Mothers Day: అమ్మ ఒక యోధ

మగవాళ్లతో పోటీపడి అన్ని రంగాల్లో దూసుకెళుతున్నా.. మనసులో ఏదో మూల ‘ఇంటి బాధ్యత’ మనదేనని మనలో బలంగా నాటుకుపోయింది.

Updated : 14 May 2023 07:37 IST

నేడు మాతృ దినోత్సవం

మగవాళ్లతో పోటీపడి అన్ని రంగాల్లో దూసుకెళుతున్నా.. మనసులో ఏదో మూల ‘ఇంటి బాధ్యత’ మనదేనని మనలో బలంగా నాటుకుపోయింది. అందుకే జాగ్రత్తగా ఉంటున్నా పిల్లలకు ఏదో తక్కువ చేస్తున్నామన్న వెలితి. సాధారణ ఉద్యోగి నుంచి సెలబ్రిటీల వరకూ ఈ ‘మామ్‌గిల్ట్‌’ని తప్పించుకోలేకపోతున్నారు. ఒంటి చేత్తో అన్నింటినీ చక్కపెట్టే అమ్మ ఒక యోధ. తనకు ఆ అపరాధభావన అవసరం లేదంటున్నారు నిపుణులు. అసలీ భావన ఎందుకు కలుగుతుంది? దాన్నుంచి బయటపడటం ఎలానో చూడండి...

ఇంటికొచ్చేసరికి ఆదమరిచి నిద్రపోయే చిన్నారి.. తనకు బాగోలేకపోయినా పక్కనుండలేని పరిస్థితి.. ఆఫీసు పనిలో పడి స్కూలు కార్యక్రమాలకు హాజరు కాలేకపోవడం.. అనుకోకుండా జరిగేవే అయినా అమ్మల మనసుపై తెలియని భారం మోపేస్తాయి. ఒక్కోసారి పని హడావుడిలో ఉంటామా.. వాళ్లేమో ‘అమ్మా.. ఆడుకుందా’మని గోముగా కోరతారు. ఇప్పుడు కాదులెమ్మని సర్దిచెప్పినా బెట్టు చేస్తే.. ఓ విసుగో.. బెదిరింపో పెదవి జారుతుంది. వాళ్ల కళ్లల్లో తిరిగే నీళ్లు.. తెలియకుండానే గుండెకు గాయం చేస్తాయి. పిల్లల భవిష్యత్తు కోసమే ఇల్లు- ఆఫీసు మధ్య కష్టపడుతున్నా.. చాలామంది తల్లులకు ఎదురయ్యే బహుమానాలివి. దీనికితోడు మనసులో ‘నేను సరైన అమ్మనేనా?’ అని వేధించే అనుమానం! పిల్లలను విడిచి స్నేహితులను కలవడానికి వెళ్లినా.. వారికి బాగోలేనప్పుడు పక్కన ఉండలేకపోయినా.. ఖాళీ కడుపుతో పడుకున్నా.. ‘నాదే తప్పు’ అని లోలోపలే మదన పడటం. పిల్లలకు అన్యాయం చేస్తున్నానని బాధపడటం.. దీన్నే ప్రపంచవ్యాప్తంగా ‘మామ్స్‌ గిల్ట్‌’గా పిలుస్తున్నారు.

కారణాలేంటి?

అమ్మ పాత్రలో ఒదగడమే కష్టం. పుట్టిన క్షణం నుంచే బిడ్డని ప్రేమించడం, వాళ్ల సంరక్షణ బాధ్యతగా స్వీకరించడం మన విధిగా భావిస్తాం. చుట్టూ పెరిగిన వాతావరణం, విన్న కథలు, సంస్కృతి.. ఇవన్నీ తెలియకుండానే మనలో ఆ భావన పెరిగేలా చేస్తాయి. ఆ విధుల్లో వేటిని సరిగా నిర్వర్తించలేకపోయినా ఈ అపరాధభావన చుట్టేస్తుంది. బాధ, తికమక, కోపం, భయం.. ఇలా అనేక రూపాల్లో బయటపడుతుంది. మనసుపై ఒత్తిడి పెంచుతుంది. వాళ్లకి ఏ చిన్న ఇబ్బందొచ్చినా కంగారు పడటం, తెలియకుండానే ఏడ్చేయడం.. వాళ్లు కోరగానే కష్టమైనా తెచ్చివ్వడం ఇలాంటివన్నీ దాన్నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలే. ఇది మనకే కాదు.. పిల్లలకీ మంచిది కాదు.

బయటపడేదెలా?

పాలు పడకపోవడం.. పిల్లల కోసం రాజీనామా చేసిన స్నేహితురాలు.. ‘నా మీద నీకు ప్రేమే లేద’నే చిన్నారి
కంప్లైంట్‌.. ‘పిల్లల కన్నా ఉద్యోగమెక్కువా’ అని తెలిసినవారు వేసే ప్రశ్న.. చిన్నతనంలో ఎదురైన పరిస్థితులు.. ఇలా ఈ ‘గిల్ట్‌’ ఏర్పడటానికి కారణాలెన్నో! వీటిల్లో మీదేది? ప్రకృతి సంబంధ విషయాలకు ఏమీ చేయలేం అవునా! అలాంటప్పుడు దాని గురించి ఆలోచించి ప్రయోజనమేంటి? ‘సమయం ఇవ్వలేకపోతున్నా’ చాలామంది బాధే ఇది. అందరి ఆర్థిక పరిస్థితులూ ఒకేలా ఉండవు. కాబట్టి, ఉద్యోగం తప్పనిసరైతే పోల్చుకోవడం అనవసరం. ఇక బయటివాళ్ల ఒత్తిడా? ‘ఎవరేమనుకుంటారో’ అని బతికినంతకాలం ఏదో రూపంలో ఈ ఒత్తిడి సహజమే.

* పిల్లల కోసమే తాపత్రయ పడుతున్నా అని మీకు అనిపించినంత వరకూ వేటినీ పట్టించుకోవద్దు. ఇక పిల్లల ఫిర్యాదులంటారా? ఎక్కువగా పనిలోనే గడిపేస్తున్నారా? ఈ ప్రశ్న వేసుకోండి. ఎక్కువ కేటాయించలేకపోయినా ‘నాణ్యమైన సమయం’ ఇస్తున్నామా అన్నది చూసుకోండి. సహోద్యోగులతో మాట్లాడుకొని త్వరగా ఇంటికి చేరేలా చూసుకోవడం, పిల్లల ముఖ్యమైన తేదీలకు రిమైండర్లను పెట్టుకొని ప్లాన్‌ చేసుకోవడం, వాళ్లతో ఉన్న సమయంలో టీవీ, ఫోన్‌ పక్కన పెట్టేసి కబుర్లు చెప్పడం, బయటకు తీసుకెళ్లడం, సెలవులు ప్లాన్‌ చేసుకోవడం చేస్తూనే.. ఉద్యోగినిగా మీ బాధ్యతలనూ చెప్పండి. అర్థం చేసుకుంటారు.. అయితే రెండింటినీ చక్కగా సమన్వయం చేసుకోవాలి.


‘పర్‌ఫెక్ట్‌ అమ్మ’ పేరిట లేని కిరీటాన్ని ఊహించుకొని గర్భిణి అయినప్పటి నుంచే తెలియని ఆందోళన, ఒత్తిడికి గురవుతుంటాం. ప్రతి అమ్మకీ చిన్నారి పెంపకంలో ఒక్కోదశా అమూల్యమే. పక్కవాళ్లతో పోల్చుకోవడం మాని ఆస్వాదించండి. అమ్మగా మీ ప్రయాణ పుస్తకాన్ని మీకనుగుణంగా రాసుకుంటూ సాగిపోండి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్