎన్నో విజయాలు నమోదు చేసిన ఆమె.. పలు అవార్డులు కూడా అందుకుంది. అయితే ఇలా కెరీర్‌ పరంగానే కాదు.. వ్యక్తిగతంగా పలు సాహసాలు చేయడానికీ వెనకాడదామె. ఈ క్రమంలోనే ఇటీవలే ఓ అధ్యయనంలో కీలక పాత్ర పోషించింది బియాట్రిజ్‌.

‘టైమ్‌వేవ్‌’ కోసం..!

స్పెయిన్‌లోని గ్రెనడా, అల్మేరియా విశ్వవిద్యాయాలకు చెందిన శాస్త్రవేత్తలు; మాడ్రిడ్‌కు చెందిన ఓ స్లీప్‌ క్లినిక్‌ సంయుక్తంగా.. ‘టైమ్‌వేవ్‌’ పేరుతో ఓ ప్రాజెక్ట్‌ చేపట్టింది. ఇందులో భాగంగా.. రోజులో ఒక వ్యక్తిలో శారీరకంగా, మానసికంగా, ప్రవర్తన పరంగా జరిగే మార్పులు; మెదడు సామర్థ్యం; ఒంటరిగా-సమయం తెలియని అయోమయ పరిస్థితులు నిద్రపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్న.. పలు అంశాలపై అధ్యయనం చేయాలనుకున్నారు. ఇందుకోసం బియాట్రిజ్‌ను ఎంచుకుందీ శాస్త్రవేత్తల బృందం. ఆమెను 500 రోజుల పాటు ఈ ప్రపంచానికి దూరంగా.. ఓ చిమ్మ చీకటి గుహలో ఉంచాలనుకుంది. ఈ ఉద్దేశంతోనే 2021, నవంబర్‌ 21న ఆమెను.. అక్కడి మోత్రిల్‌ అనే నగరంలోని ఓ గుహలో 230 అడుగుల లోతుకు పంపించింది. అప్పట్నుంచి సుమారు 500 రోజుల పాటు బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచుకొని అదే గుహలో కాలం గడిపిందీ స్పెయిన్‌ అథ్లెట్‌.

అవి మాత్రమే తీసుకెళ్లా..!

అయితే తాజాగా ఈ గుహ నుంచి బయటికొచ్చింది బియాట్రిజ్‌. సుమారు ఏడాదిన్నర తర్వాత సహజ వెలుతురును చూసిన ఆమె.. బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచుకొని, గుహలో ఒంటరిగా గడపడం అద్భుతమైన అనుభూతినిచ్చిందంటోంది.
‘మొబైల్‌ లేదు.. ఈ ప్రపంచంతో సంబంధం లేదు.. సుమారు ఏడాదిన్నర పాటు ఎవరితోనూ మాట్లాడలేదు.. నాతో నేనే మాట్లాడుకునేదాన్ని. అయితే నేను గుహలోకి వెళ్లేటప్పుడు 60 పుస్తకాలు, వెయ్యి లీటర్ల నీళ్లు, హెడ్‌ల్యాంప్‌ తీసుకెళ్లా. పెయింటింగ్‌, డ్రాయింగ్‌ వేస్తూ.. ఉన్ని టోపీలు కుడుతూ సమయం గడిపాను. ఫిట్‌నెస్‌ కోసం వ్యాయామాలూ చేశాను. ఇలా నా ప్రతి కదలికను బంధించడానికి రెండు కెమెరాలూ వెంట పెట్టుకెళ్లా. ఇక నాకు కావాల్సిన ఆహారం, ఇతర అత్యవసర వస్తువులు తరచూ నా సహాయక బృందం.. తాడు సహాయంతో గుహలోకి పంపించేది..’ అంటూ తన అనుభవాలు పంచుకుంది బియాట్రిజ్‌.

సమయమే తెలియలేదు!

చీకటి ప్రదేశంలో కాసేపైనా ఉండలేం. అలాంటిది గుహలో అంటే ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయం అనుక్షణం వెంటాడుతుంది. కానీ చీకటిగా ఉన్నా, ప్రపంచంతో సంబంధం లేకపోయినా గుహలు సురక్షితమైన ప్రదేశాలే అంటోంది బియాట్రిజ్‌.

‘గుహలంటే చాలామందికి ఒక రకమైన భయం ఉంటుంది. చిమ్మ చీకటి కమ్ముకున్న ఆ ప్రదేశంలో ఎటు నుంచి ఏ ఆపద వస్తుందోనని ఆందోళన చెందుతుంటారు. సూర్యరశ్మి కానరాకపోవడంతో మెదడు ప్రతికూలంగా స్పందిస్తుంది. మరోవైపు సమయం ఎలా గడిచిపోతుందో తెలియక సతమతమవుతుంటారు. కానీ నాకైతే గుహలో చాలా సురక్షితంగా, ప్రశాంతంగా అనిపించింది. గుహలోకి వెళ్లిన మరుక్షణం నుంచి బయటి ప్రపంచం గురించి పట్టించుకోవడం, రోజులు లెక్కపెట్టడం మానేశా. దీంతో ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం, క్వీన్‌ ఎలిజబెత్‌-2 మరణం.. గురించిన విషయాలేవీ నాకు తెలియలేదు. ఇక నా రెండు పుట్టినరోజులు కూడా గుహలోనే గడిచిపోయాయి. అయితే గుహలో ఉన్నప్పుడు ఒకానొక సమయంలో ఈగలు నాపై దాడి చేశాయి. ఆ ఒక్క చేదు సంఘటన తప్ప గుహలో ఇన్ని రోజులూ సంతోషంగా గడిచిపోయాయి..’ అంటూ చెప్పుకొచ్చిందీ డేరింగ్‌ అథ్లెట్.


‘గిన్నిస్‌’లో చోటు?

అయితే అధ్యయనంలో భాగంగా 500 రోజులు గుహలోనే గడిపిన బియాట్రిజ్‌ కదలికల్ని.. మానసిక నిపుణులు, గుహలపై అధ్యయనం చేసే నిపుణులు, ఈ అధ్యయనంలో భాగమైన శాస్త్రవేత్తలు, ఫిట్‌నెస్‌ ట్రైనర్స్‌.. నిరంతరం పర్యవేక్షించారు. అలాగే తన ప్రతి కదలికను, జీవనశైలిని డాక్యుమెంటరీ రూపంలో కెమెరాల్లో బంధించిన ఆమె.. వాటిని పరిశోధకులకు సమర్పించింది. అంతేకాదు.. బియాట్రిజ్‌ చేసిన ఈ సాహసాన్ని ప్రస్తుతం గిన్నిస్‌ రికార్డుకు చెందిన బృందం పరిశీలిస్తోంది. కాగా, గతంలో ఈ తరహా రికార్డులు రెండు నమోదయ్యాయి. 1987లో ఇటలీకి చెందిన సోషియాలజిస్ట్‌ మౌరిజియో 210 రోజులు గుహలో గడిపి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆపై 2016లో సెర్బియాకు చెందిన ఓ వ్యక్తి ఈ రికార్డును బద్దలుకొడుతూ 460 రోజులు భూగర్భంలో గడిపారు. ఇక ఇప్పుడు ‘గుహలో అత్యధిక కాలం జీవించిన వ్యక్తి’గా బియాట్రిజ్‌ పేరును గిన్నిస్‌ వారు పరిశీలిస్తున్నారు. ఏదేమైనా.. ఈ స్పెయిన్‌ అథ్లెట్‌ సాహసం ఇటు అధ్యయనానికి, అటు ప్రపంచ రికార్డు సృష్టించేందుకు.. ఇలా రెండు విధాలుగా తోడ్పడిందని చెప్పచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్