Women Economists: వాల్‌స్ట్రీట్ జాబితాలో మనవాళ్లు!
ఆడవాళ్లకు ఆర్థిక విషయాల్లో అవగాహన అంతంతమాత్రమే అని చాలామంది భావన... అలాంటివారి మాటలకు అడ్డుకట్ట వేస్తూ, ఆంక్షల అడ్డుగోడల్నీ, లింగ, వర్ణ వ్యత్యాసాల్నీ దాటుకుంటూ.... అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థలో అగ్రతాంబూలం అందుకున్నారు ఓ వందమంది మహిళలు.
ఆడవాళ్లకు ఆర్థిక విషయాల్లో అవగాహన అంతంతమాత్రమే అని చాలామంది భావన... అలాంటివారి మాటలకు అడ్డుకట్ట వేస్తూ, ఆంక్షల అడ్డుగోడల్నీ, లింగ, వర్ణ వ్యత్యాసాల్నీ దాటుకుంటూ.... అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థలో అగ్రతాంబూలం అందుకున్నారు ఓ వందమంది మహిళలు. ఈ ప్రతిష్ఠాత్మక జాబితాను వాల్‌స్ట్రీట్ జర్నల్ అనుబంధ సంస్థ బ్యారన్ ప్రకటించింది. వారిలో ఐదుగురు భారత సంతతి వారు కావడం గర్వకారణం.
అమ్మ మాటే పాఠంగా
రూపల్ జె బన్సాలీ
ముంబయికి చెందిన రూపల్ తండ్రి స్టాక్ బ్రోకర్ కావడంతో సహజంగానే ఆర్థిక అంశాలపై ఇష్టం ఏర్పడిందామెకు. అయితే, 1970లో మార్కెట్ అస్థిరత... స్టాక్ నష్టాలు ఆ కుటుంబాన్ని దెబ్బతీశాయి. ఆ సమయంలో ‘ఆర్థిక స్థిరత్వం సాధిస్తేనే సంతోషంగా ఉండగల’మని తల్లి చెప్పిన మాటలు రూపల్‌పై ప్రభావం చూపించాయి. దాంతో కాలేజీకి వెళ్తూనే ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, స్టాక్ బ్రోకింగ్ వంటి అంశాల్లో అప్రెంటిస్‌గా పనిచేశారు. ఇండియాలో బ్యాంకింగ్, కామర్స్‌ల్లో మాస్టర్స్ చేశారు రూపల్. ఆపై రోటరీ ఫౌండేషన్ ఫండింగ్‌తో అమెరికా వెళ్లి ఫైనాన్స్‌లో ఎంబీఏ చేశారు. చదువు పూర్తయినా అప్పటి గల్ఫ్‌యుద్ధ సంక్షోభం, స్టాక్ మార్కెట్ ఒత్తిడి వంటివి ఉద్యోగ వేటను క్లిష్టతరం చేయడంతో పెట్టుబడుల రంగంలోకి అడుగు పెట్టారామె. ప్రస్తుతం ఏరియల్ ఇన్వెస్ట్‌మెంట్‌లో చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్‌గా, పోర్టుఫోలియో మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ‘సంక్షోభ సమయాల్లో ఖాతాదారులను సురక్షిత మార్గాలవైపు మళ్లించడమే తన విజయానికి కారణం’ అంటారు రూపల్.
ఇరవైనాలుగేళ్ల అనుభవం
అను అయ్యంగార్
ప్రపంచ అగ్రశ్రేణి పెట్టుబడుల బ్యాంకుల్లో ఒకటైన జేపీ మోర్గాన్ ఛేజ్‌లో విలీనాలూ, కొనుగోళ్ల విభాగానికి అంతర్జాతీయ అధిపతి అను. ఈ సంస్థలో ఇరవై నాలుగేళ్ల అనుభవం క్లిష్టమైన మార్కెట్ నాడిని పట్టుకోవడంలోనూ, తన క్లయింట్‌లకు నమ్మకమైన మార్గదర్శకత్వం అందించడంలోనూ ఆవిడను మేటిగా నిలబెట్టాయి. స్వస్థలం కేరళ. తండ్రి సివిల్ సర్వెంట్. తల్లి టీచర్. చదువు నిమిత్తం అమెరికాలో అడుగుపెట్టిన అను జాత్యాహంకారాన్నీ, లింగ, వర్ణ వివక్షనూ అడుగడుగునా ఎదుర్కొన్నారు. తన ప్రతిభతో వాటిని దాటి ఎమ్‌అండ్‌ఏ విభాగంలోని సుమారు రూ.50వేల కోట్ల విలువైన లావాదేవీలను సమర్థంగా నిర్వహిస్తున్నారు.
ఆర్కిటెక్ట్ అవ్వాలనుకొని
సోనాల్ దేశాయ్
ఆర్కిటెక్ట్ కావాలనుకుని ఆర్థికవేత్త అయ్యారు సోనాల్. దిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ ఎకనామిక్స్, అమెరికాలోని నార్త్‌వెస్ట్రన్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు. పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కెరియర్‌ని ప్రారంభించి... అంతర్జాతీయ ద్రవ్యనిధి, డ్రెస్డ్నర్ క్లీన్‌వోర్ట్ వాసర్ స్టెయిన్, థేమ్స్ రివర్ క్యాపిటల్‌లోనూ కొన్నాళ్లు పనిచేశారు. 2009లో ‘ఫ్రాంక్లిన్ టెంపుల్టన్’లో చేరిన ఆమె... 2018లో ఈ సంస్థ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌కు ముఖ్య పెట్టుబడుల అధికారిగా నియమితులయ్యారు. ఈ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగానూ రికార్డు సాధించారు. ప్రస్తుతం సోనాల్ నిర్వహణలో రూ.13వేల కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఫ్రాంక్లిన్ మున్సిపల్, కార్పొరేట్ క్రెడిట్, ఫ్లోటింగ్ రేట్, మల్టీసెక్టార్, గ్లోబల్ (ఎమర్జింగ్ మార్కెట్‌లతో సహా), మనీ మార్కెట్ ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ టీమ్‌ల బాధ్యత డాక్టర్ సోనాల్‌దే. అభివృద్ధి చెందుతున్న మార్కెట్ అడ్జెస్ట్‌మెంట్‌లపై ప్రత్యేకంగా పనిచేసిన ఆమె, విధానాల రూపకల్పన, సంక్లిష్టతను అర్థం చేసుకుని....కొత్త ప్రణాళికలు తయారు చేయడంలో సిద్ధహస్తురాలు.
ఆటకు దూరమై
మీనా లక్డావాలా ఫ్లిన్
ఒకప్పుడు మీనా ఒలింపిక్స్ పోటీలకు సిద్ధపడ్డ జిమ్నాస్ట్. మోకాలి గాయం కారణంగా ఆటకు దూరమైన ఆమెను ఆర్థికరంగం ఆకర్షించింది. జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్‌లో పట్టా అందుకున్న.... మీనా బిల్లింగ్స్ రామ్‌సే గ్రూప్‌లో ఇంటర్న్‌షిప్ చేశారు. తర్వాత జేపీ మోర్గాన్ ఛేజ్‌లో పనిచేశాక గోల్డ్‌మన్ శాక్స్‌కు మారారామె. అప్పటి నుంచి గ్లోబల్ ఇన్‌క్లూజన్ డైవర్సిటీ కమిటీకి కో ఛైర్‌గానూ వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం గ్లోబల్ ప్రైవేట్ వెల్త్ మేనేజ్‌మెంట్‌కి కో-హెడ్ కూడా.
తమిళ అమ్మాయి
సవితా సుబ్రమణియన్
తమిళనాడుకు చెందిన సవిత కుటుంబం అమెరికాలో స్థిరపడింది. కొలంబియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేసిన ఆమె 2001లో మెరిల్ లించ్‌లో చేరారు. అంతకుముందు కొన్నాళ్లు శాన్‌ఫ్రాన్సిస్కోకి చెందిన స్కడ్డర్ కెంపర్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కి విశ్లేషకురాలుగానూ పనిచేశారు. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్‌లో యూఎస్ ఈక్విటీ అండ్ క్వాంటిటేటివ్ స్ట్రాటజీ హెడ్‌గా, ఎన్విరాన్‌మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్(ఈఎస్‌జీ) ఎండీగా పనిచేస్తున్నారు. ఈక్విటీలపై యూఎస్ విభాగాల వారీగా కేటాయింపులను సిపార్సు చేయడం, ఎస్‌అండ్‌పీ- 500, ఇతర ప్రధాన సూచీలకు అంచనాలను నిర్ణయించడం చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.